కొందరికి హోమ్ లోన్ తీసుకున్న తర్వాత కూడా మళ్లీ డబ్బులు అవసరం అవుతాయి. ఈ సమయంలో టాప్ అప్ లోన్ మీకు బెటర్ ఆప్షన్ అని చెప్పవచ్చు. దీని గురించి తెలుసుకుందాం..
టాప్ అప్ లోన్ అంటే మీ ప్రస్తుత రుణంపై ఇచ్చే అదనపు రుణం. అంటే ఉన్న రుణం అలాగే కంటిన్యూ అవుతుంది.. మీద నుంచి అదనంగా లోన్ తీసుకోవచ్చు. ఈ రుణాన్ని బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు ఇప్పటికే ఉన్న గృహ రుణ కస్టమర్లకు అందిస్తాయి. ఇది మీ గృహ రుణ బ్యాలెన్స్, ఆస్తి ప్రస్తుత వడ్డీ రేట్ల ఆధారంగా ఆమోదం పొందుతుంది. మీకు ఎంత టాప్ అప్ హోమ్ లోన్ లభిస్తుందనేది మీ ఆస్తి మార్కెట్ విలువపై ఆధారపడి ఉంటుంది. టాప్ అప్ హోమ్ లోన్ పర్సనల్ లోన్ కంటే తక్కువ వడ్డీ రేట్లకు లభిస్తుంది. ఎక్కువ కాలం పాటు పొందవచ్చు.
టాప్ అప్ హోమ్ లోన్ అర్హతలు
టాప్ అప్ హోమ్ లోన్ అర్హతలు బ్యాంకు, ఆర్థిక సంస్థలను బట్టి మారవచ్చు. సాధారణ అర్హతలు కొన్ని ఉంటాయి. టాప్ అప్ హోమ్ లోన్ పొందడానికి, మీకు ఇప్పటికే హోమ్ లోన్ ఉండాలి. మీ క్రెడిట్ స్కోర్ 750 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. మీరు హోమ్ లోన్ ఈఎంఐని సకాలంలో చెల్లించాలి. స్థిరమైన నెలవారీ ఆదాయం, ఉద్యోగ రుజువు అవసరం. మీ ఆస్తి మార్కెట్ విలువ ఆధారంగా మీకు లోన్ లభిస్తుంది. లోన్ తీసుకునే వ్యక్తి వయస్సు 70 సంవత్సరాలకు మించకూడదు.
ప్రయోజనాలు ఏంటి?
టాప్ అప్ హోమ్ లోన్ వ్యక్తిగత రుణం కంటే చాలా తక్కువ వడ్డీ రేటుకు లభిస్తుంది. ఇంటికి పునరుద్ధరణ అవసరమైతే లేదా గృహ రుణం కాకుండా అదనపు ఖర్చు ఉంటే, చాలా మంది టాప్ అప్ హోమ్ లోన్ తీసుకోవడానికి ఇష్టపడతారు. మీ గృహ రుణం తీసుకునేటప్పుడు, కస్టమర్ పత్రాలు ఇప్పటికే బ్యాంకులో జమ అయి ఉంటాయి. ఈ లోన్ సమయంలో ఎక్కువ డాక్యుమెంటేషన్ అవసరం లేదు. మీ గృహ రుణాన్ని మరొక బ్యాంకుకు బదిలీ చేయాలనుకుంటే, టాప్ అప్ హోమ్ లోన్ కూడా తీసుకోవచ్చు.
ఎలా అప్లై చేయాలి?
టాప్ అప్ హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవడం చాలా సులభం. టాప్ అప్ హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు గుర్తింపు రుజువు, చిరునామా రుజువు, ఆదాయ ధృవీకరణ పత్రం, ఆస్తి పత్రాలు, గృహ రుణ పత్రాలు మొదలైనవి కావాలి.
ముందుగా మీరు మీ హోమ్ లోన్ తీసుకున్న బ్యాంకు అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి. హోమ్ లోన్ విభాగానికి వెళ్లి టాప్ అప్ హోమ్ లోన్ లేదా హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ ప్లస్ టాప్ అప్ ఆప్షన్ ఎంచుకోండి. మీ వ్యక్తిగత, ఆర్థిక, ఉద్యోగ సమాచారాన్ని నమోదు చేయాలి. అవసరమైన అన్ని పత్రాలను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయండి. మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని కన్ఫామ్ చేయండి. కావాలంటే బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి ఆఫ్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అక్కడ మీరు టాప్ అప్ హోమ్ లోన్ కోసం దరఖాస్తు ఫారమ్ తీసుకోవాలి. ఫారమ్ తీసుకున్న తర్వాత, అవసరమైన అన్ని పత్రాలను సమర్పించాలి. దరఖాస్తు పూర్తి చేయాలి.
































