ఏప్రిల్‌ నుంచి ఈ 6 బ్యాంకులు కనుమరుగు అవ్వొచ్చు..! ఖాతాదారుల పరిస్థితి ఏంటంటే..?

2026 నాటికి ఆరు ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనానికి కేంద్రం సన్నాహాలు చేస్తుంది. బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేసి, ప్రపంచ స్థాయి బ్యాంకులు సృష్టించడమే లక్ష్యం. బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వంటివి విలీనం కానున్నాయి. ఖాతాదారులకు IFSC కోడ్ మారుతుంది తప్ప, ఇతరత్రా ప్రభావం ఉండదు.

2026 ఏప్రిల్‌ నాటికి కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు కనిపించకపోవచ్చు. అదేంటి దివాళా తీస్తున్నాయా ఏంటి అని కంగారు పడకండి. కేంద్ర ప్రభుత్వం భారతీయ బ్యాంకింగ్‌ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఓ ఆరు ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేయనుంది. ప్రపంచంలోని టాప్ 100 ర్యాంకింగ్స్‌లో పోటీపడే కొన్ని ప్రపంచ స్థాయి బ్యాంకులను సృష్టించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మరింత మార్కెట్ విలువను పెంచడానికి బ్యాంకు ఏకీకరణ తదుపరి దశకు మద్దతు ఇస్తోంది.


ఫైనాన్షియల్ బుక్స్, మొండి బకాయిలను తగ్గించడం, డిజిటల్ భౌతిక మౌలిక సదుపాయాలను పెంచడం, ప్రపంచ పోటీతత్వాన్ని మెరుగుపరచడం వంటి లక్ష్యాలతో ఈ విలీనం చేపట్టాలని భావిస్తోంది కేంద్ర ప్రభుత్వం. బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యూకో బ్యాంక్, పంజాబ్ అండ్‌ సింధ్ బ్యాంక్‌లు విలీనం అయ్యే అవకాశం ఉంది. ఇవి ఒకదానితో మరొకటి, లేదంటే ఇతర పెద్ద బ్యాంకులలో విలీనం కావొచ్చని నివేదికలు చెబుతున్నాయి. అయితే బ్యాంకులు విలీనం జరిగినా.. అందులోని ఖాతాదారులపై ఎలాంటి ప్రభావం చూపదు. కాకపోతే ఐఎఫ్‌ఎస్‌ కోడ్‌ మారనుంది.

1993 నుండి 2025 వరకు భారతదేశంలో పెద్ద బ్యాంక్ విలీనాలు – మూడు దశాబ్దాలకు పైగా భారతీయ ఆర్థిక వ్యవస్థ గణనీయమైన పరివర్తనను చూసింది. ఒక ఏకరీతి బలమైన బ్యాంకును ఏర్పాటు చేయడానికి రెండు లేదా బహుళ బ్యాంకుల విలీనం ఈ నమూనా మార్పులో భాగం. ఏంజెల్ వన్ బ్లాగ్ ప్రకారం బ్యాంకు విలీనాలు మెరుగైన మూలధన బలం మెరుగైన క్రెడిట్ సామర్థ్యం సజావైన సేవల కోసం మెరుగైన సాంకేతిక ఏకీకరణ ఎక్కువ రిస్క్ వైవిధ్యీకరణ శాఖల అతివ్యాప్తి నిర్వహణ ఖర్చులను తగ్గించడం వంటి ఫలితాలను ఇచ్చాయి. 1993 నుండి జరిగిన కొన్ని ముఖ్యమైన బ్యాంక్ విలీనాలు గమనిస్తే.. ఏప్రిల్ 2017లో ఎస్‌బిఐలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కోర్, భారతీయ మహిళా బ్యాంక్‌లు విలీనం అయ్యాయ. ఈ విలీనం తర్వాత ఎస్‌బిఐ దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా మారింది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.