ప్రభుత్వ, ప్రైవేట్ అనే తేడా లేకుండా సంస్థలో పనిచేసే ప్రతి కార్మికుడికి గ్రాట్యుటీ(Gratuity) అనే అలవెన్స్ ఉంటుంది. నెలవారీ వేతనం, డియర్‌నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్‌లతో పాటు గ్రాట్యుటీని కూడా ఆయా కంపెనీలు ఎంప్లాయీ అకౌంట్‌లో జమ చేస్తుంటాయి.
మరి, గ్రాట్యుటీ అంటే ఏంటి? ఈ అలవెన్స్ పొందాలంటే ఎన్నేళ్ల పాటు సర్వీస్ చేయాలి? దీన్ని ఎలా లెక్కిస్తారు? 15 ఏళ్ల పాటు సర్వీస్ ఉండి, కంపెనీలో అందకున్న చివరి శాలరీ రూ.75,000 ఉన్నవారికి గ్రాట్యుటీ ఎంత వస్తుంది? వంటి విషయాలు తెలుసుకుందాం.
గ్రాట్యుటీ అంటే?
గ్రాట్యుటీ అనేది ఉద్యోగులకు కంపెనీలు, యాజమాన్యాలు ఇచ్చే స్పెషల్ అమౌంట్. కంపెనీ లేదా సంస్థకు అందించిన సేవలకు గుర్తుగా ఉద్యోగులకు ఈ అలవెన్స్ అందజేస్తుంటాయి. అయితే, గ్రాట్యుటీ పొందడానికి అర్హత సాధించాలంటే ఉద్యోగులు కొన్ని షరతులు పాటించాలి. ద పేమెంట్ అండ్ గ్రాట్యుటీ యాక్ట్- 1972 ప్రకారం.. ఏదైనా కంపెనీలో 5 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ కాలం పాటు సర్వీస్ చేసిన ఎంప్లాయీకే గ్రాట్యుటీ వర్తిస్తుంది. ఈ నిర్ణీత గడువును పూర్తిచేయకుండా కంపెనీని వదిలేసిన వారు గ్రాట్యుటీ పొందలేరు. ఒక కంపెనీలో 10 మంది ఉద్యోగుల కన్నా ఎక్కువ మంది పనిచేస్తే సదరు సంస్థలు ఎంప్లాయీస్‌కి గ్రాట్యుటీ ఇవ్వాలి. ఫ్యాక్టరీలు, మైన్స్, ఆయిల్ ఫీల్డ్స్, పోర్టులు, రైల్వే, తదితర విభాగాలతో పాటు అన్ని కంపెనీలు ఈ రూల్ ఫాలో అవ్వాలి.
గ్రాట్యుటీ లెక్కించే విధానం
ఉద్యోగికి ఇచ్చే గ్రాట్యుటీని లెక్కించడానికి ఒక రూల్ ఉంది. ఉద్యోగి బేసిక్ శాలరీతో పాటు డియర్‌నెస్ అలవెన్స్, సంస్థలో పనిచేసిన కాలాన్ని పరిగణనలోకి తీసుకుని గ్రాట్యుటీ లెక్కింపు ఉంటుంది. బేసిక్ శాలరీ, డియర్‌నెస్ అలవెన్స్ యాడ్ చేస్తే వచ్చిన మొత్తంతో సర్వీసు కాలం, (15/26)లను గుణిస్తే గ్రాట్యుటీ మొత్తం తేలుతుంది.
ఫార్ములా: (బేసిక్ శాలరీ+డియర్‌నెస్ అలవెన్స్)x(పనిచేసిన సంవత్సరాల సంఖ్య)x(15/26)
ఉదాహరణకు.. బేసిక్ శాలరీ, డియర్‌నెస్ అలవెన్స్ కలిపి రూ.75 వేలు అయిందనుకుందాం. సంస్థలో పనిచేసిన కాలం 15 సంవత్సరాలు అనుకుంటే.. 75,000 x (15/26) x 15 = 6,49,038 అవుతుంది. అంటే రూ.1,41,346 కంపెనీ ఉద్యోగికి చెల్లించాల్సి ఉంటుంది.
సర్వీస్ కాలంలో వీరికి ఎగ్జమ్షన్
గ్రాట్యుటీ పొందాలంటే ఉద్యోగులు తప్పనిసరిగా 5 ఏళ్ల పాటు సంస్థలో పనిచేయాలన్న నిబంధన నుంచి కొందరిని గ్రాట్యుటీ చట్టం మినహాయించింది. చట్టంలోని సెక్షన్ 2a ప్రకారం, భూగర్భ గనుల్లో పనిచేసే ఉద్యోగులు గ్రాట్యుటీ పొందాలంటే.. నాలుగేళ్ల 190 రోజుల పాటు పనిచేస్తే చాలు. మరికొన్ని సంస్థల్లో నాలుగేళ్ల ఎనిమిది నెలలకు ఎగ్జమ్షన్ ఉంది.
రిటైర్మెంట్ తర్వాత లేదా కంపెనీ నుంచి బయటకు వెళ్లిన తర్వాత మాత్రమే ఈ గ్రాట్యుటీ మొత్తాన్ని ఉద్యోగి పొందేందుకు వీలుంటుంది. సంస్థలో పనిచేస్తున్న సమయంలో ఈ గ్రాట్యుటీని ఉద్యోగులు క్లెయిమ్ చేసుకోలేరు. ఉద్యోగానికి రిజైన్ చేశాక ఉండే నోటీస్ పీరియడ్ కాలానికి కూడా ఉద్యోగులు గ్రాట్యుటీని పొందవచ్చు. అయితే, గ్రాట్యుటీ చట్టం కింద కంపెనీ రిజిస్టర్ అయితేనే ఉద్యోగులకు గ్రాట్యుటీ వస్తుంది. అయితే, రిజిస్టర్ చేసుకోకపోయినా ఉద్యోగులకు స్వతంత్రంగా కంపెనీలు గ్రాట్యుటీ ఇవ్వొచ్చు.