ఇటీవలి వారాల్లో డాలర్ మళ్లీ పడిపోయింది, గత నాలుగేళ్లలో కనిష్ట స్థాయికి చేరుకుంది. యూరో, పౌండ్‌తో పోలిస్తే డాలర్ క్షీణత ఎక్కువగా ఉంది. ఈ వారంలోనే దాదాపు 3 శాతం పడిపోయింది.
“చాలామంది ఈ సంవత్సరం డాలర్ మరింత బలహీనపడాలి, బలహీనపడవచ్చు, బలహీనపడుతుందని అనుకుంటారు” అని ఐఎన్జీలోని ఫైనాన్సియల్ మార్కెట్ రీసర్చ్ గ్లోబల్ హెడ్ క్రిస్ టర్నర్ అన్నారు. “ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కానీ, ఏ దిశలో వెళ్తుందో మాత్రం కాస్త స్పష్టత ఉంది” అన్నారు.
బలహీనమైన డాలర్ అమెరికన్ల కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది. దిగుమతి చేసుకున్న వస్తువులు మరింత ఖరీదైనవి అవుతాయి. దీనివల్ల అమెరికాలో ధరలు పెరుగుతాయి.
ఈ పతనం వల్ల ప్రపంచంలోని ప్రధాన కరెన్సీగా ఉన్న డాలర్ స్థితికి ముప్పు పొంచి ఉందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంతకీ, డాలర్ విలువ ఎందుకు తగ్గుతోంది? దానర్థం ఏంటి?
డాలర్‌కు ఏమైంది?
దశాబ్దకాలంగా డాలర్ బలంగా ఉంది. 2020, 2022 మధ్య విలువ చాలా పెరిగింది. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో అధిక వృద్ధి, అధిక వడ్డీ రేట్లు అప్పుడు డాలర్‌కు సహాయపడ్డాయి.
అయితే, గత సంవత్సరం డాలర్ ఇండెక్స్ దాదాపు 10 శాతం పడిపోయింది. 2017 తర్వాత అదే భారీ పతనం. ట్రంప్ సుంకాల ప్రకటనల తర్వాత ఇది ఎక్కువైంది.
అంతేకాదు, ఈ నెలలో గ్రీన్‌లాండ్‌పై యూరప్‌తో ఉద్రిక్తత కారణంగా డాలర్ మరింత పడిపోయింది.
డాలర్‌ను మరింత బలహీనపరిచే చర్యలను అమెరికా పరిశీలిస్తుందనే ఊహాగానాల మధ్య, ఈ వారం నష్టాలు కొనసాగాయి. జపాన్ యెన్‌ను బలోపేతం చేయడానికి ఆ దేశంతో పాటు అమెరికా కూడా డాలర్లను విక్రయించవచ్చని భావిస్తున్నారు, యెన్ కూడా వేగంగా విలువను కోల్పోవడమే దీనికి కారణం.
డాలర్ ఎందుకు పడిపోతోంది?
డోనల్డ్ ట్రంప్ ప్రభుత్వ విధానాలపై మార్కెట్ ఆందోళనలకు డాలర్ విలువ పడిపోవడం ఒక సంకేతమని విశ్లేషకులు అంటున్నారు.
“ప్రభుత్వ అనూహ్య విధానాలకు మార్కెట్లు స్పందిస్తున్నాయి, కొన్నిసార్లు పెరుగుతున్నాయి, కొన్నిసార్లు తగ్గుతున్నాయి” అని బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూషన్‌లో సీనియర్ ఫెలో, గోల్డ్‌మన్ స్యాక్స్‌లో మాజీ ఎఫ్ఎక్స్ వ్యూహకర్త రాబిన్ బ్రూక్స్ అన్నారు.
సుంకాలు, గ్రీన్‌లాండ్ అంశాలలో వ్యతిరేకత వంటి విషయాలను ఆయన గుర్తుచేశారు.
“ఈ రకమైన అస్తవ్యస్థ పరిస్థితులు అందరికంటే అమెరికాను ఎక్కువగా బాధిస్తాయని డాలర్ క్షీణతతో మార్కెట్లు చెబుతున్నాయి” అన్నారు రాబిన్ బ్రూక్స్.
ఈ సంవత్సరం ప్రారంభంలో మార్కెట్లు ప్రశాంతంగా ఉన్నట్లు కనిపించింది కానీ, గ్రీన్‌లాండ్‌పై వాణిజ్య ఉద్రిక్తతలు వేగంగా పెరగడంతో ఆ పరిస్థితి మారిపోయిందని మాక్వేరీలో ప్రపంచ విదేశీ మారకం, వడ్డీ రేటు వ్యూహకర్త థియరీ విజ్‌మాన్ అన్నారు.
“ఇది ప్రజలను ఆందోళనకు గురిచేస్తోందని అనుకుంటున్నా” అన్నారాయన.
ఈ నెలలో డాలర్ తగ్గడమే కాకుండా, భవిష్యత్తులో డాలర్ హెచ్చుతగ్గులపై పందేలు కూడా పెరిగాయని విజ్‌మాన్ అన్నారు.
