ఏపీలో గెలిచేదెవరు?

తెలంగాణ వ్యాప్తంగా రూ.2 వేల కోట్ల బెట్టింగులు!
ఏపీ వాళ్లు ఉండే ఏరియాలు, బార్డర్ జిల్లాల్లో ఫుల్
వైఎస్సార్​సీపీదే పవర్ అని కొందరు.. కూటమిదే గెలుపని మరికొందరు పందేలు
పిఠాపురం, మంగళగిరి, కుప్పం, పులివెందులలో గెలుపు, మెజారిటీపైనా పోటాపోటీ
హైదరాబాద్, వెలుగు: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్​సభ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్ కొనసాగుతోంది. హైదరాబాద్ లో ఉన్న ఏపీ వాళ్లతో పాటు తెలంగాణ వాళ్లు కూడా ఇందులో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఏపీ వాళ్లు ఎక్కువగా నివాసం ఉండే కూకట్ పల్లి, కేపీహెచ్ బీ, మియాపూర్, శేరిలింగంపల్లి, వనస్థలిపురం, ఎల్బీ నగర్, దిల్ సుఖ్​ నగర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, నిజాంపేట్, ప్రగతినగర్, ఉప్పల్ ఏరియాల్లో ఈ బెట్టింగ్స్ జోరుగా సాగుతున్నాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

ఇక్కడ వ్యాపారులు, సినిమా వాళ్లు, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న వాళ్లు బెట్టింగ్ లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆఫ్ లైన్ తో పాటు ఆన్ లైన్ లోనూ పందేలు కొనసాగుతున్నాయి. వందకు వంద ఇస్తామని కొందరు పందేలు కాస్తుంటే.. వందకు నూటా యాభై ఇస్తామని మరికొందరు పందేలు కాస్తున్నారు. వీటితో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో ఎక్కువ శాతం ఉన్న ఏపీ వాళ్లు.. ఓ ప్రధాన సామాజిక వర్గానికి చెందిన వాళ్లు కూటమి అధికారంలోకి వస్తుందని బెట్టింగులు కడుతున్నారు.

ఇక్కడ లక్ష బెట్టింగ్ కట్టి గెలిస్తే రూ.2లక్షలు చెల్లించేలా బెట్టింగ్ కాస్తున్నారు. పార్టీ పరంగానే కాకుండా నియోజకవర్గాల స్థాయిలోనూ గెలుపోటములపై బెట్టింగ్స్ కొనసాగుతున్నాయి. ఇలా తెలంగాణ వ్యాప్తంగా రూ.2 వేల కోట్ల పందేలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

కీలక నియోజక వర్గాలపై ఎక్కువ

ఏపీలో ఏ ప్రభుత్వం వస్తుంది? ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది? అన్న అంశాలపై ప్రధానంగా బెట్టింగ్ జరుగుతోంది. అలాగే, పలు కీలక నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారు? గెలిస్తే ఎంత మెజారిటీ వస్తుంది? అన్న అంశంపై కూడా ఎక్కువ బెట్టింగ్ సాగుతోంది. 175 సీట్లలో వైఎస్సార్​సీపీ 110 సీట్లు దాటుతుందని ఎక్కువ మంది పందెం కట్టగా.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని మరికొంతమంది బెట్టింగ్ కడుతున్నారు.

వైఎస్సార్​సీపీకి 120 సీట్లు వస్తాయని ఓ వర్గం, రావని మరో గ్రూపు.. జగన్​కు అరవై సీట్లు మించవని ఒక వర్గం బెట్టింగ్ ఆడుతోంది. అలాగే, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం, టీడీపీ చీఫ్ చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పం, నారా లోకేశ్ పోటీ చేస్తున్న మంగళగిరి, సీఎం జగన్ పోటీ చేస్తున్న పులివెందులతో పాటు కొడాలి నాని, వల్లభనేని వంశీ, రఘురామకృష్ణరాజు, ఫురందేశ్వరి, సీఎం రమేశ్, బాలకృష్ణ పోటీ చేస్తున్న హిందూపురం, విజయవాడ ఎంపీతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాలపై బెట్టింగ్ రాయుళ్లు ఎక్కువ ఫోకస్ పెట్టారు.

