వామ్మో.. సునామీ చుట్టుముట్టింది

 రష్యాలో భారీ భూకంపం సంభవించింది. అంచనాలకు అందని విధంగా భూమి ప్రకోపించింది. ఆ దేశాన్ని వణికించింది. అత్యంత శక్తిమంతమైన భూకంపం ఇది.


దీని ప్రభావం జపాన్ పైనా పడిందంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

పసిఫిక్ దేశాలకు సునామీ హెచ్చరికలు..

భూకంప తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సునామీ హెచ్చరికలను జారీ చేశారు. రష్యా, జపాన్ దేశాలకు సునామీ ముప్పు పొంచివుంది. అమెరికా, ఇతర పసిఫిక్ దేశాలకూ సునామీ హెచ్చరికలు ఇచ్చారు. ముందు జాగ్రత్త చర్యగా తీర ప్రాంతాలన్నింటినీ కూడా స్థానిక అధికారులు ఖాళీ చేయించారు. ప్రాణనష్టాన్ని తగ్గించడానికి చేయాల్సిందంతా చేస్తోన్నారు.

8.7 తీవ్రతతో..

రష్యాలోని కమ్‌చట్‌కా ద్వీపకల్పం సమీపంలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 8.7గా నమోదైంది. దీని కారణంగా సునామీ అలలు నాలుగు మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడ్డాయి. దీని ప్రభావంతో పలు భవనాలు దెబ్బతిన్నాయి. అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అమెరికా, జపాన్, మరికొన్ని పసిఫిక్ దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

జపాన్‌కు ఈశాన్యం, అలాస్కాకు పశ్చిమ దిశగా..

పెట్రోపావ్లోవ్స్క్-కమ్‌ చట్‌స్కీ.. రష్యా సరిహద్దుల్లో ఉంటుంది. జపాన్‌కు ఈశాన్యం, అలాస్కాకు పశ్చిమం దిశగా ఉంటుందీ తీర ప్రాంతం. పసిఫిక్ మహా సముద్ర తీర ఉందిక్కడ. కమ్‌ చట్ స్కీ ఓ ద్వీపకల్పం. పసిఫిక్, నార్త్ అమెరికా టెక్టోనిక్ ప్లేట్‌ల పరిధిలో ఉండటం వల్ల తరచూ భూకంపాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంది.

ఈ విపత్తు వల్ల..

యునైటెడ్ స్టేట్స్ సునామీ వార్నింగ్ సిస్టమ్ ప్రమాదకరమైన సునామీ అలలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. రష్యా తూర్పు ప్రాంతంలోని కమ్‌చట్‌కా ద్వీపకల్పంలో బుధవారం సంభవించిన ఈ భూకంపం కారణంగా సునామీ వచ్చే ప్రమాదం అధికారులు తెలిపారు. ఈ విపత్తు కారణంగా ప్రజలను ఖాళీ చేయించాల్సి వచ్చింది. కొన్ని భవనాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.

భూకంప కేంద్రం..

అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం- భూకంపం 19.3 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉంది. ఇది అవచా బేలోని పెట్రోపావ్లోవ్స్క్-కమ్‌చట్‌స్కీకి తూర్పు ఆగ్నేయంగా 125 కిలోమీటర్ల దూరంలో గల ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు. ఈ తీర ప్రాంత నగరంలో సుమారు 1,65,000 మంది నివసిస్తున్నారు.

4 మీటర్ల ఎత్తు వరకు సునామీ అలలు..

తొలుత భూకంప తీవ్రత 8.0గా అంచనా వేసినప్పటికీ, తరువాత దానిని 8.7గా సవరించారు. భూకంపం తరువాత, కమ్‌చట్‌కా ప్రాంతంలో 3 నుండి 4 మీటర్ల ఎత్తు వరకు సునామీ అలలు నమోదయ్యాయని రష్యా ప్రాంతీయ అత్యవసర పరిస్థితుల మంత్రి లెబెదెవ్ తెలిపారు. తీర ప్రాంతాలను ఖాళీ చేయాలని, నీటి ప్రవాహ ప్రాంతాల నుంచి దూరంగా ఉండాలని సూచించారు.

మూడు గంటల్లో..

వచ్చే మూడు గంటల్లో ప్రమాదకరమైన సునామీ అలలు వచ్చే అవకాశం ఉందని అమెరికా సునామీ హెచ్చరికల వ్యవస్థ హెచ్చరించింది. వాయువ్య హవాయి దీవులు, రష్యా తీర ప్రాంతాల్లో అలల ఎత్తు మూడు మీటర్ల కంటే ఎక్కువగా ఉండవచ్చనని అంచనా వేసింది. పలుచోట్ల సముద్రం ముందుకు చొచ్చుకు రావొచ్చని పేర్కొంది.

ఫిలిప్పీన్స్ కూ..

చుక్, కోస్రే, మార్షల్ ఐలాండ్స్, పలావు, ఫిలిప్పీన్స్ ప్రాంతాలలో అలల ఎత్తు ఒక మీటరు వరకు ఉండవచ్చని అమెరికా జియోలాజికల్ సర్వే అంచనా వేసింది. దక్షిణ కొరియా, ఉత్తర కొరియా, తైవాన్ తీరాలలో 0.3 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో అలలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.

ఆరా తీసిన జపాన్ ప్రధాని..

మీటరు ఎత్తు వరకు సునామీ అలలు జపాన్ తీర ప్రాంతాలను తాకే అవకాశం ఉందని ఆ దేశ వాతావరణ సంస్థ హెచ్చరించింది. ప్రధానమంత్రి షిగేరు ఇషిబా భూకంపం పరిస్థితుల గురించి ఆరా తీశారు. వెంటనే ప్రభుత్వం అత్యవసర కమిటీని ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించింది.

అదే స్థాయిలో ప్రకంపనలు..

8.7 తీవ్రతతో సంభవించిన భూకంపం తరువాత.. పెట్రోపావ్లోవ్స్క్-కమ్‌చాట్‌స్కీకి ఆగ్నేయంగా 147 కిలోమీటర్ల దూరంలో 6.9 తీవ్రతతో ప్రకంపనలు సంభవించాయి. ఈ ప్రకంపనలు 10 కిలోమీటర్ల లోతులో సంభవించాయి. ప్రాథమిక నివేదికల ప్రకారం భూకంపం వల్ల ఎటువంటి గాయాలు సంభవించలేదని రష్యా ప్రాంతీయ గవర్నర్ తెలిపారు. ప్రభావిత ప్రాంతంలో ఒక కిండర్ గార్టెన్ దెబ్బతింది.

ఎప్పుడూ చూడలేదు..

ఈ భూకంపం చాలా తీవ్రమైనదని, దశాబ్దాల కాలంలో ఇంత తీవ్రమైన ప్రకంపనలు ఎప్పుడూ చూడలేదని కమ్‌చట్‌కా గవర్నర్ వ్లాదిమిర్ సోలోడోవ్ టెలిగ్రామ్ ద్వారా తెలిపారు. భూకంపం, సునామీ హెచ్చరికల నేపథ్యంలో.. సఖాలిన్ ప్రాంతంలోని సెవెరో-కురిల్స్క్ పట్టణం నుండి ప్రజలను తరలించే కార్యక్రమం కొనసాగుతోంది. అధికారులు ప్రజల భద్రత కోసం చర్యలు తీసుకుంటున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.