SIP vs PPF రెండింట్లో ఏది బెటర్

మీరు ఏదైనా ఇన్విస్ట్‌మెంట్ ప్లాన్ చేస్తున్నారా? దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి చూస్తుంటే.. ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్లు ఉన్నాయి.


ఒకవేళ మీరు నెలవారీ జీతం పొందే ఉద్యోగి అయినా లేదా సాధారణ వ్యక్తి అయినా సరే.. ప్రతిఒక్కరికి జీవితంలో రిటైర్మెంట్ ప్లాన్ అనేది తప్పనిసరి. పదవీ విరమణ తర్వాత మిగతా జీవితాన్ని ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా, ఇతరులపై ఆధారపడకుండా స్వతంత్రంగా ఉండేందుకు ఎంతో ఉపయోగపడతాయి.

మీరు అధికమొత్తంలో డబ్బులు కూడబెట్టుకోవాలని భావిస్తే.. అందుకు అద్భుతమైన రెండు ఇన్వెస్ట్‌మెంట్లు ప్లాన్లు ఉన్నాయి. అందులో ప్రధానంగా మీరు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్స్ (PPF) లేదా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ల (SIP) రెండింట్లో ఏదైనా ఎంచుకోవచ్చు.

ఈ రెండూ దీర్ఘకాలిక పెట్టుబడికి అత్యంత ప్రయోజనకరంగా ఉంటాయి. పీపీఎఫ్ అనేది ప్రభుత్వ మద్దతు కలిగిన సేవింగ్స్ స్కీమ్, సిప్ అనేది మార్కెట్-లింక్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. స్టాక్స్‌లో లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్‌ చేస్తే మార్కెట్ పరంగా అధిక లాభాలను గడించవచ్చు.

అదే, ప్రభుత్వ పీపీఎఫ్ పథకాల్లో పెట్టుబడి చేస్తే గ్యారంటీ రిటర్న్స్ పొందవచ్చు. ఈ రెండింట్లో పీపీఎఫ్‌, సిప్ పెట్టుబడులకు ఏది బెటర్? 15 ఏళ్ల వరకు ప్రతి ఏడాదికి ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎందులో ఎక్కువ ఆదాయం వస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

సిప్ (SIP) అంటే ఏంటి? :
మ్యూచువల్ ఫండ్స్ అనేది మార్కెట్-లింక్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్.. పెట్టుబడిదారులు కాలానుగుణంగా నెలవారీ, త్రైమాసికం లేదా వార్షికంగా వారి ఆర్థిక సామర్థ్యం ఆధారంగా పెట్టుబడి పెట్టవచ్చు. దీని సగటు దీర్ఘకాల రాబడి దాదాపు 12 శాతంగా ఉంటుంది.

పీపీఎఫ్ (PPF) అంటే ఏంటి? :
పీపీఎఫ్ లేదా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్స్ అనేది ప్రభుత్వ-ఆధారిత సేవింగ్స్ స్కీమ్. మీరు సంవత్సరానికి ఇక్కడ రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. మెచ్యూరిటీ వ్యవధి 15 సంవత్సరాలు ఉంటుంది. సంవత్సరానికి 7.1 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.

మీరు సంవత్సరానికి రూ. 70వేలు పెట్టుబడి పెడితే, రెండు ఇన్వెస్ట్‌మెంట్‌లలో 15 సంవత్సరాల తర్వాత మీకు ఎంత ప్రాఫిట్ ఉంటుందో తెలుసా? అది ఇప్పుడు తెలుసుకుందాం.

సిప్ పెట్టుబడితో 15ఏళ్లలో ఎంత ప్రాఫిట్ వస్తుందంటే?
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టేవారికి ఇది బెస్ట్.. నెలవారీగా కొంత డిపాజిట్ చేయడమే సిప్ అంటారు. మార్కెట్ బట్టి మ్యూచువల్ ఫండ్ల నెట్ అసెట్ వాల్యూ ఉంటుంది. మీరు సంవత్సరానికి రూ. 70వేలు (నెలకు రూ. 5,833) పెట్టుబడి పెడితే, 15 సంవత్సరాలలో మీ మొత్తం పెట్టుబడి రూ. 10,49,940 అవుతుంది. 12 శాతం సగటు వార్షిక రాబడిని ఊహిస్తే.. 15 సంవత్సరాల ముగింపులో మీ ప్రాఫిట్ దాదాపు రూ. 29,43,192 అవుతుంది. ఇందులో రూ. 18,93,252 మూలధన లాభాలను పొందవచ్చు.

పీపీఎఫ్ పెట్టుబడితో 15ఏళ్లలో ప్రాఫిట్ ఎంతంటే?
పీపీఎఫ్ పెట్టుబడులకు గ్యారంటీ రిటర్న్స్ ఉంటాయి. నిర్ణీత వడ్డీరేటు కూడా వస్తుంది. వడ్డీరేటు ఒకసారి ఫిక్స్ చేస్తే.. పీపీఎఫ్ కాల పరిమితి ముగిసే వరకు అదే వడ్డీరేటు ఉంటుంది. మీరు పీపీఎఫ్‌లో సంవత్సరానికి రూ. 70వేల పెట్టుబడి పెడితే, 15 సంవత్సరాలలో మీ మొత్తం పెట్టుబడి కూడా రూ. 10,50,000 అవుతుంది. అయితే, 7.1 శాతం వార్షిక రాబడితో, వచ్చే వడ్డీ రూ. 8,48,498 అవుతుంది. చివరి ప్రాఫిట్ (అసలు, వడ్డీ రెండింటి మొత్తం) కలిపి దాదాపు రూ. 18,98,498కి పెరుగుతుంది.

– సిప్ అనేది మార్కెట్-లింక్డ్.. అంటే ఇందులో రాబడికి హామీ ఉండదు. పైన పేర్కొన్న 12 శాతం రాబడి అంచనా మాత్రమే. మార్కెట్ పరిస్థితులను బట్టి వాస్తవ రాబడి మారవచ్చు.
– పీపీఎఫ్ హామీతో కూడిన రాబడిని అందిస్తుంది. అయితే, వడ్డీ రేటు స్థిరంగా ఉంటుంది. సిప్‌ల కన్నా కంటే తక్కువగా ఉంటుంది.

రెండిట్లో ఏది బెటర్ అంటే? :
లాభం కోసం చూస్తే.. పీపీఎఫ్ కంటే సిప్ బెటర్ అని చెప్పవచ్చు. కానీ, సిప్‌లో మార్కెట్ నష్టభయం ఎక్కువ. మార్కెట్ సూచీల కారణంగా దాని విలువ లో హెచ్చుతగ్గుదల ఉంటుంది. పీపీఎఫ్‌లో మాత్రం కచ్చితమైన రిటర్న్స్ పొందవచ్చు. ఇందులో మరో బెనిఫిట్ ఏంటంటే.. వచ్చే వడ్డీపై సెక్షన్ 80C కింద పన్ను వర్తించదు.