‘మదర్స్ డే’ను ఆదివారమే ఎందుకు చేసుకుంటారు? దీని వెనుక ఇంత కథ ఉందా?

www.mannamweb.com


World Mothers Day 2024 : అందరినీ కనే శక్తి అమ్మకు మాత్రమే అని ఓ సినీ కవి అన్నట్లు అమ్మ ఓ వ్యక్తి కాదు ఓ శక్తి. లోకాన్ని నడిపించే అద్వితీయ శక్తి అమ్మ. కానీ అమ్మ ఏ రోజూ ఇది నేనే చేశాను నా గొప్పే అని ఎప్పుడూ చెప్పుకోదు. అందుకే అమ్మ అంటే త్యాగం అని కూడా అంటారు. గోరంతలు చేసి కొండంతలు చెప్పుకునే మనుషులున్న ఈ లోకంలో తన ప్రాణాలనే పణంగా పెట్టి బిడ్డకు జన్మనిస్తుంది తల్లి.

తల్లికి బిడ్డే లోకం
దాదాపు చావు అంచుల వరకు వెళ్లి బిడ్డను కన్న తల్లి ఆ మరుక్షణంలోనే బిడ్డ నవ్వు చూసి అన్నీ మర్చిపోతుంది. తన బిడ్డ నవ్వితే ఆనందం ఏడిస్తే విచారం. బిడ్డకు ఒక వయసు వచ్చే వరకూ తల్లికి బిడ్డే ప్రపంచం. తన కెరీర్ కాదు తన ఆరోగ్యాన్ని, ఆనందాన్ని బిడ్డ కోసం త్యాగం చేసే గొప్ప గుణం తల్లికి తప్ప ఈ సృష్టిలో మరో ప్రాణికి ఉండదు.

అమ్మకు థాంక్స్ చెప్పొద్దు
మనకు సహాయం చేసిన వారికి మనం ఒక థాంక్స్ చెప్పేసి చేతులు దులుపుకుంటాం. మహా అయితే వారికి అవసరంలో అన్ని రకాలుగా ఆదుకుంటాం. కానీ అమ్మకు థాంక్స్ చెప్పారా ఎప్పుడైనా? అమ్మకు ఎప్పుడు థాంక్స్ చెప్పకూడదు. ఒక థాంక్స్​తో అమ్మ ఋణం తీరిపోదు. అమ్మకు థాంక్స్ చెబితే అమ్మ విలువను మనం తగ్గించినట్లే. అమ్మ మనది. మనలో భాగమే. మనకు మనం ఎప్పుడూ థాంక్స్ చెప్పుకోము కదా. అమ్మ కూడా అంతే.

మదర్స్​డే ఎందుకు జరుపుకుంటారో తెలుసా!

గ్రీస్‌లో ‘రియా’ అనే దేవతను ‘మదర్‌ ఆఫ్‌ గాడ్స్‌’గా భావించి ఏడాదికోసారి నివాళి అర్పించేవారు.
17వ శతాబ్దంలో ఇంగ్లాండ్‌లో తల్లులకు గౌరవంగా ‘మదరింగ్‌ సండే’ పేరిట ఉత్సవాన్ని జరిపేవారు.
1872లో జూలియవర్డ్‌ హోవే అనే మహిళ అమెరికాలో తొలిసారిగా ప్రపంచ శాంతికోసం మదర్స్‌డే నిర్వహించాలని ప్రతిపాదించింది. అన్న మేరీ జర్విస్‌ అనే మహిళ ‘మదర్స్‌ ఫ్రెండ్‌షిప్‌ డే’ జరిపించేందుకు ఎంతో కృషిచేసింది.
మేరీ జర్విస్‌ మే 9వ తేదీ రెండవ ఆదివారం నాడు మరణించింది. ఆమె మరణానంతరం ఆమె కుమార్తె తన తల్లి జ్ఞాపకార్ధం మిస్‌ జెర్విస్‌ మాతృదినోత్సవం కోసం విస్తృతంగా ప్రచారం చేసింది.
1911 నుంచి అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో మాతృ దినోత్సవం జరపడం మొదలైంది.
1914 లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్‌ ప్రతిఏటా మే రెండో ఆదివారం రోజు మాతృదినోత్సవం అధికారికంగా జరపాలని నిర్ణయించారు.
కాలక్రమేణా ఇది ప్రపంచమంతా వ్యాపించింది.
మరి అమ్మకు ఒక్క రోజు సరిపోతుందా!
కచ్చితంగా లేదు. ఏదో మొక్కుబడిగా ఒక్కరోజు మాతృ దినోత్సవం పేరిట అమ్మకు గ్రీటింగ్ కార్డులు, కేకులు, పూలు కానుకలు ఇచ్చేస్తే సరిపోదు. మన జీవితంలోని ప్రతి క్షణం అమ్మకు అంకితం చేసినా కూడా సరిపోదు.

అమ్మకు వందనం ఇలా చేద్దాం
ఒక తల్లిగా, గురువుగా, మార్గదర్శిగా, చివరకు ఒక పెద్ద దిక్కుగా మన జీవితంలో అన్ని దశల్లో మనకు అండగా ఉండే అమ్మను దేవతలా పూజించవద్దు. ఎందుకంటే దేవత ప్రత్యక్షం కాదు కానీ అమ్మ ప్రత్యక్ష దైవం. అమ్మను మన మనసులో నిలుపుకుందాం. మన జీవితంలో, మన దినచర్యలో ఒక భాగంగా చేసుకుందాం. అమ్మ మనింట్లో ఉంటే మా అమ్మను నేను చూసుకుంటున్నాను అని పొరపాటున కూడా అనవద్దు. నా అదృష్టం మా అమ్మ దగ్గర నేను ఉన్నాను అని చెప్పడమే అమ్మ పట్ల మనం చూపించే నిజమైన కృతజ్ఞత.

అమ్మ బాధ్యత, కాదు బంధం
వృద్ధాప్యంలో ఉన్న అమ్మను బాధ్యత అనుకోవద్దు. ఒక పసిబిడ్డలా చూసుకొని ఆమె చరమాంకంలో హాయిగా గడిపేలా చేయాలి. అదే తల్లీబిడ్డల బంధానికి ఉన్న విలువ. మనం ఎన్ని సేవలు చేసినా ఎన్ని కానుకలు ఇచ్చిన తీరని ఋణం అమ్మది. లోకంలో తల్లి ప్రేమ లేక అలమటిస్తున్న ఆనాధలు ఎందరో ఉన్నారు. స్తోమత, సౌకర్యం ఉన్నవారు, పిల్లలు లేని వారు అలాంటి అనాధలకు తల్లి ప్రేమను అందించగలిగితే కన్నతల్లి ఋణం కొంతయినా తీరుతుంది. తల్లి ప్రేమ దైవత్వం. ఆ దైవత్వమును అందరికి పంచగలిగితే అది అమరత్వం అవుతుంది. అదే మన తల్లికి చేసే నిజమైన వందనం.