జనసేనకు( janasena ) షాక్ ఇచ్చింది టిడిపి. రాష్ట్రంలో సింహభాగం రాజకీయ ప్రయోజనాలు కోరుకుంటోంది జనసేన. ఇటీవల నామినేటెడ్ పోస్టుల భర్తీలో జనసేనకు అన్యాయం జరిగిందంటూ మాజీ ఎమ్మెల్యే, జనసేన కొవ్వూరు ఇన్చార్జి టీవీ రామారావు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే.
అయితే పార్టీ క్రమశిక్షణను కట్టు దాటినట్టు భావించిన జనసేన నాయకత్వం ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ తరుణంలో మిగతా నామినేటెడ్ పదవుల్లో జనసేనకు అత్యంత ప్రాధాన్యం ఇస్తారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా రాష్ట్రవ్యాప్తంగా 66 వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులను భర్తీ చేశారు. కానీ అందులో జనసేనకు సరైన ప్రాధాన్యత దక్కలేదు. దీంతో జనసైనికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇదే పొత్తు ధర్మం అంటూ ఎక్కువ మంది వ్యాఖ్యానిస్తున్నారు.
పవన్ ప్రధాన భూమిక..
మొన్నటి ఎన్నికల్లో కూటమి( Alliance ) కట్టడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్. బిజెపిని పొత్తురూట్లోకి తెచ్చింది కూడా ఆయనే. సీట్ల సర్దుబాటు దగ్గర వెనక్కి తగ్గింది కూడా ఆయనే. అధికారంలోకి వచ్చిన తర్వాత పవర్ షేరింగ్ లో కూడా వెనక్కి తగ్గింది కూడా ఆయనే. అటు తర్వాత ఎమ్మెల్సీ తో పాటు రాజ్యసభ పదవుల ఎంపిక సమయంలో సైతం చాలా విధాలుగా సర్దుబాటు ధోరణితోనే ముందుకు వెళ్లారు. అయితే ఇది జనసైనికులకు మింగుడు పడటం లేదు. మరోవైపు నామినేటెడ్ పదవుల్లో సైతం కిందిస్థాయి పార్టీ శ్రేణులకు అన్యాయం జరుగుతోంది. దీంతో వారంతా ఆవేదనతో ఉన్నారు.
జనసేనకు 9 ఏఎంసీలే
తాజాగా రాష్ట్రవ్యాప్తంగా 66 మార్కెట్ కమిటీలకు( market committees ) కార్యవర్గాలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఇందులో కేవలం 9 ఏఎంసీలను మాత్రమే జనసేనకు కేటాయించింది. నాలుగు ఏఎంసీలను బిజెపికి కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే నామినేటెడ్ పదవుల విషయంలో పదుల సంఖ్యలో టిడిపి తీసుకుని.. ఏకసంఖ్యలో జనసేనకు ఇవ్వడం ఏమిటనేది ఒక ప్రశ్న. ఆది నుంచి రాజీ ఫార్ములా తో ముందుకు వెళ్తుంటే ఇలా చేయడం ఏమిటనేది ప్రధాన ప్రశ్న. ఏమైనా ప్రశ్నిస్తుంటే జనసేన నాయకత్వం నాయకులు పై వేటు వేస్తోంది. క్షేత్రస్థాయిలో జన సైనికులకు నామినేటెడ్ పదవులతో పాటు ఆశించిన స్థాయిలో గౌరవం లభించడం లేదు. దీంతో జనసేన శ్రేణులు తీవ్ర నైరాశ్యంతో ఉన్నాయి. ఇలా అయితే పార్టీ మనుగడ కష్టమని భావిస్తున్నాయి.
పార్టీ విస్తరణ ఎలా?
వాస్తవానికి ప్రతి నియోజకవర్గంలో జనసేన ను విస్తరించాలని పవన్ కళ్యాణ్( Pawan Kalyan) ప్లాన్. కానీ ఆ స్థాయిలో ఏర్పాట్లు జరగడం లేదు. కనీస కార్యాచరణ లేదు. ఏదైనా పార్టీ బలపడాలంటే క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు, నేతలకు నామినేటెడ్ పదవులు ఉండాలి. కానీ ఇప్పుడు ఆ పదవులు లేకుండా పోతున్నాయి. జనసేన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం టిడిపి శ్రేణులకు నామినేటెడ్ పదవులు ఇస్తున్నారు. ఇది జనసేన శ్రేణుల్లో తీవ్ర ఆందోళనకు గురిచేసే అంశం.
































