వామ్మో.. మరి కొన్ని గంటల్లో మరో అల్పపీడనం.. ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు..

www.mannamweb.com


తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. లక్షలాది మందిని నిరాశ్రయులుగా నిలబెట్టాయి. రైతులను కోలుకోలేని దెబ్బకొట్టాయి. ఏపీ, తెలంగాణలో జల విధ్వంసానికి వేలాది కుటుంబాలు రోడ్డునపడ్డాయి.

రెండు రాష్ట్రాల్లోనూ వేల కోట్ల నష్టం వాటిల్లింది. వరద ప్రళయానికి విజయవాడలో ఎటుచూసినా కన్నీరే.. ఆకలి కేకలు వినిపిస్తున్నాయి.. ప్రభుత్వం సహాయక చర్యలను వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ పిడుగులాంటి వార్తను చెప్పింది.. వాయువ్య బంగాళాఖాతంలో రేపటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.. దీని ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఐఎండి సూచనల ప్రకారం ఆవర్తన ప్రభావంతో పశ్చిమమధ్య, ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో రేపటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

దీని ప్రభావంతో రేపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.

అలాగే కోనసీమ,తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.

పెరుగుతున్న గోదావరి నది ప్రవాహం: మరోవైపు గోదావరి నది వరద ప్రవాహం పెరుగుతుందని బుధవారం రాత్రి 8 గంటల నాటికి భద్రాచలం వద్ద 44.4 అడుగుల నీటిమట్టం ఉందని, ధవళేశ్వరం వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 7,00,706 లక్షల క్యూసెక్కులు ఉందని కూర్మానాథ్ తెలిపారు. రేపు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందన్నారు.

కృష్ణానది వరద ప్రవాహం క్రమంగా తగ్గుతుందని ప్రకాశం బ్యారేజి వద్ద 8 గంటల నాటికి 3.08 లక్షల క్యూసెక్కులు ఉందన్నారు. కృష్ణా, గోదావరి నదీ పరివాహాక ప్రజలు, లంక గ్రామ వాసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. నది, వాగులు దాటే ప్రయత్నం చేయరాదని సూచించారు.