వీటితో పాటు పల్నాడు, గుంటూరు, కృష్ణా, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లోని నియోజకవర్గాల స్థాయిలో అభ్యర్థుల గెలుపోటములపై పందేలు కాస్తున్నారు. పార్లమెంట్ విషయానికొస్తే.. విశాఖపట్నం, గుంటూరు, ఒంగోలు, రాజమండ్రిపై బెట్టింగ్స్ జరుగుతున్నాయి. విశాఖపట్నం నుంచి బాలకృష్ణ చిన్నల్లుడు భరత్, బొత్స ఝాన్సీ, గుంటూరులో దేశంలోనే అత్యంత ఆస్తిపరుడైన అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, కిలారీ రోశయ్య బరిలో ఉండడంతో జోరుగా పందేలు కాస్తున్నారు. ఒంగోలులో మాగుంట శ్రీనివాసులు రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజమండ్రిలో పురంధేశ్వరి, ముత్యాల నాయుడు, పోటీలో నిలవడంతో ఈ సీట్లపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

టాప్ ప్లేస్​లో పల్నాడు, కృష్ణా, గుంటూరు

పోలింగ్ ముగిసిన తర్వాత పందేలు జోరందుకున్నాయి. ఇప్పటి వరకు పల్నాడు, కృష్ణా, గుంటూరు జిల్లాలు పందేల్లో టాప్ ప్లేస్ లో ఉన్నాయి. ఈ మూడు జిల్లాల్లో అభ్యర్థులు వందలు, వేల కోట్ల ఆస్తి పరులు కావడం.. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగడం, పోటాపోటీగా ఖర్చు చేయడంతో స్టేట్ వైడ్ హైప్ క్రియేట్ అయ్యింది. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో తక్కువగా బెట్టింగ్స్ సాగుతున్నాయి.

వీటితోపాటు ఎన్ఆర్ఐలు బరిలోకి దిగిన సెగ్మెంట్లలో ఇప్పటికే వందల కోట్ల రూపాయలు చేతులు మారినట్టు తెలుస్తోంది. పల్నాడు ప్రాంతంలో ఎకరాలకు ఎకరాల భూములు బెట్టింగ్ కింద అగ్రిమెంట్ చేసుకున్నట్టు సమాచారం. బెట్టింగ్స్ లో బుకీల హవా నడుస్తోంది. గెలిచిన సొమ్ములో కనీసం పది శాతం నుంచి 20 శాతం వరకు కమీషన్ తీసుకుంటూ భరోసా ఇస్తున్నారు. నగదు, స్వైపింగ్ మెషీన్ల ద్వారా హైదరాబాద్ కేంద్రంగానే ఎక్కువ బెట్టింగ్స్ సాగుతున్నాయి.

బార్డర్ జిల్లాల్లో ఫుల్

రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్​నగర్ జిల్లాలు ఏపీ బార్డర్​ను కలిగి ఉన్నాయి. వీటిలో కోదాడ, హుజూర్ నగర్, మధిర, సత్తుపల్లి, వైరా, అలంపూర్ నియోజకవర్గాల్లో ఏపీ నుంచి వచ్చి ఉంటున్న వాళ్లు, ఇక్కడ వ్యాపారం చేస్తున్న వారు బెట్టింగ్ కాస్తున్నారు. కొన్ని గ్రామాల్లో రూ.5 కోట్లు బెట్టింగ్ కాసినట్లు చెప్తున్నారు. ఎక్కువ శాతం వైఎస్సార్​ సీపీనే తిరిగి అధికారంలోకి వస్తుందని బెట్టింగ్ కాసిన ట్లు తెలుస్తోంది. కూటమి ప్రభావం, పవన్ కల్యాణ్ గెలుపు, ఓటమి, ముఖ్య నేతల మెజారిటీపై ఎక్కువ పందేలు కాశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *