ఎవరి వ్యూహం వారిదే.. టీడీపీ కూటమి వర్సెస్ వైసీపీ.. సాగర తీరంలో వేడెక్కిన రాజకీయం

www.mannamweb.com


విశాఖపట్నం జిల్లాలో రాజకీయ వాతావరణం.. టోటల్ ఏపీనే వేడిఎక్కింది. అటు GVMC స్టాండింగ్ కమిటీ ఎన్నికలు, ఇటు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అధికార ఎన్డీఏ కూటమి ప్రతిపక్ష వైసీపీ వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి. ఎలాగైనా ఈ రెండు ఎన్నికల్లో గెలిచి తీరాలనే లక్ష్యంతో అప్పుడే క్యాంప్‌ రాజకీయాలు మొదలుపెట్టాయి. 97 మంది కార్పొరేటర్లు ఉన్న జీవీఎంసీలో 10 వార్డులకు ఒకరు చొప్పున మొత్తం 10 మందిని స్టాండింగ్ కమిటీగా ఎన్నుకుంటారు. బుధవారం జరిగే ఈ GVMC స్టాండింగ్ కమిటీ ఎన్నికలో క్లీన్‌ స్వీప్‌ చేయాలని అటు కూటమి, ఇటు వైసీపీ నేతలు వ్యూహ ప్రతి వ్యూహాల్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే వైసీపీకి చెందిన 12 మంది టీడీపీ, జనసేన వైపు వెళ్లారు. తాజాగా విశాఖకు చెందిన ఐదుగురు వైసీపీ కార్పొరేటర్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ సమక్షంలో జనసేనలో చేరారు. మరికొంత మంది వైసీపీ కార్పొరేటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో GVMC స్టాండింగ్‌ కమిటీ ఎన్నిక రసకందాయంలో పడింది. బలం లేకపోయినా అక్రమంగా గెలిచేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు ఎంపీ విజయసాయిరెడ్డి.

మరోవైపు విశాఖ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే ఈ ఎన్నికని పాలక, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అభ్యర్థిత్వాన్ని ఇప్పటికే వైసీపీ ఖరారు చేసింది. ఆర్ధికంగా, సామాజికంగా బలమైన నేత కావడం.. స్థానిక సంస్థల ప్రతినిధులను ప్రభావితం చేయగలుగుతారన్న నమ్మకంతో బొత్సవైపే వైసీపీ అధినేత జగన్ మొగ్గు చూపారు. టీడీపీ అభ్యర్థిగా పీలా గోవింద్‌ పేరు దాదాపు ఖరారయ్యే అవకాశం ఉంది.

సంఖ్యా పరంగా చూస్తే విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ కంటే వైసీపీకి మూడురెట్ల బలం ఉంది. కానీ కూటమి నేతలు ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టారు. టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ నివాసంలో సమావేశానికి అరకు, పాడేరు నుంచి దాదాపు 60 మంది వైసీపీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు హాజరయ్యారు. మరికొంతమందిని టచ్‌లోకి తెచ్చుకునే వ్యూహాల్లో ఉన్నారు కూటమి నేతలు. అటు.. వైసీపీ సైతం అప్రమత్తమైంది. ఓటు హక్కు ఉన్న సభ్యులతో వైసీపీ అధినేత జగన్ బుధవారం సమావేశం కానున్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో వైసీపీ నేతలతో ఇప్పటికే బొత్స భేటీ అయ్యారు. బలం లేకపోయినప్పటికీ డబ్బుతో ఓట్లు కొనాలని చంద్రబాబు చూస్తున్నారనీ.. ఇది మంచి పద్ధతి కాదనీ అన్నారు బొత్స సత్యనారాయణ.

మొత్తంగా ఇరువర్గాల వ్యూహ, ప్రతివ్యూహాలతో రాజకీయం రంజుగా సాగుతోంది. పోటాపోటీ సమావేశాలు, శిబిరాలతో రాజకీయం హాట్ హాట్‌గా నడుస్తోంది.