బైబిల్…
”కష్టసాధ్యమైన కార్యాన్ని ఎంచుకున్నాను. కానీ ‘నన్ను బలపరిచే క్రీస్తుద్వారా నేను సమస్తమును చేయగలను’ అనే బైబిల్‌లోని వాక్యం నన్ను ముందుకు నడిపించింది” అంటున్నారు బయ్య శాంతకుమారి.
విశ్రాంత ఉపాధ్యాయిని అయిన ఆమె బైబిల్‌ను మూడు భాషల్లో… 8,843 పేజీలను చేతితో రాశారు.
ఆ విశేషాలు 73 ఏళ్ల శాంతకుమారి మాటల్లోనే.
”బైబిల్‌ను పవిత్ర దినాల్లో చేతితో రాయడం కొత్త విషయం కాదు. సాధారణంగా ఏదైనా చెడు వ్యసనాన్ని దూరం చేసుకోవడానికి, ఏదైనా కోరుకున్న పనిని సాధించుకోవడానికి అలా చేస్తూ ఉంటారు. అయితే అలా రాసే వాటిలో పూర్తయ్యేవి చాలా తక్కువ. అలాంటి మూడు భాషల్లో బైబిల్‌ను చేత్తో రాయగలిగానంటే… అదంతా దేవుని సంకల్పమేనని భావిస్తున్నాను. నేను చదువుకుంటున్న రోజుల్లో చక్కటి చేతిరాతకు చాలా ప్రాధాన్యత ఉండేది. రాజమండ్రిలోని షాడే గర్ల్స్ హైస్కూల్‌లో చదువుతున్నప్పుడు… కృప, రుడా, రామకృష్ణ టీచర్లు నాకు అందమైన చేతిరాతను నేర్పారు. అందులో బహుమతులు కూడా తీసుకున్నాను. ఇంటర్మీడియెట్ చదివేటప్పుడు… పాఠ్య పుస్తకాలకు కొరతగా ఉండేది. అప్పుడు సెకెండియర్ ఫిజిక్స్ పాఠ్య పుస్తకం మొత్తం చేత్తో రాసుకున్నాను. దాన్ని చూసి లెక్చరర్లు ఆశ్చర్యపోయారు. తోటి విద్యార్థులతో చప్పట్లు కొట్టించి నన్ను అభినందించారు.
సమయం సద్వినియోగం చేస్తూ…
ఎంఏ పూర్తి చేసిన తరువాత… 1983లో కొత్తపేట సమితిలోని కొమరాజు లంక ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాను. వాడవాడలా తిరిగి పిల్లలను బడిలో చేర్పించేదాన్ని. నా నిబద్ధతను గుర్తించిన అధికారులు… బొమ్మూరులోని ఎర్రకొండ ప్రాంతంలో పాఠశాల ఏర్పాటు చేసి, దాని బాధ్యతలు నాకు అప్పగించారు. 2006లో రాష్ట్ర స్థాయిలో, 2008లో జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయురాలిగా పురస్కారాలు అందుకున్నాను. 2010లో పదవీవిరమణ చేశాను. ఖాళీగా గడపడం నాకు ఇష్టం ఉండదు. పొద్దున్నే అయిదు గంటలకు లేస్తాను. ఇంట్లో పనులన్నీ నేనే చేస్తాను. తీరిక దొరికితే న్యూస్ పేపర్లు, మ్యాగజైన్లు చదువుతాను. వాటిలో వచ్చే ఆరోగ్య చిట్కాలు, వంటలు, స్ఫూర్తిదాయక కథనాలను కట్ చేసి… పుస్తకాలుగా రూపొందిస్తాను. వాటిని ఆసక్తి కలిగినవారికి, విద్యార్థులకు ఇస్తూ ఉంటాను. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే… ఖాళీ సమయాన్ని కూడా ఉత్తమంగా వినియోగించుకోవడం అని నా అభిప్రాయం. నా భర్త జోసెఫ్ రాజు (జోషి) పేపర్ మిల్లులో కార్మిక నాయకుడిగా ఎన్నో విజయాలు సాధించారు. ఇప్పటికీ కార్మికులు ఆయనకు కష్టసుఖాలు చెప్పుకుంటారు. మా అబ్బాయి రిషి… అమెరికాలో సాఫ్ట్‌వేర్ రంగంలో పని చేస్తున్నాడు. మా అమ్మాయి ఎంఏ పూర్తిచేసి, మా దంపతులకు చేదోడుగా ఉంటోంది.
