అనంత్ అంబానీ వేల జంతువులతో రిలయన్స్ నిర్వహిస్తున్న ‘వంతారా’ జూలో ఏం జరుగుతోంది?

www.mannamweb.com


గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో వన్య ప్రాణుల సంరక్షణ కోసం ‘వంతారా’ పేరుతో రిలయన్స్ గ్రూప్ ఒక అడవిని ఏర్పాటు చేసింది.
ఈ ఆలోచన ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ మదిలో పుట్టింది.
దీన్ని రిలయన్స్ సంస్థ ‘ప్రైవేటు జూ’ అని పిలుస్తున్నారు.

వంతారాలో అనేక రకాల వన్య ప్రాణులతో పాటు ఏనుగులు కూడా ఉన్నాయి.

ఈ ప్రాజెక్టు మీద దేశంలోని కోర్టుల్లో అనేక ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి.

ఇటీవల అనంత్ అంబానీ వివాహ ముందస్తు వేడుకలో దేశ, విదేశాల నుంచి వచ్చిన అతిథులకు ఈ జూలోని జంతువులను చూపించడంపైనా కోర్టులో పిటిషన్ దాఖలైంది.

దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి జంతువులను జామ్‌నగర్‌కు తరలించడాన్ని వ్యతిరేకిస్తూ మరో పిటిషన్ దాఖలైంది.

వంతారా లో ఏమి జరుగుతుంది 

ఈ ప్రాజెక్టు కింద వన్య ప్రాణుల సంరక్షణ కోసం జామ్‌నగర్‌లో మూడు వేల ఎకరాలు సిద్ధం చేశారు. ఇందులో ఎక్కువ భాగం ఏనుగుల కోసం కేటాయించారు.

వంతారాలో ఏనుగుల కోసం నిర్మించిన సెంటర్‌లో 200కి పైగా ఏనుగులు ఉన్నాయి.

ఈ ఏనుగుల బాగోగులు చూసేందుకు 500 మంది సుశిక్షితులైన పనివాళ్లు ఉన్నారు. ఇందులో జంతు వైద్యులు, బయాలజిస్టులు, పాథాలజిస్టులు, న్యూట్రిషనిస్టులు ఉన్నారు.

మూడు వేల ఎకరాల్లో 650 ఎకరాలను కొన్ని జంతువుల్ని సంరక్షించి, వాటికి పునరావాసం కల్పించేందుకు కేటాయించారు.

భారత దేశంతో పాటు, ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో ప్రమాదంలో ఉన్న జంతువులను తీసుకొచ్చి వాటికి చికిత్స అందించడంతో పాటు అవి అక్కడే జీవించేలా ఏర్పాట్లు చేశారు. ఈ సెంటర్‌లో 2,100 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.

వంతారాలో 300 చిరుతలు ఉన్నాయి. వీటితోపాటు పులులు, సింహాలు, జాగ్వార్‌లు ఉన్నాయి. అలాగే మొసళ్లు, పాములు, తాబేళ్లు సహా 1200 క్షీరదాలు ఉన్నాయి.

వంతారాలో 300 జింకలు కూడా ఉన్నాయి.

మొత్తంగా చూస్తే 43 రకాాలకు చెందిన రెండు వేలకు పైగా జంతువులు ఉన్నాయి.

భారతదేశంలో మొదటి ప్రైవేట్ జూ ఇదేనా?

వంతారాలో ఏనుగులను రక్షించి వాటి మంచి చెడ్డలు చూసుకోవడానికి ‘రాధాకృష్ణ యానిమల్ వెల్ఫేర్ ట్రస్ట్’ ఉంది.

మిగతా జంతువుల కోసం ‘గ్రీన్స్ జూలాజికల్’ సంరక్షణ పునరావాస కేంద్రం పని చేస్తోంది.

వంతారాను “మినీ జూ” గా సెంట్రల్ జూ అథారిటీ గుర్తించింది. ఈ జూను 2021 మార్చ్ 10న ఏర్పడిన జీజెడ్ఆర్ఆర్‌సీ నిర్వహిస్తోంది.

రిలయన్స్ గ్రూప్ నిర్వహణలోని వంతారాపై సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. దీన్ని భారత దేశపు తొలి ప్రవేట్ జూ అని పిలవడంపై కొంత మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

భారత దేశంలో ప్రైవేట్ జూ అనేది కొత్త ఆలోచన ఏమీ కాదని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎఫ్‌వోఎస్) మాజీ అధికారి బ్రజ్‌రాజ్ శర్మ చెప్పారు.

“భారతదేశంలో ప్రైవేట్ జూలు ఇప్పటికే ఉన్నాయి. జంషెడ్‌పూర్‌లో టాటా గ్రూప్ ఆధ్వర్యంలో నడుస్తున్న జంతు ప్రదర్శన శాల దీనికొక ఉదాహరణ. దీంతో పాటు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో జింకల పార్కులు ప్రైవేటు నిర్వహణలో నడుస్తున్నాయి” అని ఆయన చెప్పారు.

అయితే భారత దేశంలో ఇలాంటి జూలు ఎలా ప్రారంభించవచ్చు అనే సందేహాలు ఉన్నాయి.

దేశంలోని ప్రైవేట్ జూలకు అనుమతి ఇచ్చే ‘సెంట్రల్ జూ అథారిటీ’లో మెంబర్ సెక్రటరీగా ఉన్న బ్రజ్‌రాజ్ శర్మ వీటికి సమాధానం ఇచ్చారు.

