ఈ ఏడాది తొలి ఏకాదశి ఎప్పుడు.. 5నా? జూలై 6నా? పూజా విధి, శుభ సమయం ఎప్పుడంటే..

ప్రతి సంవత్సరం తొలి ఏకాదశి పండుగను ఆషాఢ మాసం శుక్ల పక్ష ఏకాదశి రోజున జరుపుకుంటారు. ఈ రోజు విష్ణువుకు అంకితం చేయబడింది. దీనిని చాలా పవిత్రంగా భావిస్తారు.


ఈ రోజు నుంచి శ్రీ మహా విష్ణువు క్షీర సాగరంలో యోగ నిద్రలోకి వెళ్లి నాలుగు నెలలు విశ్రాంతి తీసుకుంటాడని నమ్ముతారు. ఈ కాలాన్ని చాతుర్మాసం అంటారు. ఈ సమయంలో వివాహం, గృహ ప్రవేశం వంటి శుభ కార్యాలు జరగవు. భక్తులు ఈ రోజున ఉపవాసం ఉండి శ్రీ మహా విష్ణువును పూజించి మోక్షాన్ని కోరుకుంటారు. అటువంటి పరిస్థితిలో 2025లో తొలి ఏకాదశి ఎప్పుడు వచ్చింది? పూజ శుభ సమయం ఎప్పుడు, ఈ ఏకాదశి ఉన్న ప్రాముఖ్యతను తెలుసుకుందాం..

తొలి ఏకాదశి ఎప్పుడు జరుపుకోవాలంటే

ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం శుక్ల పక్ష ఏకాదశి తిథి రోజున తొలి ఏకాదశి జరుపుకుంటారు. ఈసారి ఈ తిథి జూలై 06, 2025న వచ్చింది. హిందూ క్యాలెండర్ ప్రకారం ఏకాదశి తిథి జూలై 05న సాయంత్రం 06:58 గంటలకు ప్రారంభమై జూలై 06న రాత్రి 09:14 గంటలకు ముగుస్తుంది. ఉపవాసం ఎల్లప్పుడూ ఉదయ తిథి రోజున పాటిస్తారు కనుక ఈ తొలి ఏకాదశి ఉపవాసం జూలై 06న పాటించాల్సి ఉంటుంది.

తొలి ఏకాదశి పూజా సమయం

బ్రహ్మ ముహూర్తం – జూలై 06వ తేదీ ఉదయం 04:08 నుంచి 04:49 వరకు

అభిజిత్ ముహూర్తం – మధ్యాహ్నం 11:58 నుంచి 12:54 వరకు

విజయ ముహూర్తం – మధ్యాహ్నం 02:45 నుంచి 03:40 వరకు

సంధ్యా ముహూర్తం – సాయంత్రం 07:21 నుంచి 07:42 వరకు

అమృత కాలం – మధ్యాహ్నం 12:51 నుంచి 02:38 వరకు

త్రిపుష్కర యోగం – రాత్రి 09:14 నుంచి 10:42 వరకు

రవి యోగం – ఉదయం 05:56 నుంచి రాత్రి 10:42 వరకు

ఉపవాసం ఉండటానికి శుభ సమయం

తొలి ఏకాదశి ఉపవాసం ద్వాదశి తిధిలో అంటే జూలై 07, 2025న విరమించాల్సి ఉంటుంది. పంచాంగం ప్రకారం ఉపవాసం విరమించడానికి శుభ సమయం ఉదయం 05:29 నుంచి ఉదయం 08:16 వరకు ఉంటుంది. ఈ రోజు ద్వాదశి తిథి రాత్రి 11:10 గంటలకు ముగుస్తుంది. కనుక ఉదయం ఉపవాసం విరమించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.

తొలి ఏకాదశి ప్రాముఖ్యత

ఈ ఏకాదశిని పద్మ, హరిశయని, దేవశయని ఏకాదశి లేదా ఆషాఢ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజు నుంచి విష్ణువు యోగ నిద్రలోకి వెళ్లి కార్తీక మాసంలోని శుక్ల ఏకాదశి (ప్రబోధిని ఏకాదశి)రోజున మేల్కొంటాడని నమ్ముతారు. ఈ నాలుగు నెలలను చాతుర్మాసం అంటారు. ఈ సమయంలో సాధన, ఉపవాసం, ఆధ్యాత్మిక పనులు ఫలవంతమైనవిగా పరిగణించబడతాయి, అయితే వివాహం, గృహప్రవేశం వంటి శుభ కార్యాలు నిషేధించబడ్డాయి. హిందూ మత విశ్వాసాల ప్రకారం దేవశయని ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వల్ల జీవితంలో ఆనందం, శాంతి, శ్రేయస్సు లభిస్తుంది. అలాగే ఒక వ్యక్తి పాపాల నుంచి విముక్తి పొంది మోక్షం పొందుతాడు.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.