ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్ నియోజకవర్గం పిఠాపురంలో వైసీపీకి షాక్ తగిలింది. వైసీపీకి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు గుడ్‌బై చెప్పారు. రెండు మూడు నెలలుగా పరిస్థితులు మారాయని.. అందుకే వైసీపీకి రాజీనామా చేశానని దొరబాబు వెల్లడించారు. తనకు వెన్నుపోటు రాజకీయాలు తెలియదని స్పష్టం చేశారు. నియోజకవర్గ ప్రజలు, అభివృద్ధి కోసం పిఠాపురంలోనే ఉంటానని తెలిపారు. అనుచరులు, కార్యకర్తలతో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పెండెం దొరబాబు జనసేనలో చేరబోతున్నారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆయన రాజీనామా చేస్తున్నానని ప్రకటించడం ఆసక్తిగా మారింది. దొరబాబుతో పాటు పలువురు నియోజకవర్గ ముఖ్య నేతలు వైసీపీని వీడేందుకు రెడీ అయ్యారు. దొరబాబు 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఇటీవలి ఎన్నికల్లో పిఠాపురం నుంచి జనసేనాని పవన్ కల్యాణ్ బరిలోకి దిగారు. ఈ క్రమంలో పిఠాపురం ఎమ్మెల్యే టికెట్‌ను దొరబాబుకు వైఎస్ జగన్ నిరాకరించారు. పవన్‌పై పోటీగా వంగా గీతను నిలబెట్టారు. కానీ పవన్ కల్యాణ్ చేతిలో వంగా గీత ఘోర పరాజయం పాలయ్యారు. అప్పట్నుంచి వైసీపీపై దొరబాబు నైరాశ్యంలో ఉన్నట్లు తెలుస్తోంది.