AP news: శ్రీకాకుళంలో రిటైర్డ్‌ టీచర్‌ స్థలం ఆక్రమించి వైకాపా కార్యాలయం

శ్రీకాకుళంలో వైకాపా నాయకులు ప్రైవేటు స్థలాన్ని కబ్జా చేసి పార్టీ కార్యాలయ భవనాన్ని నిర్మించారు. పెద్దపాడు వద్ద జాతీయ రహదారిని ఆనుకొని ఎకరా యాభై సెంట్ల ప్రభుత్వ భూమిని వైకాపా నాయకులు 33 ఏళ్లకు ఏడాదికి ఎకరాకు రూ.వెయ్యి చొప్పున లీజుకు తీసుకున్నారు.


శ్రీకాకుళంలో వైకాపా నాయకులు ప్రైవేటు స్థలాన్ని కబ్జా చేసి పార్టీ కార్యాలయ భవనాన్ని నిర్మించారు. పెద్దపాడు వద్ద జాతీయ రహదారిని ఆనుకొని ఎకరా యాభై సెంట్ల ప్రభుత్వ భూమిని వైకాపా నాయకులు 33 ఏళ్లకు ఏడాదికి ఎకరాకు రూ.వెయ్యి చొప్పున లీజుకు తీసుకున్నారు. అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే 90 శాతం భవనం పూర్తి చేశారు. ఈ కార్యాలయానికి పక్కనే ఉపాధ్యాయ సంఘానికి చెందిన లే అవుట్లు ఉన్నాయి. ఇందులో 30 సెంట్ల వరకు ఆక్రమించేశారు. ఎకరా యాబై సెంట్లలో నిర్మించాల్సిన భవనాన్ని దాదాపు రెండు ఎకరాల్లో చేపట్టినట్లు తెలుస్తోంది. కోటబొమ్మాళికి చెందిన రిటైర్డు ప్రధానోపాధ్యాయుడు జి.వెంకటరమణ 1993లో ఐదున్నర సెంట్ల భూమిని కొని రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. తన భూమి కబ్జా చేసి షెడ్డు, ప్రహరీ నిర్మించారని బాధితుడు వాపోతున్నారు. గతేడాది అక్టోబరు 6న స్థానిక పోలీసులకు, తహసీల్దారు, సర్వేయర్‌కు ఫిర్యాదు చేయగా, చర్యలు తీసుకోకపోగా ఎవరినడిగి కొన్నావంటూ తనపైనే ఆగ్రహం వ్యక్తం చేశారని ఆయన ఆరోపించారు.