విదేశాల్లో పెట్టుబడి అవకాశాలు పెరగడం, ఇటీవల జపనీస్ బాండ్ మార్కెట్లో అమ్మకాలు పెరగడం వంటి ఇతర కారణాలు ఉన్నాయి. ఈ అమ్మకాల ఫలితంగా కొంతమంది ట్రేడర్లు యెన్, డాలర్ మధ్య వ్యత్యాసాల నుంచి లాభం పొందడానికి ప్రయత్నించారు.
అయితే, ఈ వారం డాలర్‌ను స్థిరీకరించడంలో మద్దతుగా ఉన్న జపాన్‌కు సాయం చేయడానికి వాషింగ్టన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ అన్నారు.
కానీ, ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడేం చేస్తుందనే దానిపై ఇంకా అనిశ్చితి ఉందని విశ్లేషకులు అంటున్నారు.
పెట్టుబడిదారులు డాలర్ నుంచి బంగారానికి మారడం వల్ల, గత సంవత్సరంతో పోలిస్తే బంగారం ధర రెట్టింపైంది. గత సంవత్సరం దారి మళ్లించిన నిధుల నుంచి ఇతర జాతీయ కరెన్సీలు పెద్దగా ప్రయోజనం పొందలేకపోయినప్పటికీ, మార్పు కనిపించింది.
ఈ నెలలో, డాలర్‌తో పోలిస్తే యూరో, పౌండ్ పెరిగాయి. ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ ట్రాక్ చేసిన 19 అభివృద్ధి చెందుతున్న మార్కెట్ కరెన్సీలలో పదకొండు 1 శాతానికి పైగా లాభపడ్డాయి.
ఆమ్‌స్టర్‌డామ్, డెన్మార్క్‌లోని పెన్షన్ ఫండ్‌లు అమెరికా ట్రెజరీల హోల్డింగ్‌లను తగ్గించాయి, దీంతో ప్రపంచ పెట్టుబడిదారులు కూడా అమెరికా నుంచి దూరం జరగొచ్చు.
అమెరికా వెలుపల వృద్ధి అవకాశాలు మెరుగుపడటంతో ఈ సంవత్సరం డాలర్ మరో 4 శాతం నుంచి 5 శాతం వరకు తగ్గుతుందని ఐఎన్జీ అంచనా వేస్తోంది.
ట్రంప్ కోరుకుంటున్నదీ అదేనా?
ప్రస్తుతానికి, డాలర్ విలువ తగ్గుదల స్వల్పంగా ఉంది, కాబట్టి అమెరికా ప్రజలపై ప్రభావం తక్కువేనని బ్రూక్స్ అన్నారు.
తరువాత ఏం జరుగుతుందనేది అమెరికా ఆర్థిక పనితీరు, సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను ఎంత త్వరగా తగ్గిస్తుందనే దానిపై ఆధారపడి ఉంటుంది.
వడ్డీ రేట్లను త్వరగా తగ్గించాలని ట్రంప్ ఒత్తిడి చేస్తున్నారు, రాబోయే నెలల్లో కేంద్ర బ్యాంకుకు నాయకత్వం వహించడానికి తనతో ఏకీభవించే వ్యక్తిని నియమిస్తారనే అభిప్రాయాలున్నాయి.
రేట్లు తగ్గితే, పెట్టుబడిదారులు మరోచోట అధిక రాబడి కోసం చూస్తారు కాబట్టి, డాలర్ మరింత తగ్గవచ్చు.
అయితే, వైట్ హౌస్ దీనిని మంచి పరిణామంగానే చూడొచ్చు. ఎందుకంటే, ట్రంప్, వైట్ హౌస్ ఇతర అధికారులు బలహీనమైన డాలర్‌ను గతంలో స్వాగతించారు. డాలర్ తగ్గితే అమెరికా ఎగుమతులకు పోటీపెరిగేందుకు సాయపడుతుందని భావన.
“అది వినడానికి అంత బాగోదు, కానీ బలమైన డాలర్ కంటే బలహీనమైన డాలర్‌తో ఎక్కువ డబ్బు సంపాదిస్తారు” అని డోనల్డ్ ట్రంప్ జులైలో అన్నారు.
ఈ వారం డాలర్ పతనం గురించి అడిగినప్పుడు, “కరెన్సీ బాగా పనిచేస్తోంది” అని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
డాలర్‌లో దీర్ఘకాలిక తగ్గుదల అనేది అమెరికా కంపెనీలకు సహాయపడుతుందని బ్రూక్స్ అభిప్రాయపడ్డారు. అయితే, అది ‘తప్పుడు కారణాల వల్ల’ జరిగితే ప్రయోజనాలు పరిమితమని ఆయన హెచ్చరించారు.
మార్కెట్ పేలవమైన విధానాలకు ప్రతిస్పందిస్తుంటే, అది బహుశా ‘ముఖ్యమైన సంకేతం’ అన్నారు.



































