గుజరాత్ తీరప్రాంతాన కొలువైన ద్వారక నగరం శ్రీకృష్ణుడి భక్తులను ఆకర్షిస్తూ ఉంటుంది.
గుజరాత్‌లో ఈ నగరాన్ని దేవభూమిగా పిలుస్తుంటారు.
హిందువుల విశ్వాసాలపై అధ్యయనం చేసే శాస్త్రవేత్తలను, పరిశోధకులను కూడా ఈ ప్రాంతం ఆకర్షిస్తుంటుంది.
మహాభారత సమయంలో కృష్ణుడి ద్వారక ప్రాంతం ఎలా ఉండేది? ఇక్కడ ఎవరు నివసించేవారు? వారి జీవన విధానం ఎలా ఉండేది? వంటి విషయాలను సాక్ష్యాధారాలతో ధ్రువీకరించేందుకు పురావస్తు శాస్త్రవేత్తలు ఇక్కడ తవ్వకాలు జరుపుతున్నారు.
సముద్రంలో మునిగిపోయిన ద్వారక నగరంలోకి డైవర్స్‌ను పంపుతూ మెరైన్ ఆర్కియాలజిస్టులు (సముద్ర పురావస్తు శాస్త్రవేత్తలు) పరిశోధనలు జరుపుతున్నారు.
సముద్ర గర్భం నుంచి పలు పురావస్తు అవశేషాలను వారు సేకరించారు.
సముద్రగర్భంలోని ద్వారకలో తవ్వకాలు జరిపి, పరిశోధనలు చేసేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక బృందం వెళ్లింది.
మరోవైపు, ద్వారక నగరాన్ని బంగారంతో నిర్మించారని , ఆ తర్వాత ఆ నగరం సముద్రంలో మునిగిపోయిందిగా ఆధ్యాత్మిక సాహిత్యంలో కొన్ని ప్రస్తావనలున్నాయి.
అయితే, అసలు ద్వారక నగరం ఎలా సముద్రంలో మునిగిపోయిందో తెలుసుకోవడం కోసం దశాబ్దాలుగా ఎన్నో ప్రయత్నాలు సాగుతున్నాయి. అంతేకాక, అసలైన ద్వారకా నగరం ఎలా ఉండేదో తెలుసుకునేందుకు కూడా ఎన్నో అధ్యయనాలు నిర్వహించారు.
అసలైన ద్వారకను ఎలా నిర్ణయించారు?
అసలైన ద్వారాక ఏదనే విషయమై నాలుగు పేర్లు వినిపిస్తుంటాయి . ఇందులో ప్రస్తుతం ఉన్న ద్వారకనగరంతోపాటు బెట్ ద్వారక, పోరుబందరు నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న విశ్వవద, మదాపుర్ సమీపంలోని కోడినర్, గిర్నారే ఆ నాలుగు పేర్లు.
అయితే పూర్వపు ఆనవాళ్లు ఏవీ లభించపోవడం, సమీపంలో సముద్రమే లేకపోవడం వల్ల గిర్నార్ దగ్గరలో ద్వారక ఉండే అవకాశమే లేదని ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త ప్రొఫెసర్ హస్ముఖ్ సాంఖ్య, ప్రముఖ మెరైన్ ఆర్కియాలజిస్ట్ డా.ఎస్.ఆర్.రావు అభిప్రాయడ్డారు. దీంతొ గిర్నార్ ద్వారక అయ్యే అవకాశంలేదని తేల్చారు.
అంతిమంగా పరిశోధనలన్నీ ప్రస్తుతం ఉన్న ద్వారకానగరం, బెట్ ద్వారకా చుట్టూనే సాగుతున్నాయి.
ద్వారకానగరం జమ్నానగర్ జిల్లాలో ఉంది. 8వ, 9వ శతాబ్దాల నుంచి దీన్ని కృష్ణుడు నివసించిన ద్వారకగా చెబుతున్నారు.
ఇక్కడ జరిపిన పరిశోధనలు కూడా ద్వారకా నగరానికి చెందిన ఎన్నో ఆధారాలను సేకరించాయి. ద్వారక రహస్యాలను తెలుసుకోవడానికి 1963లో పుణేలోని డెక్కన్ కాలేజీ తవ్వకాలు జరిపింది. అయితే అంతకుమందు ప్రాథమికంగా కూడా కొన్ని తవ్వకాలు జరిగాయి.
