కార్తీక పౌర్ణమి ఎప్పుడు? నవంబర్ 4న, 5న?

కార్తీక మాసానికి ఉన్న ప్రత్యేకత ఇంత అంతా కాదు. కార్తీక మాసం చాలా విశేషమైనది. నెల రోజులు పాటు శివుని ప్రత్యేకించి ఆరాధిస్తారు. శివాలయాల్లో అభిషేకాలు, ఇలా ఎన్నో కార్యక్రమాలు జరుపుతారు.


నదీ స్నానానికి కూడా ఎంతో విశిష్టత ఉంటుంది. అలాగే కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి కూడా చాలా విశేషమైనది. కార్తీక పౌర్ణమి నాడు 365 వత్తులు వెలిగిస్తారు. ఈ సంవత్సరం కార్తీక మాసం ఎప్పుడు వచ్చిందో, కార్తీక మాసంలో ఏం చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో, కార్తీక పౌర్ణమి రోజు ఏం చేయాలో వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ ఏడాది కార్తీక పౌర్ణమి ఎప్పుడు వచ్చింది?

పంచాంగం ప్రకారం చూసినట్లయితే కార్తీక పౌర్ణమి తిథి నవంబర్ 4 రాత్రి 10:30కి మొదలై నవంబర్ 5 సాయంత్రం 6:48 వరకు ఉంటుంది. నవంబర్ 5న పౌర్ణమి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంది కాబట్టి పౌర్ణమిని ఆ రోజే జరుపుకోవాలి. చాలా మంది నదీ స్నానం చేసి, దీపారాధన చేసి పరమభక్తితో శివుడిని ఆరాధిస్తారు. పవిత్ర నదిలో ఆ రోజు స్నానం ఆచరించడం వలన ఎంతో పుణ్యం కలుగుతుంది, పాపాలన్నీ తొలగిపోతాయి.

నదీ స్నానం ఏ సమయానికి చేయాలి?

కార్తీక పౌర్ణమి నాడు నదీ స్నానం చేయాలనుకునేవారు నవంబర్ 5 ఉదయం 4:52 నుంచి ఉదయం 5:44 వరకు చేస్తే మంచిది. పూజ చేయడానికి ఉదయం 7:58 నుంచి ఉదయం 9 వరకు అనుకూలంగా ఉంటుంది. సాయంత్రం దీపారాధన చేయడానికి మంచి సమయం సాయంత్రం 5:15 నుంచి 7:05 వరకు.

365 వత్తులు:

కార్తీక పౌర్ణమి నాడు 365 వత్తులు వెలిగించుకుంటే చాలా మంచిది జరుగుతుంది. చాలా మంది ఆ రోజు ఉపవాసం ఉండి 365 వత్తులు వెలిగించుకుంటారు. 365 వత్తులు వెలిగించడం వలన ఏడాదిలో ఏ ఒక్క రోజు దీపం పెట్టకుండా వదిలేసిన రోజూ దీపారాధన చేసిన ఫలితం లభిస్తుంది అని నమ్ముతారు. దీపారాధన చేయని ఫలితం పోకుండా, భగవంతుని అనుగ్రహం కలుగుతుందని విశ్వసిస్తారు.

ఉసిరికాయల దీపారాధన:

కార్తీక పౌర్ణమి నాడు చాలా మంది ఉసిరికాయలో కూడా దీపారాధన చేస్తారు. ఉసిరికాయలో ఆవు నెయ్యి వేసి సాయంత్రం దీపారాధన చేస్తారు. అలా చేయడం వలన సకల శుభాలు కలుగుతాయని, లక్ష్మీదేవి కూడా సంతోషిస్తుందని నమ్ముతారు. ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమని అంటారు. ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తే కూడా కార్తీకమాసంలో విశేష ఫలితాన్ని పొందవచ్చు.

365 వత్తులు ఎలా వెలిగించాలి?

365 వత్తులు వెలిగించేటప్పుడు అగ్గిపుల్లతో వెలిగించకూడదు, కొవ్వొత్తితో అస్సలు వెలిగించకూడదు. ఈ వత్తులను వెలిగించేటప్పుడు అగరబత్తిని ఉపయోగిస్తే మంచిది. అలాగే ఇంటి యజమాని ఈ 365 వత్తులు వెలిగిస్తే అత్యుత్తమ ఫలితాలు లభిస్తాయి. 365 వత్తులు వెలిగించిన తర్వాత అక్షింతలు వేసి “దామోదరం ఆవాహయామి” లేదా “త్రయంబకం ఆవాహయామి” అని చెప్పాలి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.