“మీ బిడ్డకు స్కూల్‌లో స్థానం లేదు”.. తల్లిదండ్రులకు ఎదురైన అవమానం

 నల్లగొండ పట్టణంలోని ఒక ప్రైవేటు పాఠశాల నిర్వాహణ పద్ధతులపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న విధంగా, తగిన కారణం లేకుండా ఓ విద్యార్థిని స్కూల్‌ నుంచి బయటకు పంపిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.


సమీర్ అనే 9వ తరగతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాల నుంచి మూర్తి అనే ప్రైవేటు పాఠశాలకు వచ్చాడు. మున్ముందు మంచి చదువు కోసం తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో అడ్మిషన్ చేయగా, నెల రోజులు కాకముందే అప్రతిష్ట కలిగే పరిణామాలు ఎదురయ్యాయి. ఉపాధ్యాయులు సమీర్ పట్ల అప్రమత్తంగా వ్యవహరించకుండా, “ఇతను ఈ పాఠశాలకు అనర్హుడు” అనే అభిప్రాయాన్ని ఇతర ఉపాధ్యాయుల అభ్యంతరాలతో కలిపి తీసుకున్నారు. చివరికి విద్యార్థికి “నువ్వు రాకూడదు” అనే స్పష్టమైన అల్టిమేటం ఇచ్చారు.

ఈ తీరు వల్ల విద్యార్థి తీవ్ర ఆత్మన్యూనతకు గురై మనోవేదనకు గురయ్యాడని తల్లిదండ్రులు వాపోయారు. “గతంలో ప్రభుత్వ పాఠశాలలో చదివావు కాబట్టి ఈ పాఠశాల స్థాయికి తగవు” అనే మాటలు వినిపించాయని సమాచారం. ఇదే స్కూల్‌లో మరో విద్యార్థినిని గతంలో ఇదే రీతిలో బయటకు పంపించడంతో ఆమె చదువు మానేసి కూలీ పనులు మొదలుపెట్టినట్టు తల్లిదండ్రులు గుర్తుచేశారు.

ఇంకా, స్కూల్‌పై మరిన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పాఠశాలకు ఫైర్ సేఫ్టీ అనుమతులు లేవని, ఆటల కోసం ఏ మైదానం లేదని, పక్కనుండే మురుగు కాలువ వలన వర్షాకాలంలో ఆరోగ్య సమస్యలు తీవ్రమవుతున్నాయని వెల్లడవుతోంది. అంతేకాదు, నైపుణ్యం లేని, అర్హతలేని వ్యక్తులే ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారని స్థానికుల ఆరోపణలు. విద్యాశాఖ అధికారులు ఈ విషయంపై పట్టించుకోకపోవడం వెనక స్కూల్ యాజమాన్యం నుంచి ముడుపులు అందుకున్నారన్న ఆరోపణలూ వస్తున్నాయి.

ఈ ఘటనపై బాధిత విద్యార్థి తల్లిదండ్రులు స్పందిస్తూ, విద్యా రంగాన్ని ఇలా వ్యాపారంగా మార్చి అమానుషంగా ప్రవర్తించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి ఈ ఘటనపై తగిన విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.