ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా పలువురు వ్యక్తులు చావు వచ్చి అప్పటికప్పుడు పిలిచినట్లుగా అక్కడికక్కడే కుప్పకూలి మరణిస్తున్నారు.
నెలల పసికందు నుంచి ఉడుకు రక్తం యువత వరకు జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. గతంలో ఎన్నడూలేనిది ఇప్పుడే ఎందుకు ఇలా జరుగుతుందో తెలియక యువత ఆందోళన చెందుతుంది. తాజాగా ఏపీలో మరో సంఘటన చోటు చేసుకుంది. స్నేహితుడి పెళ్లికి వెళ్లి, స్టేజ్‌పై నవ దంపతులకు శుభాకాంక్షలు చెబుతుండగా మృత్యువు పిలిచింది. అంతే..అక్కడికక్కడే గుండెపోటుతో ప్రాణాలొదిలాడు. ఈ విషాద ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం పెనుమాడ గ్రామంలో ఓ జంట పెళ్లి వేడుక జరుగుతుంది. నూతన దంపతులకు పలువురు స్టేజ్‌పైకి వచ్చి కానుకలు ఇచ్చి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇంతలో వంశీ అనే వ్యక్తి తన స్నేహితులు కొంత మందితో స్జేజ్‌పైకి వచ్చాడు. నవవధువరులకు వారంతా గిఫ్ట్ ఇచ్చారు. వారిచ్చిన బహుమతిని వరుడు తెరచి చూస్తుండగా.. స్నేహితులంతా ఆనందంగా నవ్వుతూ చూడసాగారు. ఇంతలో వంశీ ఒక్కసారిగా స్టేజ్‌పైనే కుప్పకూలాడు. ఏం జరుగుతుందో తెలిసేలోపు అక్కడే ప్రాణాలొదిలాడు. వంశీ అమెజాన్‌లో ఉద్యోగి. బెంగళూరులో విధులు నిర్వహిస్తున్న వంశీ.. స్నేహితుడి పెళ్లికి వచ్చి ప్రాణాలొదలడంతో బంధుమిత్రులు విషాదంలో మునిగి పోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.ఈ వీడియోలో వరుడు బహుమతిని విప్పుతుండగా.. వంశీ తన ఎడమ వైపుకు వంగి బ్యాలెన్స్ కోల్పోవడం కనిపిస్తుంది. వెంటనే అతన్ని ధోన్ సిటీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అక్కడి వైద్యులు వంశీ చనిపోయినట్లు ప్రకటించారు.
కాగా దేశ యువతలో గుండెపోటు ఇటీవలి కాలంలో పెరగడం ఆందోళన కరంగా మారింది. మన దేశంలో దాదాపు 25-30 శాతం గుండెపోటు కేసులు ఇప్పుడు 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తుల్లో వస్తున్నట్లు తాజా నివేదికలు సూచిస్తున్నాయి. ఇది గత దశాబ్దాలతో పోలిస్తే భారీగా పెరిగింది. దీని నుంచి బయటపడాలంటే జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.