యనమల టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారా? అందుకు ఇది సంకేతమేనా?

www.mannamweb.com


సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తెలుగుదేశం పార్టీలో కంఫర్ట్ గా లేరని అర్థమవుతుంది. ఆయన అవసరమైతే పార్టీని వీడేందుకు కూడా సిద్ధమయినట్లే కనిపిస్తుంది.

అందుకే యనమల నేరుగా పార్టీని, ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెడుతూ లేఖ రాశారని తెలుగుదేశం పార్టీ వర్గాలే అభిప్రాయపడుతున్నాయి. యనమల చేసిన పనికి ఆయన సొంత జిల్లాకు చెందిన, టీడీపీ నేత రెడ్డి సుబ్రహ్మణ్యం అభ్యంతరం తెలిపారంటే.. అది ఆయనకంటూ చేయలేదన్నది సుస్పష్టం. పార్టీ అధినేత నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతనే రెడ్డి సుబ్రహ్మణ్యం యనమలపై విమర్శలకు దిగారని అనుకోవచ్చు. చంద్రబాబు కూడా యనమల చేసిన పనిని సులువుగా తీసుకోవడం లేదు. దీనిపై సీరియస్ గానే ఆలోచించి త్వరలోనే ఒక నిర్ణయానికి వచ్చే అవకాశముందని తెలిసింది. అలాగే యనమల కూడా అవసరమైతే పార్టీకి రాజీనామా చేసేందుకైనా సిద్ధమని సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.

లోగుట్టు తెలిసిన నేతగా…

యనమల రామకృష్ణుడు సీనియర్ నేత. చంద్రబాబు తో పాటు పార్టీ లోగుట్టు అంతా తెలిసిన నాయకుడిగా యనమలకు పేరుంది. పైగా బీసీ సామాజికవర్గం కావడంతో పాటు ఎన్టీఆర ను ముఖ్యమంత్రి పదవి నుంచి దించినప్పుడు కూడా చంద్రబాబుకు యనమల తన పూర్తి సహకారాన్ని అందించారు. అప్పటి నుంచి అంటే 1995 నుంచి మొన్నటి వరకూ యనమల రామకృష్ణుడు ప్రభ పార్టీలో వెలిగిపోయింది. అధికారంలో ఉంటే మంత్రి, లేకుంటే ఏదో ఒక పదవి ఆయనను వరిస్తూనే ఉంటుంది. అలాంటి యనమలను ఈసారి మాత్రం దూరం పెట్టారు. తొలిసారి యనమల లేని చంద్రబాబు కేబినెట్ ను చూడాల్సి వస్తుంది. బహుశ ఆయన ఊహించి ఉండరు. అప్పటి నుంచి కొంత అసహనంగా, అసంతృప్తితో ఉన్న యనమల తనకు కనీసం రాజ్యసభ స్థానమైనా ఇస్తారని భావించారు. అది కూడా సాధ్యం కాకపోవడంతో ఇక తన కలానికి పదును పెట్టినట్లు కనపడుతుంది.

నేరుగా టార్గెట్ చేస్తూ…

సీనియర్ నేత యనమల రామకృష్ణుడు రాసిన లేఖ తెలుగుదేశం పార్టీ వర్గాల్లోనే కాకుండా ప్రభుత్వ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. యనమల బీసీ కార్డు కూడా ఉపయోగించడం వ్యూహంలో భాగమేనని అంటారు. చంద్రబాబుకు చెందిన సామాజికవర్గానికి చెందిన వారికి కాకినాడ సెజ్ ను కట్టబెట్టారని ఆయన పరోక్షంగా లేఖలో ప్రస్తావించినట్లయింది. కాకినాడ సెజ్ పేరుతొ బీసీల సాగులో వున్న వేలాది ఎకరాల భూములను ప్రభుత్వ లాక్కొని ఒక సామాజికవర్గానికి చెందిన పారిశ్రామిక వేత్తలకు దారాదత్తం చేసిందని యనమల ఆరోపించారు. కేవీ రావు అంటే చంద్రబాబుకు చెందిన కమ్మ సామాజికవర్గమే. అంటే బాబూ సామాజికవర్గాన్నే యనమల నేరుగా ప్రశ్నించి ఫైర్ ఓపెన్ చేశారనే అనుకోవాలి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాకినాడ సెజ్ కోసం భూసేకరణ జరిగింది. కాకినాడ పోర్టును కేవీ రావుకు చంద్రబాబు కట్టబెట్టారంటూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యనించిన తర్వాత యనమల లేఖ రాయడంతో ఏదో జరుగుతుందని అనిపిస్తుంది. యనమల రామకృష్ణుడి లేఖను అంత సులువుగా తీయలేం. పార్టీ నేతలే కాదు చంద్రబాబు కూడా అంత సులువుగా తీసుకోరు. కానీ చంద్రబాబు ఏ ఆపరేషన్ చేసినా చేతికిమట్టి అంటకుండా చేస్తారన్న పేరుంది. అందుకే యనమల విషయంలో త్వరలోనే కఠిన నిర్ణయం ఉండే అవకాశాలున్నాయని అంటున్నారు.

కుటుంబానికి ప్రయారిటీ ఇచ్చినా…

నిజానికి యనమలకు తెలుగుదేశం పార్టీలో మంచి ప్రయారిటీయే ఇచ్చారు. శాసనమండలిలో పార్టీ నేత అవకాశం ఇచ్చారు. అదే సమయంలో మొన్నటి ఎన్నికల్లో తుని అసెంబ్లీ నియోజకవర్గ టిక్కెట్ ను యనమల కుమార్తె దివ్యకు, ఏలూరు ఎంపీ టిక్కెట్ ను యనమల అల్లుడు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ కు ఇచ్చారు. యనమల వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ కు మైదుకూరు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారు. ముగ్గురు మొన్నటి ఎన్నికల్లో విజయంసాధించారు. యనమల ఇప్పటికే ఎమ్మల్సీగా ఉన్నారు. టీడీపీలో ఏ కుటుంబానికి ఇన్ని టిక్కెట్లు ఇవ్వలేదు. అయినా కూడా యనమల కుటుంబంలో ఎవరికీ మంత్రిపదవి దక్కకపోవడంతో ఆయన ఈ రకమైన వ్యాఖ్యలతో బీసీ కార్డును ఉపయోగిస్తూ ప్రభుత్వాన్ని, చంద్రబాబును ఇరుకున పెట్టేవిధంగా లేఖ రాశారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న కాలంలో యనమల రామకృష్ణుడు మరింత ఇబ్బందులు కలగచేస్తారన్న ఆందోళన కూడా తెలుగుదేశం పార్టీలో ఉంది. అయితే దాని నుంచి బయటపడే మార్గాలను కూడా ఇప్పటి నుంచి పార్టీ నాయకత్వం చూస్తున్నట్లు తెలిసింది. మొత్తం మీద టీడీపీలో యనమల లేఖ కలకలం ఇప్పట్లో మాత్రం ఆగేట్లు లేదు.