ఏలూరులో వైసీపీ ఖాళీ.. మొన్న ఆళ్ల నాని.. ఇప్పుడు మేయ‌ర్

www.mannamweb.com


వైసీపీకి మరో బిగ్ షాక్ తగలబోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం ప్రభావంతో.. ఆ పార్టీకి వరుసగా దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా.. ఏలూరు నగర మేయర్ నూర్జహాన్, ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరేందుకు సిద్దమయ్యారు.

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భారీ విజ‌యాన్ని సొంతం చేసుకున్న టీడీపీ కూట‌మి.. ఇప్పుడు మున్సిప‌ల్‌, కార్పొరేష‌న్ల‌ను కైవ‌సం చేసుకునేందుకు వ్యూహ ర‌చ‌న చేస్తోంది. ఇప్ప‌టికే విశాఖ, విజ‌య‌వాడ‌ కార్పొరేష‌న్ల‌లో వైసీపీ నుంచి టీడీపీ, జ‌న‌సేనలోకి కార్పొరేటర్లు జంప్ అయ్యారు. అలాగే హిందూపురం, మాచ‌ర్లతో పాటు ఇత‌ర మున్సిపాలిటీల్లో వైసీపీ కౌన్సిల‌ర్లు టీడీపీలో చేరుతున్నారు.

ముహుర్తం ఖరారు..

అందులో భాగంగానే ఏలూరు కార్పొరేష‌న్ మేయ‌ర్ షేక్ నూర్జ‌హాన్ టీడీపీకి తీర్థం పుచ్చుకునేందుకు ముహూర్తం ఖరారైంది. సీఎం చంద్రబాబు సమక్షంలో మేయర్ దంపతులు టీడీపీలో చేర‌నున్నారు. మేయర్ దంపతులతోపాటు పలువురు కార్పొరేటర్లు టీడీపీలో చేరనున్నారు. మేయర్, కార్పొరేటర్ల చేరికతో ఏలూరు నగరపాలిక సంస్థ‌పై టీడీపీ పట్టు సాధించనుంది. వైసీపీకి ఏలూరు నగరపాలకసంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ ఇప్పటికే రాజీనామా చేశారు.
ఆళ్ల నాని దూరం..

మాజీమంత్రి ఆళ్ల నాని ఇప్పటికే వైసీపీకి దూరమయ్యారు. పార్టీ స‌భ్య‌త్వానికి, జిల్లా అధ్య‌క్ష ప‌ద‌వికి రాజీనామా చేశారు. పార్టీ ఆఫీసును కూడా ఖాళీ చేయించిన ఆయన.. జనసేన తలుపు తడుతున్నారు. అవి ఎప్పుడు తెరుచుకుంటాయన్నది చూడాలి. మరో వైపు నగర పాలక సంస్థ మేయర్ కూడా వైసీపీ వీడేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.
టీడీపీలోనే ప్రారంభం..

వాస్తవానికి మేయర్ నూర్జహాన్, ఆమె భర్త ఎస్ఎంఆర్‌ పెదబాబుకి ఓ ప్రత్యేకత ఉంది. మేయర్ నూర్జహాన్, పెదబాబుల రాజకీయ జీవితం టీడీపీతోనే మొదలైంది. 2013లో టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ బడేటి బుజ్జి సమక్షంలో వీరు టీడీపీలోకి వచ్చారు. నగర పాలక సంస్థ ఎన్నికల సమయంలో నూర్జహాన్‌ను మేయర్ అభ్యర్థిగా ప్రకటించారు.

మళ్లీ మేయర్ పీఠం కోసమే..

2014లో ఈ ఎన్నికల్లో నూర్జహాన్ విజయం సాధించి మేయర్ పీఠాన్ని దక్కించుకున్నారు. ఐదేళ్ల పాటు మేయర్‌గా పనిచేసిన‌ తరువాత జరిగిన పరిణామాల్లో.. 2019 ఎన్నికల సమయంలో వీరిద్దరూ వైసీపీలోకి వెళ్లారు. దీంతో మరోసారి మేయర్ పదవి వరించింది. తిరిగి ఆ పార్టీలో కూడా మేయర్ పీఠాన్ని నిలబెట్టుకుని.. గడిచిన నాలుగేళ్లుగా ఆస్థానంలో కొనసాగుతున్నారు. అంటే పార్టీలు మారినా.. ఏలూరు మేయర్ పీఠం మాత్రం నూర్జహాన్ చేతుల్లోనే ఉండడం విశేషం. ఇప్పుడు మళ్లీ రాష్ట్రంలో అధికారం మారడంతో.. సొంతగూటికి చేరి మేయర్ పీఠాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నట్టుగా కనిపిస్తోంది.
లోకేష్ నుంచి గ్రీన్ సిగ్నల్..

టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో.. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి నేతృత్వంలో నూర్జహాన్, పెదబాబు సహా పలువురు కార్పొరేటర్లు టీడీపీ కండువా కప్పుకునేందుకు ముహూర్తం సిద్ధం చేసుకున్నారు. వారితో పాటు ఏలూరు నగరానికి చెందిన మరో 39 మంది కీలక నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారు. ఇది వైసీపీకి ఏలూరులో గట్టిదెబ్బ అని చెప్పాలి.