ఎన్‌పీఎస్, యూపీఎస్‌లో ఏది బెటర్..? పింఛన్ టెన్షన్ లేని ది బెస్ట్ పథకం ఏదంటే.

www.mannamweb.com


ఉద్యోగుల భవిష్యత్తు, రిటైర్మెంట్ అనంతరం ఆర్థిక భద్రత కల్పించడానికి ప్రభుత్వాలు ఎంతో ప్రాధాన్యం ఇస్తాయి. దానిలో భాగంగా పెన్షన్ పథకాన్ని అమలు చేస్తున్నాయి.

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం ఈ ఆగస్టు 24న ఏకీకృత పెన్షన్ పథకానికి (యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్) ఆమోదం తెలిపింది. 2025 ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చే కొత్త పథకం ద్వారా 23 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు మేలు జరుగుతుందని తెలిపింది. ఉద్యోగుల కోసం ఇప్పటికే జాతీయ పెన్షన్ పథకం అమలవుతోంది. తమ ఇష్టం ప్రకారం ఈ రెండింటిలో ఒకదాన్ని ఉద్యోగులు ఎంపిక చేసుకోవాలి. ఈ నిర్ణయాన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు మెచ్చుకున్నాయి. కొొందరు మాత్రం పాత పెన్షన్ స్కీమ్‌కు తిరిగి రావాలని డిమాండ్ చేశారు

ఆర్థిక భద్రత

ప్రస్తుతం నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) కింద కవర్ చేయబడిన ప్రభుత్వ ఉద్యోగులు దానిలోనే కొనసాగించవచ్చు. లేకపోతే కొత్తగా తీసుకువచ్చిన యూపీఎస్ కు మారవచ్చు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల మాట్లాడుతూ కొత్త ఫించన్ విధానం 23 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు మేలు చేస్తుందన్నారు. వారి గౌరవం, ఆర్థిక భద్రతకు భరోసా ఇస్తుందని తెలిపారు. ఉద్యోగుల భవిష్యత్తు ,సురక్షిత భవిష్యత్తు కు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ఏప్రిల్ ఒకటి నుంచి అమలు..

యూపీఎస్ పథకం వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి అమలవుతుంది. అదే ఏడాది మార్చి 31 లోపు, లేదా అంతకంటే ముందు ఉద్యోగ విరమణ చేసిన వారందరూ దీనికి అర్హులే. ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రస్తుతం అమలులో ఉన్న పెన్షన్ ను సమీక్షించేందుకు ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్ నేతృత్వంలో గతేడాది ఒక కమిటీని ఏర్పాటు చేసింది. 2004 ఏప్రిల్ ఒకటి తర్వాత ఉద్యోగంలో చేరిన వారందరూ ఎన్‌పీఎస్ కింద ఉన్నారు. వారికి ఇప్పుడు రెండు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. పాత విధానంలోనే కొతసాగవచ్చు, లేకపోతే యూపీఎస్ కు మారిపోవచ్చు.

నిబంధనలు

ఏకీకృత పెన్షన్ పథకం (యూపీఎస్) ద్వారా కనీసం 25 ఏళ్లు పనిచేసిన ఉద్యోగులకు పెన్షన్ హామీ లభిస్తుంది. కనీసం 10 సంవత్సరాలు పనిచేసిన వారికి నెలకు రూ.10 వేలు కనీస పెన్షన్ అందిస్తుంది. అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి నిబంధనల మేరకు కుటుంబ పెన్షన్‌ను అందిస్తుంది.

పింఛన్ లెక్కించే విధానం

యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)లో ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం వారు గత 12 నెలలో పొందిన సగటు ప్రాథమిక వేతనంలో 50 శాతానికి సమానంగా పింఛన్ ఇస్తారు. ఇది 25 ఏళ్లు సర్వీసులో ఉన్న వారికి వర్తిస్తుంది. అంతకంటే తక్కువ వారికి నిబంధనల మేర మంజూరు చేస్తారు. ఏమైనా కనీసం పదేళ్ల సర్వీసు మాత్రం అవసరం.

కుటుంబ పెన్షన్

ఉద్యోగి మరణిస్తే అతడి కుటుంబానికి పింఛన్ అందుతుంది. మరణించే సమయానికి ఉద్యోగి పొందుతున్న పెన్షన్ మొత్తంలో దాదాపు 60 శాతం అందజేస్తారు. ఇది ఆ కుటుంబానికి నిరంతర ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది.

కనీస పెన్షన్

పదేళ్ల కనీస సర్వీస్ ఉన్న వారికి నెలకు రూ. 10 వేలను కనీస పెన్షన్ గా అందిస్తారు.