ప్రొఫెసర్ ఎస్.ఆర్. రావు ద్వారకలో అనేక పరిశోధనలు చేశారు. ద్వారకా నగరంపై పుస్తకాన్ని కూడా రాశారు. ఆయన రాసిన ‘మెరైన్ ఆర్కియాలజీ ఆఫ్ ఇండియా’లో.. ”1963లో ద్వారకాధీశ్ టెంపుల్ కాంప్లెక్స్‌కు బయట డెక్కన్ కాలేజీ జరిపిన తవ్వకాలు మహాభారత కాలంలో పేర్కొన్న ద్వారకా ఇదేనని నిర్థరించాయి” అని పేర్కొన్నారు.
మహాభారత కాలం నాటి ద్వారక నిర్థరణ అయిన తరువాత కూడా 1981లో మెరైన్ ఆర్కియాలజీ కేంద్రం బెట్‌ద్వారకలో తవ్వకాలు జరిపింది. 1983లో బెట్ ద్వారకాలో తొలిసారి సముద్ర గర్భంలో తవ్వకాలు జరిపారు. 1990 వరకు ఇలా తొమ్మిదిసార్లు తవ్వకాలు చేపట్టారు. ద్వారకాలో, బెట్ ద్వారకాలో, సోమనాథ్‌లో 1991-92లో పెద్ద ఎత్తున తవ్వకాలు జరపగా.. 1995 వరకు ప్రధానంగా 18 సార్లు తవ్వకాలు చేపట్టారు.
2001లో ‘అండర్‌వాటర్ ఆర్కియాలజీ వింగ్’ను ఏర్పాటు చేసిన తర్వాత, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) సముద్ర గర్భంలో మరిన్ని తవ్వకాలు జరిపింది. 2007 నాటి తవ్వకాలను మరింత ముఖ్యమైనవిగా చెబుతుంటారు.
ద్వారకా నగరం గురించి బీబీసీ ప్రచురించిన డాక్యుమెంటరీలో.. 2007లో సముద్ర గర్భంలో విస్తృతంగా జరిపిన తవ్వకాల గురించి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన ఆర్కియాలజిస్ట్ ప్రొఫెసర్ అలోక్ త్రిపాఠి మరింత వివరించారు.
2007నాటి తవ్వకాలకు డాక్టర్ అలోక్ త్రిపాఠి డైరెక్టర్‌గా వ్యవహరించారు.
” మహాభారతంలోని వర్ణనలకు సమకాలీనంగా ఉన్న ఏకైక ప్రాంతం ద్వారకానే. 1963లో డెక్కన్ కాలేజీ తవ్వకాలు జరిపిన తర్వాత, ఏఎస్ఐతో భాగస్వామ్యమైన పురావస్తు శాస్త్రవేత్తలు దీనికి సంబంధించిన ఆధారాలను సేకరించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. దీనిలో 500కి పైగా వస్తువులను సేకరించారు. అవి కనీసం 2 వేల ఏళ్లనాటివి. సముద్ర గర్భంలో జరిపిన తవ్వకాల్లో పలు నిర్మాణాలు ఉన్నట్లు ఆధారాలు సేకరించారు. వాటి నిర్మాణాల్లో, అక్కడ నౌకాశ్రయం ఉందని స్పష్టంగా తెలిసింది” అని ఆయన తెలిపారు.
” వివిధ సాహిత్యాల ద్వారా అసలైన ద్వారక ఏదనేది మాకు తెలిసింది. మహాభారతం, పురాణాలు కూడా ఈ నగరాన్ని సముద్రం మింగేసిందని పేర్కొన్నాయి. తరువాత వివిధ మార్గాలు, పరిశోధనల తర్వాత, ప్రస్తుత ద్వారక ప్రాంతాన్ని గుర్తించాం. అక్కడ తవ్వకాలు జరిపాం” అని డాక్టర్ అలోక్ త్రిపాఠి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
ద్వారకలో ఇళ్ల నిర్మాణం ఎలా ఉండేది?
” ధోలావీరా, సుర్కోటడాలలో కనుగొన్న నిర్మాణాల్లో, సహజ సిద్ధమైన రాళ్లు ఉండేవి. అయితే, ద్వారకలో మాత్రం రాపిడికి గురైనట్టున్న రాళ్ళ గోడల అవశేషాలే ఉన్నాయి. వీటిల్లో చిన్న రాళ్ల నుంచి రెండు మీటర్ల వరకు పొడవైన రాళ్లు ఉన్నాయి” అని ఎస్.ఆర్ రావు తన పుస్తకంలో రాశారు.
