చలికాలమండీ.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

శీతాకాలం.. వేసవి, వర్షకాలాల కంటే కాస్త భిన్నం. ఈ కాలంలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోయి వాతావరణం చల్లబడుతుంది. దీంతో జలుబు, దగ్గు, చర్మం పొడిబారడం, కీళ్ల నొప్పులు వంటి అనేక సమస్యలు వస్తాయి. వీటి బారి నుంచి తప్పించుకోవాలంటే శీతాకాలమంతా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటంటే..


శీతాకాలంలో శరీరం వెచ్చగా ఉండాలంటే మందమైన దుస్తులు ధరించాలి. కాటన్‌ దుస్తుల్ని కాకుండా ఉన్ని, సింథటిక్‌ ఫ్యాబ్రిక్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. బయటకు వెళ్లినప్పుడు టోపీ, కాళ్లకు సాక్స్‌, చేతులకు గ్లౌవ్స్‌ ధరిస్తే మంచిది. దుస్తులు కొంచెం తడిగా ఉన్నా వేసుకోవద్దు. అవి చలిని మరింత పెంచుతాయి. రాత్రిళ్లు మందమైన దుప్పట్లు, రగ్గులను కప్పుకొంటే వెచ్చగా ఉండి, హాయిగా నిద్ర పడుతుంది.

ఈ కాలంలో శరీర ఉష్ణోగ్రత కూడా తగ్గిపోతుంది. కాబట్టి పౌష్టికాహారాన్ని అప్పటికప్పుడు వండుకొని వేడివేడిగా తినాలి. ఈ కాలంలో రోగనిరోధక శక్తి చాలా తగ్గుతుంది. దీంతో అనారోగ్య సమస్యలొస్తాయి. అందుకే రోగనిరోధక శక్తిని పెంచుకోవడం కోసం విటమిస్‌ సి లభించే ఆరెంజ్‌, దానిమ్మ, జామ వంటి సీజనల్‌ పండ్లను కచ్చితంగా తినాలి. శారీరక శక్తి కోసం గోధుమలు, మిల్లెట్లతో చేసిన ఆహారం తినాలి.

వాతావరణంలో మార్పు వల్ల జలుబు, దగ్గు, చిన్నపాటి ఆరోగ్య సమస్యలొస్తాయి. అందుకే, బయటకు వెళ్లినప్పుడు మాస్కులు ధరించాలి. సూర్యరశ్మిలో వాకింగ్‌ చేయడం వల్ల వ్యాయామం అవుతుంది. విటమిన్‌ డి లభిస్తుంది. అదికాకుండా ఇంట్లోనే యోగా, ప్రాణాయామం, తేలికపాటి వ్యాయామాలు చేసి శరీరాన్ని చురుకుగా ఉంచుకోవాలి. పిల్లలు, పెద్దలు వీలైనంతవరకు బయటకు వెళ్లకుండా చూసుకోవాలి.

చలికాలంలో చర్మం పొడిబారుతుంది. దీన్ని నివారించాలంటే ప్రతిరోజూ గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఆ తర్వాత బాడీకి మాయిశ్చరైజర్‌/నూనె రాసుకోవాలి. ఈ కాలంలో దాహం తక్కువగా ఉంటుంది. అయినా.. చర్మం తాజాగా ఉండటం కోసం తప్పనిసరిగా తగినన్ని నీళ్లు తాగాలి. వారానికి రెండు సార్లయినా కొబ్బరి నూనెతో మసాజ్‌ చేయించుకుంటే జుట్టు పొడిబారకుండా ఉంటుంది.

వెచ్చదనం కోసం ఇంట్లో హీటర్స్‌ వాడుతుంటారు. మంచిదే, ఇల్లు తొందరగా వెచ్చగా మారుతుంది. కానీ, వాటిని ఇతర వస్తువులకు దూరంగా పెట్టాలి. లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశముంది. ఇంటి తలుపులు, కిటికీలు రోజంతా మూసేస్తే తేమతోపాటు బ్యాక్టీరియా పెరుగుతుంది. అందుకే, అప్పుడప్పుడు గాలి వచ్చేలా కిటికీలు తెరవాలి. గోడలు, నేల తడిగా ఉంటే ఫంగస్‌ పెరిగే అవకాశముంది. అవి ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోవాలి.

  • అల్లం టీ, తులసీ టీ, మిరియాల సూప్‌ వంటివి దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
  • పాదాల పగుళ్లు తగ్గాలంటే అరటిపండు గుజ్జును అప్లై చేసి.. పావుగంట తర్వాత కడగాలి
  • కాళ్ల వాపులుంటే నువ్వుల నూనెతో మర్దన చేసుకుంటే ఫలితం ఉంటుంది.
  • పెదాలు పొడిబారకుండా ఉండాలంటే వాటిపై కొబ్బరి నూనె/తేనె/పాలమీగడ రాసుకోవాలి
  • చుండ్రు పోవాలంటే జుట్టును వేపనూనెతో మర్దన చేయాలి. ఇందులో యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఫంగల్‌ లక్షణాలు ఉంటాయి.
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.