“భారత దేశంలో ఏదైనా జూ ప్రారంభించాలన్నా, నడిపించాలన్నా ముందుగా సెంట్రల్ జూ అథారిటీ నుంచి అనుమతి తీసుకోవాలి. తర్వాత 2009లో సవరించిన జూ రికగ్నిషన్ రూల్స్ ప్రకారం వాటిని నడపాలి” అని ఆయన చెప్పారు.

జంతువుల భద్రతను పర్యవేక్షించేది ఎవరు?

ప్రైవేటు జూలలో జంతువుల బాగోగులు, రక్షణకు ఎవరు బాధ్యత వహిస్తారు అనేది కీలకమైన ప్రశ్న.

“సెంట్రల్ జూ అథారిటీ ఈ జూలను తరచుగా సందర్శించి జంతువులు ఎలా ఉన్నాయో పరిశీలిస్తుంది” అని బ్రజ్‌రాజ్ శర్మ చెప్పారు.

“జంతువుల సంరక్షణ, భద్రత విషయంలో ప్రైవేటు జూ నిర్వాహకులు మేం చెప్పిన ప్రమాణాలను పాటించకపోతే, మేం గుర్తించిన అంశాలను తక్షణమే వారి దృష్టికి తీసుకెళ్తాం. ప్రైవేటు జూలకు ఇచ్చిన గుర్తింపు శాశ్వతం కాదు. దాన్ని ఏ క్షణమైనా రద్దు చెయ్యవచ్చు” అని ఆయన అన్నారు.

21 ఏళ్ల ఏషియన్ ఎలిఫెంట్
ఏనుగు లేదా పులి చనిపోతే పరిస్థితి ఏమిటి?

రిలయన్స్ గ్రూప్ వంతారాపై విడుదల చేసిన వీడియోలో ఓ ఏనుగుకు దంతాలు ఉండటాన్ని గమనించవచ్చు.

భారత వన్యప్రాణి చట్టం-1972లో షెడ్యూల్ వన్ ప్రకారం పులుల సంరక్షణలో పాటించాల్సిన ప్రమాణాలను ఏనుగుల సంరక్షణ కోసం పాటించాలి.

ఏనుగు దంతాలు, పులి గోళ్లు వంటి వాటి అక్రమ వ్యాపారాన్ని అడ్డుకోవడం భారతీయ అటవీశాఖ ప్రాధాన్యాల్లో ఒకటి.

“షెడ్యూల్ వన్‌లో ఉన్న జంతువులు చనిపోతే ఏం చేయాలనే దానిపై కచ్చితమైన నియమావళి ఉంది. చనిపోయిన జంతువుకు సంబంధించిన ప్రైవేటు జూ అధికారులు లేదా నిర్వహణ యాజమాన్యం ఆ రాష్ట్రానికి చెందిన చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్‌, సెంట్రల్ జూ అథారిటీకి సమాచారం అందించాలి. జంతువు చనిపోయిన తర్వాత దానికి పోస్ట్‌మార్టం నిర్వహించి నివేదికను అందజేయాలి.

ఏనుగు చనిపోతే దాని శరీరం నుంచి దంతాలను వేరు చేయకూడదు. మొత్తం శరీరాన్ని తగలబెట్టాలి. ఆ జంతువుకు ఏదైనా ఇన్‌ఫెక్షన్ సోకి చనిపోయి ఉంటే అప్పుడు దాని శరీరాన్ని పూడ్చివేయాలి” అని బ్రజ్‌రాజ్ శర్మ చెప్పారు.

ప్రైవేటు జూలలో నిబంధనలకు వ్యతిరేకంగా ఏదైనా జరిగితే అటవీశాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే ప్రశ్నకు కూడా ఆయన వివరణ ఇచ్చారు.

“అలాంటిది ఏదైనా జరిగినట్లు అటవీశాఖ అధికారుల దృష్టికి వస్తే దానిపై దర్యాప్తు నిర్వహించడంతో పాటు ప్రైవేటు జూ నిర్వహణ యాజమాన్యంపై చర్యలు తీసుకోవచ్చు” అని తెలిపారు.
ప్రైవేటు జంతు ప్రదర్శన శాలలు అవసరమా?

జంతు ప్రదర్శనశాలలను ప్రారంభించి వన్య ప్రాణాలను సంరక్షించేందుకు ముందుకు రావడం మంచి ఆలోచనే.

ఆఫ్రికాతో పాటు పశ్చిమ దేశాలలో ప్రైవేటు యాజమాన్యాల చేతుల్లో పెద్ద పెద్ద వన్య ప్రాణుల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి.

“అటవీ శాఖ వద్ద వనరులు, నిధులు పరిమితంగా ఉన్నాయనేది సుస్పష్టం. అందుకే జంతువుల్ని సంరక్షించడం, పునరావాసం కల్పించడం లాంటివి ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలు చేపడితే మంచిదే” అని పేరు చెప్పడానికి ఇష్టపడని అటవీ శాఖ అధికారి ఒకరు బీబీసీతో చెప్పారు.

“ఈ ప్రక్రియలో ప్రైవేటు జూలకు క్రూరమృగాలను తీసుకురాకుండా చూడాలి. గాయపడిన, అనారోగ్యంతో ఉన్న క్రూరమృగాలను తీసుకొచ్చినా, కోలుకున్న వెంటనే అడవిలో వదిలి పెట్టాలి” అని ఆయన తెలిపారు.