”తవ్వకాల్లో గోడలతో ఉన్న పూర్తి ఇళ్లు చాలా తక్కువగా బయటపడ్డాయి. దీంతో, ఆ సమయంలో ఇళ్లు ఎంత పెద్దవిగా ఉన్నాయో అంచనావేయడం కష్టం. కానీ, మేం కనుగొన్న దాన్నుంచి, అక్కడ ఇళ్లు కనీసం 20 మీటర్ల పొడవు నుంచి 10 మీటర్ల వెడల్పులో ఉన్నట్లు అంచనావేయచ్చు” అని పుస్తకంలో చెప్పారు.
వీటితోపాటు తవ్వకాల్లో మందంగా ఉన్న ఉన్న పిల్లర్లను కూడా గుర్తించారు.
”గోమతి నదిపై ఉన్న పురాతన ద్వారకా కేవలం సముద్రంలో గుర్తించిన అవశేషాలకే పరిమితం కాలేదు. ద్వారకాధీశ్ ఆలయం ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో కూడా ఎన్నో అవశేషాలు బయటపడ్డాయి. దీంతో, ద్వారకా నగర భూగర్భ ప్రాంతం చాలా పెద్దదని తెలుస్తోంది. ఆధునిక ద్వారకా నగరం కింద చాలా పెద్ద పురాతన ద్వారకా నగరం ఉండి ఉండవచ్చు” అని ప్రొఫెసర్ ఎస్.ఆర్ రావు తన పుస్తకంలో రాశారు.
ద్వారకా నగర శైలి ఎలా ఉండేది?
ద్వారకా నగరంలో జరిపిన తవ్వకాల్లో బయట పడిన శిథిలాల్లో పట్టణ ప్రణాళిక (అర్బన్ ప్లానింగ్) గురించి కూడా వెల్లడైంది.
”బాల్‌భవన్ నుంచి గోమతి వరకున్న బెల్ట్‌లో ఒక పొడవైన గుంత కనిపించింది. ఈ రకమైన గుంతలు కోటల చుట్టూ చూడొచ్చు. వీటిల్లో నీటిని నిల్వ ఉంచుతారు” అని ప్రొఫెసర్ ఎస్.ఆర్. రావు తన పుస్తకంలో పేర్కొన్నారు.
సముద్ర గర్భంలో జరిపిన తవ్వకాల్లో కోటలకు చెందిన కొన్ని శిథిలాలను, అవశేషాలను కూడా గుర్తించారు.
” పెద్ద సంఖ్యలో బురుజులను గుర్తించాం. ఈ తరహా నిర్మాణం కోటల బయటి గోడపై ఉంటుంది. కోట చుట్టూ ఉన్న మూలల్లో ఇవి ఉంటాయి. 30 నుంచి 40 బురుజులను గుర్తించాం” అని రాశారు.
ద్వారక నౌకాశ్రయ శిథిలాల నుంచి ఏం తెలిసింది?
ప్రొఫెసర్ ఎస్.ఆర్. రావు తన పుస్తకంలో ద్వారకా నౌకాశ్రయం గురించి సవివరంగా రాశారు.
” క్రీస్తు పూర్వం 2300 ప్రారంభంలో, ద్వారకా పోర్టు డాక్ పశ్చిమ గోడను ఆనుకుని 240 మీటర్ల పొడవు, 13 మీటర్ల వెడల్పుతో ఒక బ్రిక్ ప్లాట్‌ఫామ్‌ను (రాతి ప్లాట్‌ఫామ్‌ను) లోథల్ ఇంజనీర్లు నిర్మించారు. ఈ పెద్ద ప్లాట్‌ఫామ్‌ను ఆనుకుని ఒక పెద్ద గోదాము 64 బ్లాకులతో ఉండేది” అని తెలిపారు.
”ద్వారకలోని ఇంజనీర్లు తొలుత హార్బర్ టెక్నాలజీని అభివృద్ధి చేసి సముద్రంలో వాడారు. బెట్ ద్వారకలోని పోర్టు వద్ద ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాల నిర్మాణానికి దోహదం చేసిన ఈ టెక్నాలజీ, భారత నౌకాశ్రయ నిర్మాణ చరిత్రల్లో అత్యంత ముఖ్యమైన దానిలో ఒకటిగా నిలిచింది” అని ప్రొఫెసర్ ఎస్. రావు పేర్కొన్నారు.
ఎన్నో విగ్రహాలు, లోహపు వస్తువులు
ద్వారకలో, బెట్ ద్వారకలో ఇప్పటి వరకు జరిగిన అధ్యయనాల్లో, వివిధ రకాల రాళ్లు, మార్బుల్, వివిధ లోహాలకు చెందిన వస్తువులను కనుగొన్నారు.
