ఏపీ డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ కల్యాణ్ మారిపోయారనీ, అధికారంలోకి వచ్చాక ప్రజల క్షేమం గురించి బాగా ఆలోచిస్తున్నారనీ కొంత కాలంగా అక్కడక్కడా వినిపిస్తోంది.
పవన్‌లో చాలా ముఖాలున్న నేపథ్యంలో ఆయన మారి పోయాడన్నది ప్రచారం మాత్రమే. అన్నమయ్య జిల్లాలో గాలివీడు ఎంపీడీఓపై దాడి జరిగిందని పవన్ హంగామా చేశారు. శనివారం కడప రిమ్స్‌కు వెళ్లి పరామర్శ పేరుతో వైఎస్సార్సీపీ నేతల్ని అనరాని మాటలన్నారు. ఈ వివాదం గురించి ఆయన పూర్తిగా తెలుసుకోకుండా రాజకీయ రంగు పులిమేందుకు ప్రయత్నించార నేది జనాభిప్రాయం. వైఎస్సార్సీపీ నేతలకు కళ్లు నెత్తికెక్కాయని అంటూ… ‘అధికారులపై దాడులు చేస్తే తోలు తీస్తా’నంటూ పరుష పద జాలం వాడారు.
కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి టీడీపీ, భాగస్వామ్య పార్టీల నాయకులు అధి కారులపై దూషణలకు దిగడం, బెదిరించడం, దాడులు చేయడం రివాజుగా మారింది. ఈ నెల లోనే వైఎస్సార్ కడప జిల్లాలో వీఆర్వోపై టీడీపీ నాయకుడు బీరు బాటిల్‌తో దాడి చేశాడు. ఇప్పుడు సదరు నేత తోలు తీసే ధైర్యం పవన్‌కు ఉందా అని ప్రజానీకం ప్రశ్నిస్తోంది. పంచాయతీ రాజ్య వ్యవస్థలో ఉద్యోగులపై అధికార పార్టీ వేధింపులు చాలా ఉన్నాయి. సాక్షాత్తూ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ ఓ సందర్భంలో దళిత డాక్టర్‌ను దూషించిన విషయాన్ని డిప్యూటీ సీఎం మరిచి పోయినట్టు ఉన్నారు.
కూటమి ప్రభుత్వంలో శాంతి భద్రతలు క్షీణించాయనేది దేశం మొత్తానికి తెలిసిన నిజం. అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే 229కి పైగా హత్యలు, 750కి పైగా హత్యాయత్నాలు, నాలుగు వేలకు పైగా దాడులు, ఏడువేలకు పైగా ప్రైవేట్, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం జరిగింది.
‘నేను తప్పు చేసినా శిక్ష పడాలి’ అని అసెంబ్లీలో చెప్పిన వ్యక్తినంటూ పవన్ గొప్పలు చెప్పు కొన్నారు. కానీ నేడు టీడీపీ నేతలు చేస్తున్న దారు ణాలపై మాత్రం మౌనం ఎందుకు వహిస్తు న్నారో ప్రజలకు చెప్పాల్సిన అవసరముంది. పవన్ ప్రత్యామ్నాయంగా మారుతాడనీ, మార్పు తెస్తాడనీ అభిమానులూ, జనసేన కార్యకర్తలూ ఆశించారు. కానీ నేడు అలా జరగడం లేదు. పైగా రాక్షసపాలన చేస్తున్న చంద్రబాబును వీలు చిక్కి నప్పుడల్లా ఆయన ఆకాశానికి ఎత్తడం వారిని బాధిస్తోంది.
‘ఆడబిడ్డల జీవితాలు బాగుపడే వరకు రిటైరవ్వను’- అల్లూరి జిల్లా పర్యటనలో పవన్ చెప్పిన మాట ఇది. కానీ రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిన విషయం ఆయనకు తెలి యదా? కానీ దానిపై మాట్లాడితే చంద్రబాబు ఇబ్బంది పడతారు. ఆరు నెలల్లోనే 126కు పైగా అత్యాచారాలు, లైంగికదాడులు జరిగాయి. 12 మందిపై హత్యాచారం జరిగింది. వీటిపై పవన్ మాట్లాడకపోగా డైవర్షన్ కోసం ప్రయత్నించి జనాగ్రహాన్ని మూట గట్టుకున్నారు. ‘నేనే హోం మంత్రినైతే…’ అంటూ సినిమా టైటిల్ తరహా స్టేట్‌మెంట్ ఇచ్చి మొత్తం వ్యవహారాన్ని బాబు వైపు నుంచి తెలివిగా మళ్లించారు.
గతంలో పవన్ ఆడపిల్లలపై దాడుల విషయంలో అనేక వ్యాఖ్యలు చేశారు. అప్పటి ప్రభుత్వానికి సంబంధం లేకపోయినా కొన్ని అంశాలు అంట గట్టే ప్రయత్నం చేసి పెద్ద గొంతుతో సినిమాటిక్‌గా అరిచారు. ఇప్పుడు ఆయన భాగస్వామిగా ఉన్న ప్రభుత్వంలో అరాచకం రాజ్య మేలుతున్నా మౌనం వహించడంతో జనసేన కార్యకర్తలు కూడా బాధపడుతున్నారన్నది అక్ష రాలా నిజం.
డిప్యూటీ సీఎం హోదాలో పవన్ ఎంపీడీ ఓను పరామర్శించారు. దానిని ఎవరూ కాద నరు. రాష్ట్రంలో రోజూ బాలికలు, మహిళలపై అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి కదా. మరి వీటిపై స్పందించరేం? నిజంగా ఆ పని చేస్తే ఆయనపై ప్రజలకు నమ్మకం ఉంటుంది. కానీ చంద్రబాబు ఆదేశాలతో డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. వీటిపై పాలకులు మౌనంగా ఉంటే పరిస్థితులు మరింతగా దిగజారొచ్చు.
ప్రశ్నిస్తూనే ఉంటానని పార్టీ పెట్టిన వ్యక్తి… ముందు తన కళ్లకు కట్టుకున్న గంతలు విప్పాలి. ఇది సినిమా హీరోలను దేవుళ్లుగా కొలుస్తున్న సమాజం కాబట్టి ఏం చెప్పినా… చేసినా చెల్లుబాటవుతుందనే భ్రమల్లో పవన్ తిరుగుతూ ఉన్నారు. కానీ ఇది సోషల్ మీడియా యుగం. వివిధ యాప్స్ వేదికగా యువత ప్రశ్నలు సంధిస్తోంది. వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత డిప్యూటీ సీఎంపై ఉంది.