వజ్రం..ఈ మాట వినగానే దాదాపు అందరికీ కోహినూర్ వజ్రం గుర్తుకు వస్తుంది. ఎందుకంటే ప్రపంచంలో అత్యంత ఖరీదైన వజ్రాలలో ఒకటైన కోహినూర్ వజ్రం మన తెలుగు రాష్ట్రంలోనే పుట్టిందని చరిత్ర చెబుతోంది.
అయితే, ఈ వజ్రాలు భూమిలోపల కొన్ని ఏళ్ల తరబడి చోటు చేసుకున్న రసాయానిక చర్య ఫలితంగా వజ్రం ఏర్పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. వజ్రాన్ని కార్బన్ ఘన మూలకంగా చెబుతారు.. అందులోని పరమాణువులు స్ఫటికాల ఆకారంలో ఏర్పడి కనిపిస్తాయి. . దీంతో వజ్రం గట్టిగా ఏర్పడుతుంది. అంతేగానీ, బొగ్గును ఎక్కువ కాలం నిల్వ ఉంచితే అది వజ్రంగా మారుతుందనే నమ్మకం వాస్తం కాదని నిపుణులు చెబుతున్నారు. వజ్రాలు, బొగ్గు రెండూ కార్బన్‌తో తయారవుతాయి.. కాబట్టి కాలక్రమేణా బొగ్గు వజ్రంగా మారుతుందని ప్రజలు నమ్ముతారు. అయితే, ఈ నమ్మకం పూర్తిగా తప్పు.
వజ్రాలు తీవ్ర పీడనం, అధిక ఉష్ణోగ్రతల కింద లోతులో ఏర్పడతాయి. ఉపరితలం కంటే పీడనం దాదాపు 50,000 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రత 1600 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. వజ్రం ఏర్పడటం చాలా నెమ్మదిగా జరిగే ప్రక్రియ. ఇది ఏర్పడటానికి దాదాపు 1 నుండి 3.3 బిలియన్ సంవత్సరాలు పడుతుంది. అందుకే ఇది భూమిపై అరుదుగా, ప్రత్యేకంగా ఉంటుంది. ఇక వజ్రాలు బొగ్గు నుంచి ఏర్పడతాయా..? అంటే.. బొగ్గులో స్వచ్ఛమైన కార్బన్ ఉండదు. ఇందులో హైడ్రోజన్, నైట్రోజన్, సల్ఫర్ ఉంటాయి. అందుకే బొగ్గు వజ్రంగా మారడానికి తగినది కాదు.
వజ్రంలో, కార్బన్ అణువులు దట్టమైన నెట్‌వర్క్‌ను ఏర్పరుస్తాయి. ప్రతి కార్బన్ నాలుగు ఇతర కార్బన్‌లతో అనుసంధానించబడి ఉంటుంది. బొగ్గులో కార్బన్ బంధం వదులుగా, అవ్యవస్థీకృతంగా ఉంటుంది. వజ్రం పారదర్శకంగా, మెరుస్తూ ఉంటుంది.. ఎందుకంటే కాంతి దాని గుండా వెళ్ళగలదు. బొగ్గు, గ్రాఫైట్ చీకటిగా ఉంటాయి. కాంతిని వాటి గుండా వెళ్ళనివ్వవు. కేవలం బొగ్గును ఉంచడం ద్వారా వజ్రాలు ఏర్పడవు. దీనికి తీవ్ర పీడనం, ఉష్ణోగ్రత అవసరం. బొగ్గులో ఉండే మూలకాలు దీనిని అసాధ్యం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
