విష్ణుమూర్తి ఒక చేతిలో గద, మరో చేతిలో సుదర్శన చక్రం ఉన్న ‘త్రివిక్రముడి’ విగ్రహం కూడా బయటపడినట్లు ప్రొఫెసర్ ఎస్. ఆర్. రావు తన పుస్తకంలో రాశారు.
”ద్వారకలోని జగత్ మందిర్ ముందు సముద్ర గర్భంలో జరిపిన తవ్వకాల్లో రాగి, కంచు, ఇత్తడితో చేసిన అనేక వస్తువులు లభించాయి. వీటిలో ముఖ్యమైనవి మూడు కుండలు, ఒక పెద్ద గంట రథం అవశేషాలు.”
‘ఈ రకమైన రాగి కుండను భారతదేశంలో రాగి యుగం నుంచి ఉపయోగిస్తున్నారు, ఇది క్రీస్తుపూర్వం 3000 నుండి 700 మధ్య కాలం నాటిదని భావిస్తున్నారు.
ద్వారక మట్టిలో లభించిన అనేక ఇత్తడి వస్తువులు భారతదేశంలో మరే ఇతర చారిత్రక ప్రదేశంలో కనుగొనలేదు. రాగి జింక్ మిశ్రమాన్ని కలిగి ఉన్న కొన్ని మిశ్రమ మిశ్రమాల అవశేషాలు కూడా ఇక్కడ కనుగొన్నారు వాటి ముఖ్యమైనవి ఏనుగులు, గేదెలు ఖడ్గమృగాల ప్రతిమలు.ఇవి చక్రాలతో రూపొందించిన బండిపై ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి.”
తవ్వకాలలో లభించిన వస్తువులలో ఆయుధాలలో ఇనుము పరిమాణం తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ఇది ఆ సమయంలో ఇనుము తక్కువగా వాడటం లేదా కొరతను సూచిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
”వీటితో పాటు ఇనుప గోళ్లు, హ్యాండిల్స్ తో కూడిన వాటర్ బాటిల్స్ కూడా దొరికాయి. సిలికాన్, ఇనుము, మాంగనీస్, కాల్షియం, మెగ్నీషియం వంటి లోహాల అవశేషాలు కూడా ఈ రకమైన పాత్రలలో కనుగొన్నారు. శంఖంతో చేసిన వస్తువులు కూడా లభించాయి.” అని ఎస్.ఆర్. రావు రాశారు.
రచన, అక్షరాస్యత
బెట్ ద్వారకాలో బయటపడ్డ శాసనాల్లో క్రీస్తు పూర్వం 1001 నుంచి 2000 మధ్యనాటి రచనలకు సంబంధించిన తొలి స్పష్టమైన ఆధారం లభ్యమైంది. దీంతో, ద్వారక ప్రజలు అక్షరాస్యులని తెలిసింది.
” సింధు నాగరికత లిపిని వెలికితీయడంలో ఇది కీలక పాత్ర పోషించింది. సింధు, బ్రాహ్మీ లిపులకు మధ్యన తెగిపోయిన లింక్‌ను పూడ్చడంలో ఇది కీలక పాత్ర పోషించింది” అని ఎస్.ఆర్. రావు రాశారు.
బెట్ ద్వారకాలో కనుగొన్న శాసనాల్లో వాడిన పదాలు, మహాభారత సమయంలో సంస్కృతానికి ఎంత ప్రాధాన్యం ఇచ్చారో గుర్తించారు. అదేవిధంగా, ద్వారకాలో బయటపడిన కుండలు, అత్తరు బాటిళ్లు ఆ సమయంలోని కళలు, హస్తకళా నైపుణ్యాన్ని తెలియజేస్తున్నాయి.
ప్రొఫెసర్ త్రిపాఠి గతంలో బీబీసీతో మాట్లాడుతూ ”గోమతి నది సముద్రంలో కలిసే ప్రాంతం చుట్టూ ఎక్కువగా తవ్వకాలు జరిగాయన్నారు. అక్కడి సముద్రంలో అనేకసార్లు తవ్వకాలు జరిపాం. తవ్వకాల్లో బయటపడినవాటి కంటే అక్కడ ఇంకా ఎక్కువ ఉండవచ్చునని, ఆ ప్రక్రియ కొనసాగుతోందని, పరిశోధన కొనసాగుతుందని చెప్పారు.






























