Amaravati: ఇంతలో ఎంత మార్పు! అమరావతి నుంచి సామగ్రి తరలింపుపై సీఆర్డీఏ అధికారుల స్పందన

అమరావతి – తుళ్లూరు : రాజధానిలో రోడ్లు తవ్వుకుపోతున్నా.. ఏమాత్రం స్పందన లేదు. రైతులకు కేటాయించిన ప్లాట్లలో మట్టిని తీసుకెళ్తున్నా… అడ్డుకోలేదు. నిర్మాణాల నుంచి ఇనుప సామగ్రిని దొంగిలించుకెళ్తున్నా.. ఫిర్యాదు చేసిన పాపాన పోలేదు. ఉద్దండరాయునిపాలెంలోని ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన స్థలంలో అమరావతి ప్రణాళిక నమూనాలను ధ్వంసం చేసినా.. ఉలుకూపలుకూ లేదు. రాజధానిలో సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు వెంబడి వేయాల్సిన భారీ తాగునీటి పైపులను అనుమతి లేకుండానే గుత్త సంస్థ పట్టుకెళ్తున్నా.. సంబంధం లేనట్లు ఊరుకున్నారు… గత ఐదేళ్లలో ఇదీ సీఆర్డీఏ అధికారుల వ్యవహార శైలి. అమరావతికి వ్యతిరేకంగా సీఎం జగన్‌ వ్యవహరిస్తుండటంతో.. సీఆర్డీఏ అధికారులూ ఇందుకు తగ్గట్లే నడుచుకున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలు మినహా మిగిలిన వాటిని పూర్తిగా గాలికొదిలేశారు. అలాంటి అధికారులు గురువారం ఇందుకు విరుద్ధంగా వ్యవహరించారు. మందడంలోని నిల్వ కేంద్రం నుంచి ఎల్‌ అండ్‌ టీ సంస్థ… వ్యాపారులకు విక్రయించిన సరకును ఆఘమేఘాలపై వెనక్కి రప్పించి, అన్‌లోడింగ్‌ చేయించారు. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తారన్న ప్రచారం ఉన్న సీఆర్డీఏ కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌.. పశ్చిమబెంగాల్‌లో ఎన్నికల విధుల్లో ఉన్నారు. ఆయన స్పందించి ఇంజినీరింగ్‌ అధికారులను హుటాహుటిన పంపించారు. ఓట్ల లెక్కింపు తేదీ దగ్గర పడుతుండటం.. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందన్న ప్రచారం విస్తృతంగా సాగుతుండటమే ఇందుకు కారణమని భావిస్తున్నారు. కూటమి అధికారం చేపడితే.. అమరావతికి ప్రాధాన్యం ఇస్తారనే సంకేతాలతో సీఆర్డీఏ అధికారులు వెంటనే స్పందించినట్లు తెలిసింది.


అమరావతిలో భూగర్భ కేబుళ్లకు అమర్చే ప్లాస్టిక్‌ స్పేసర్లను ఎల్‌ అండ్‌ టీ సంస్థ దిల్లీకి చెందిన ఓ వ్యాపారికి తుక్కు కింద విక్రయించింది. ఆరేళ్లుగా వీటిని మందడం సమీపంలోని ఏజెన్సీ కేంద్రంలో నిల్వ ఉంచింది. నిరుపయోగంగా ఉన్న వీటిని తుక్కు కింద అమ్మింది. ఈ లోడ్‌తో వెళ్తున్న కంటెయినర్‌ తరలిపోతోందని ‘ఈనాడు’ ప్రధాన సంచికలో గురువారం ‘అమరావతి నుంచి తరలిపోతున్న సామగ్రి’ శీర్షికన వచ్చిన కథనానికి సీఆర్డీఏ అధికారులు.. తమ సహజశైలికి భిన్నంగా స్పందించారు. గురువారం ఉదయం నుంచే రాజధానికి ఉరుకులు పరుగులు పెట్టారు. సీఈ నుంచి ఏఈ వరకు అందరూ క్షేత్రస్థాయిలో పర్యటించారు. ప్లాస్టిక్‌ స్పేసర్లను తీసుకెళ్లినట్లు గుర్తించారు. వెంటనే ఎల్‌ అండ్‌ టీ సంస్థ అధికారులతో మాట్లాడి తరలిన లోడ్‌ను వెనక్కి తెప్పించారు. సీఆర్డీఏతో చేసుకున్న ఒప్పందాన్ని ఎల్‌ అండ్‌ టీ ఉల్లంఘించినట్లు తేల్చారు. తెదేపా ప్రభుత్వ హయాంలో భూగర్భంలో కేబుళ్లు వేసే పనులను ఈ సంస్థ దక్కించుకుంది. పనులు పూర్తయ్యాక చెల్లింపులు చేసేలా సీఆర్డీఏతో ఒప్పందం కుదిరింది. పనులు పూర్తి కాలేదు కాబట్టి గుత్తేదారు అజమాయిషీలోనే సామగ్రి ఉండాలి. సీఆర్డీఏకు చెప్పకుండా సామగ్రిని తరలించకూడదు. ఈ నేపథ్యంలో బయలుదేరిన కంటెయినర్లను వెనక్కి రప్పించారు. ఇటీవల రాజధాని నుంచి మేఘా సంస్థ తరలించిన విద్యుత్తు కేబుళ్ల డ్రమ్‌ల సామగ్రి సీఆర్డీఏ పనులకు సంబంధించినవి కాదని గుర్తించారు. లైన్లు మార్చేందుకు గతంలో ఏపీ ట్రాన్స్‌కోతో మేఘా సంస్థ ఒప్పందం కుదర్చుకుంది. దీనిని ఇటీవల గుత్తసంస్థ రద్దు చేసుకున్నట్లు సమాచారం.

సీఆర్డీఏ నుంచి వెళ్లే ప్రయత్నాలు
రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందనీ, చంద్రబాబు సీఎం కానున్నారనీ విస్తృతంగా ప్రచారంలో ఉంది. దీంతో సీఆర్డీఏలో ఇప్పటి వరకు అధికార వైకాపాతో అంటకాగిన అధికారులు ఇక్కడి నుంచి బయటపడేందుకు దారులు వెతుక్కుంటున్నారు. ఎన్డీయే వస్తే తమకు ఇబ్బందులు తప్పవన్న ఆందోళనలో వీరు ఉన్నట్లు తెలిసింది. ఇటీవల ప్లానింగ్‌ విభాగం అధికారి ఒకరు… తన పలుకుబడిని ఉపయోగించి మరో శాఖకు వెళ్లిపోయారు. ఇదే ప్రయత్నాల్లో పలువురు అధికారులు ఉన్నట్లు సమాచారం.