సింగయ్య మృతిపై సంచలన వీడియో రిలీజ్ చేసిన వైసీపీ..కుట్ర జరిగిందా

పీ రాజకీయాలు మొత్తం కూడా వైసీపీ కార్యకర్త సింగయ్య మృతి చూట్టునే తిరుగుతున్నాయి.గత బుధవారం వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా రెంటపాళ్లలో పర్యటించారు.


ఈ పర్యటనలో భాగంగా జగన్ కాన్వాయ్ కింద పడి సింగయ్య అనే వైసీపీ కార్యకర్త మృతి చెందారని అధికార పార్టీకి చెందిన నేతలు ఆరోపించారు. మొదట సింగయ్య కాన్వాయ్‌లోని ఒక వాహనంపైకి ఎక్కబోయి కిందపడి గాయపడ్డారని, ఆ తర్వాత మరణించారని వార్తలు వచ్చాయి. అయితే ఈ ఘటనకు జగన్ కాన్వాయ్‌కు సంబంధం లేదని జిల్లా పోలీసులు ప్రకటించారు. ఓ ప్రైవేట్ వాహనం ఢీ కొట్టడం వల్లే సింగయ్య మరణించారని పోలీసులు ధృవీకరించారు.

అయితే తాజాగా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోల ఆధారంగా, జగన్ ప్రయాణిస్తున్న కారు కింద పడే సింగయ్య మరణించినట్లు స్పష్టంగా తెలుస్తోందని పలు మీడియా సంస్థలు నివేదించాయి. కారు ముందు టైరు సింగయ్య మెడపై నుంచి వెళ్లినట్లు దృశ్యాల్లో ఉందని సమాచారం. ఈ వీడియోలు వెలుగులోకి రావడంతో ఈ కేసులో కీలక మలుపులు చోటు చేసుకున్నాయి.

పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. మొదట సెక్షన్ 304 (ఎ) కింద కేసు నమోదు చేయగా, తాజాగా బయటపడిన వీడియోల ఆధారంగా జగన్ కారు కింద పడే సింగయ్య మృతి చెందినట్లు గుర్తించారని వార్తలు వస్తున్నాయి. ఎఫ్‌ఐఆర్ లో అదనంగా 304 పార్ట్-2 సెక్షన్ చేర్చే అవకాశాలు ఉన్నాయని, జగన్‌ను ఏ2గా చేర్చే అవకాశం కూడా ఉందని కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి.

ఇటువంటి సమయంలోనే సింగయ్యకు సంబంధించిన వీడియోను వైసీపీ సోషల్ మీడియా రిలీజ్ చేసింది. జగన్ కాన్వాయ్‌ ప్రమాదం తర్వాత సింగయ్య క్షేమంగానే ఉన్నారని ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే అంబెలెన్స్ వచ్చిన సమయంలో కూడా సింగయ్య కాలు మీద కాలు వేసుకుని కనిపించారు.సింగయ్య విషయంలో ఏదో తప్పు జరిగింది.. దాన్ని కూటమి ప్రభుత్వం దాస్తున్నట్లు కనిపిస్తోందని వైసీపీ నేతలుఆరోపిస్తున్నారు. జగన్ కారు కింద పడి సింగయ్య మరణించలేదని, ఇది తప్పుడు ప్రచారం అని మాజీ మంత్రి అంబటి రాంబాబు వంటి వైసీపీ నేతలు ఖండించారు. పార్టీ తరఫున సింగయ్య కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందించినట్లు కూడా ఆయన తెలిపారు. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.