ఆ బాధ దైవానికే చెప్పుకున్నాను…
బైబిల్‌ను చేత్తో రాయాలన్న ఆలోచన ఎలా వచ్చిందంటే… నా తమ్ముడు సుధీర్‌కుమార్ ఏదో కార్యం నిమిత్తం తెలుగులో బైబిల్‌ను రాస్తూ ఉంటే చూశాను. అది నన్ను ఎంతో ఆకర్షించింది. నేను కూడా రాయాలనే ఆలోచనతో… ముందు తెలుగులో మొదలుపెట్టి పూర్తి చేశాను. తరువాత ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఉన్న బైబిల్ గ్రంథాలను చూసి, చేత్తో రాశాను. దీనికి సరైన పెన్నులు ఉండడం చాలా ముఖ్యం. లేకపోతే రాత సరిగ్గా సాగదు. నాకు లావుగా రాసే పెన్నులు ఇష్టం. దానికోసం మా అమ్మాయి ఎన్నో దుకాణాలు తిరిగినా ప్రయోజనం లేకపోయింది. అయితే మా అబ్బాయి అమెరికా నుంచి పంపిన పెన్నుల్లో ఒకటి సరిపడింది. ఆ తరువాత తను అక్కడినుంచే పెన్నులు పంపేవాడు. నాకు తెలుసు… నేను చాలా పెద్ద పని తలపెట్టానని. దాన్ని ఎంతో నిష్టగా కొనసాగించాను. పండగలు వచ్చినా, వేడుకలు జరిగినా, ఆరోగ్యం బాగోలేకపోయినా, ఆఖరికి బంధువులతో మా ఇల్లు నిండిపోయినా… ఈ యజ్ఞాన్ని ఎన్నడూ ఆపలేదు. అయితే హిందీలో బైబిల్ రాస్తున్న సమయంలో… నా మోకాళ్ళ సమస్య తీవ్రమయింది. ‘ఇక రాయలేకపోతానేమో?’ అని భయపడ్డాను. నా బాధను ఆ దైవానికే చెప్పుకున్నాను. ఆయన కృపతో… మూడు భాషల్లో చేతిరాతతో బైబిల్ లేఖనం పూర్తి చేశాను. దీనితో నా జీవితం ధన్యమయిందని అనుకుంటున్నాను.”
రమేశ్ నాగేంద్ర పలస, రాజమండ్రి
బైబిల్ లాంటి పవిత్ర గ్రంథాలను చేతితో రాయడం మాటల్లో చెప్పినంత సులభం కాదు. అక్షరం పొల్లు పోకుండా, ఎక్కడా తప్ప రాకుండా చూసుకోవాలి. మూడు భాషల్లో చిన్న పొరపాటు కూడా రాకుండా రాయగలిగానంటే… అందులో నా గొప్పతనం ఏమీ లేదు. ఆ ప్రభువే నాతో ఈ పని చేయించుకున్నాడు. తెలుగు బైబిల్‌ను 2016 అక్టోబర్ 17 నుంచి 2018 అక్టోబర్ 17 వరకూ, ఇంగ్లీషు బైబిల్‌ను 2019 ఫిబ్రవరి 16 నుంచి 2020 నవంబర్ 3 వరకూ, హిందీలో 2023 ఏప్రిల్ 23 నుంచి 2024 జూలై 28 వరకూ రాశాను. తెలుగులో 2,414, ఇంగ్లీషులో 3,435, హిందీలో 2,994 పేజీలు రాశాను. పాత నిబంధన గ్రంథంలోని 39, కొత్త నిబంధన గ్రంంథంలోని 27 అధ్యాయాలను… మూడు భాషల్లో 8.,843 పేజీల్లో పూర్తి చేశాను. రోజూ ఇంటి బాధ్యతలు ముగించి, మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటలవరకూ ఏకధాటిగా రాసేదాన్ని.
































