వాట్సాప్ తమ యూజర్ల ప్రైవసీకి పెద్ద పీఠ వేస్తోంది. కొత్త కొత్త అప్‌డేట్లు తీసుకువస్తోంది. ఈ నేపథ్యంలోనే .. మనం పంపే ఫొటోలు, వీడియోలు ఇతరుల ఫోన్లలో సేవ్ అవ్వకుండా కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తోంది.
వాట్సాప్ అన్నది ప్రతీ ఒక్కరి జీవితంలో ఓ భాగం అయిపోయింది. రోజులో ఒక్కసారైనా వాట్సాప్ వాడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ప్రతీ పనికి వాట్సాప్ ఓ అత్యవసరంగా మారింది. కమ్యూనికేషన్ అంటే వాట్సాప్ అన్నట్లుగా పరిస్థితి తయారైంది. ఇక, వాట్సాప్ కూడా తమ యూజర్ల ప్రైవసీకి భంగం కలుగకుండా చూసుకుంటోంది. కొత్త కొత్త అప్‌డేట్లు తెస్తోంది. మన అవసరాలకు తగ్గట్టుగా సెట్టింగ్స్ మార్చుకునే వెసులుబాటు కల్పిస్తోంది. ఈ నేపథ్యంలోనే కస్టమర్ల ప్రైవసీకి మరింత భద్రత కల్పించడానికి వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తోంది. సాధారణంగా మనం ఎవరికైనా ఫొటోలు, వీడియోలు పంపామనుకోండి..
అవి వారి ఫోన్‌లో సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ, కొత్తగా రాబోయే ఫీచర్ కారణంగా మనం పంపే ఫొటోలు, వీడియోలు సేవ్ చేసుకునే అవకాశం ఉండదు. మన పర్మిషన్ ఉంటేనే వారు ఆ ఫొటోలను సేవ్ చేసుకోగలుగుతారు. అయితే, ఈ ఫీచర్ టెస్టింగ్ స్టేజిలోనే ఉంది. ముందుగా ఐఓఎస్ యూజర్లకు అందుబాటులోకి తేనుంది. ఐఓఎస్‌లో ఇది 25.10.10.70 వాట్సాప్ వర్సన్ కావటం విశేషం. ఈ ఫీచర్ మరో ప్రత్యేకత ఏంటంటే మనం పంపే ఫొటోలు, వీడియోలు ఫార్వర్డ్ చేసే ఆప్చన్ కూడా ఉండదు. దీనికి కూడా మన పర్మిషన్ కావాలి. టెస్టింగ్ స్టేజిలో ఉన్న ఈ ఫీచర్ ముందుగా ఐఓఎస్ యూజర్లకు అందుబాటులోకి వస్తుంది. తర్వాత ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి వస్తుంది.
కొత్త అప్‌డేట్లు గమనించారా?..
కొన్ని రోజుల ముందు వరకు చాట్ రూములో ఉన్నపుడు ఎవరైనా మనకు మెసేజ్ పంపడానికి టైప్ చేస్తుంటే.. ఆన్‌లైన్ అని వచ్చే దగ్గర.. టైపింగ్ అని పడేది. కానీ, ఇప్పుడలా రావటం లేదు. మనం మెసేజ్ టైపు చేసే దగ్గర మూడు చుక్కలు కదులుతూ కనిపిస్తున్నాయి. ఇక, వాట్సాప్ గ్రూపులను ఓపెన్ చేసినపుడు.. గ్రూపు మెంబర్స్ పేర్లు కనిపించే చోట.. గ్రూపులోని ఎంత మంది ఆన్‌లైన్‌లో ఉన్నారో కూడా కనిపిస్తోంది. మన ప్రైవసీని కాపాడ్డానికి చాట్ లాక్ ఆప్చన్ కూడా ఉంది. మనం ఎవరి చాట్‌నైనా సీక్రెట్‌గా ఉంచాలనుకుంటే.. చాట్ లాక్ ఆప్చన్ వాడుకుంటే సరిపోతుంది. పాస్ వర్డ్ ఇచ్చి చాట్ లాక్ ఆప్చన్ ఆన్ చేసుకోవచ్చు. అప్పుడు ఆ చాట్ ఎవరికీ కనిపించదు. మనకు అవసరం అయినపుడు పాస్‌వర్డ్ కొట్టి చాట్‌ను చూసుకోవచ్చు.