చిన్న బ్రాండ్స్‌కు యువత జై

ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల కొనుగోళ్లలో సాధారణంగా పెద్ద బ్రాండ్స్‌నే ఎక్కువగా ఎంచుకునే వినియోగదారుల ధోరణి క్రమంగా మారుతోంది. కొత్త తరం కన్జూమర్లు, ముఖ్యంగా మిలీనియల్స్, జెన్‌ జెడ్‌ వర్గాలు.. పేరొందిన పెద్ద కంపెనీల కన్నా కొన్నాళ్ల క్రితమే మార్కెట్లోకి వచ్చిన చిన్న బ్రాండ్స్‌ వైపు మొగ్గు చూపుతున్నాయి. మార్కెట్‌ రీసెర్చ్‌ సంస్థ నీల్సన్‌ఐక్యూ తాజా అధ్యయనం ప్రకారం 2019–2024 మధ్య కాలంలో పరిశ్రమ వార్షిక వృద్ధి రేటు కేవలం 8 శాతంగానే ఉండగా, వర్ధమాన ఎల్రక్టానిక్స్‌ గృహోపకరణాల బ్రాండ్లు మాత్రం ఏకంగా 13% వృద్ధి రేటు నమోదు చేశాయి.


5 శాతం కన్నా తక్కువ మార్కెట్‌ వాటా గల సంస్థలను వర్ధమాన బ్రాండ్లుగా పరిగణనలోకి తీసుకున్నారు. 1981–96 మధ్య పుట్టిన వారిని మిలీనియల్స్‌గా, 1997–2012 మధ్య జన్మించిన వారిని జెనరేషన్‌ జెడ్‌గా వ్యవహరిస్తారు. చిన్న గృహోపకరణాల విభాగంలో వర్ధమాన బ్రాండ్ల మార్కెట్‌ వాటా గత అయిదేళ్లలో 55% నుంచి 59%కి పెరిగింది. టీవీల్లో 23% నుంచి 26%కి చేరింది. ఇక ఈ–కామర్స్‌లో కొత్త బ్రాండ్లు రెండంకెల స్థాయిలో వృద్ధి చెందుతున్నాయి. అటు కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ డేటా ప్రకారం గత అయిదేళ్లలో ఆరు టాప్‌ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్స్‌ వార్షిక వృద్ధి 1.2 శాతానికి నెమ్మదించగా, చిన్న బ్రాండ్లు మాత్రం 2.65% వృద్ధి చెందాయి.

తీవ్రమైన పోటీ..
బ్రాండ్లు చిన్నవే అయినప్పటికే అవి అనుసరిస్తున్న వ్యూహాలే వ్యాపార వృద్ధికి ఊతమిస్తున్నాయి. ప్రధానంగా వినూత్నత, తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్లను అందిస్తుండటంలాంటి అంశాలు వాటికి ప్లస్‌ పాయింటుగా ఉంటోంది. ఇక ఈ–కామర్స్‌ విషయానికొస్తే.. కొనుగోళ్లు సులభతరంగా ఉండటం కూడా కలిసి వస్తోంది. ప్రీమియం ఫీచర్లను మరింత అందుబాటులోకి తేవడం ద్వారా వివిధ కేటగిరీల్లో వర్ధమాన బ్రాండ్లు తీవ్రమైన పోటీకి తెరతీశాయని నీల్సన్‌ఐక్యూ ఇండియా పేర్కొంది. టీవీలు, ఎయిర్‌ కండీషనర్లు, వేరబుల్స్‌ విభాగాల్లో దాదాపు 45–50 బ్రాండ్స్‌ పోటీపడుతున్నాయి.

సాధారణంగా ఎల్రక్టానిక్స్‌ కేటగిరీలో 3–4 పెద్ద బ్రాండ్స్‌ మాత్రమే మార్కెట్‌పై ఆధిపత్యం చలాయిస్తుంటాయి. ఉదాహరణకు రిఫ్రిజిరేటర్లు.. వాషింగ్‌ మెషీన్లు వంటి కేటగిరీల్లో ఎల్‌జీ, శాంసంగ్, వర్ల్‌పూల్, గోద్రెజ్‌ మొదలైనవి అగ్రస్థానంలో ఉండగా .. ఏసీల్లో వోల్టాస్, డైకిన్, ఎల్‌జీ లాంటి సంస్థలు టాప్‌ బ్రాండ్లుగా ఉంటున్నాయి. ప్రస్తుతం ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జూమర్‌ గూడ్స్‌ (ఎఫ్‌ఎంసీజీ) విభాగంలోని ధోరణులే ఎల్రక్టానిక్స్‌లోనూ కనిపిస్తున్నాయని నీల్సన్‌ఐక్యూ వివరించింది.

డిసెంబర్‌ క్వార్టర్‌లో దిగ్గజ సంస్థల కన్నా దాదాపు రెట్టింపు స్థాయిలో చిన్న, మధ్య తరహా సంస్థల అమ్మకాలు 13–14% స్థాయిలో పెరిగినట్లు పేర్కొంది. ఎల్రక్టానిక్స్‌ సెగ్మెంట్లో ప్రీమియం ఉత్పత్తుల విభాగం వేగవంతంగా వృద్ధి చెందుతోందని నీల్సన్‌ఐక్యూ డేటా సూచిస్తోంది. ఇక 2024 సెప్టెంబర్‌–డిసెంబర్‌ మధ్య కాలంలో ఈ–కామర్స్‌ మాధ్యమాన్ని తీసుకుంటే మొత్తం మార్కెట్‌ 6 శాతమే పెరగ్గా ఈ–కామర్స్‌ అమ్మకాలు ఏకంగా 19–20 శాతం వృద్ధి చెందాయి.

స్మార్ట్‌ ఫోన్స్‌లో జోరు..
ఇక, స్మార్ట్‌ఫోన్స్‌ విభాగంలో వర్ధమాన బ్రాండ్లు మరింత జోరుగా దూసుకెళ్తున్నాయని ఐడీసీ ఇండియా వెల్లడించింది. ఈ సంస్థ డేటా ప్రకారం 2022లో టాప్‌ అయిదు బ్రాండ్ల మార్కెట్‌ వాటా 76 శాతంగా ఉండగా 2024లో 65 శాతానికి తగ్గింది. అలాగే, 2023తో పోలిస్తే స్మార్ట్‌వాచ్, వేరబుల్స్‌ విభాగాల్లోనూ చిన్న బ్రాండ్లు గణనీయంగా వృద్ధి చెందాయి.

తక్కువ రేటులో ఎక్కువ ఫీచర్ల కోసం వినియోగదారుల నుంచి డిమాండ్‌ నెలకొనడం ఈ బ్రాండ్లకు ఉపయోగపడుతోంది. మోటరోలా వంటి వర్ధమాన బ్రాండ్ల అమ్మకాలు 136% ఎగి యగా, ఐక్యూ 51%, పోకో సేల్స్‌ 19%పెరిగాయి. శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు 2023తో పోలిస్తే 2024లో 19.4% క్షీణించాయి. రియల్‌మి 8.5%పడిపోగా, షావోమీ అమ్మకాలు 0.2 శాతమే పెరిగాయి. 34% వృద్ధితో బడా బ్రాండ్లలో యాపిల్‌ మాత్రమే ఇందుకు మినహాయింపు.