జగన్ జిల్లాల పర్యటనకు బ్రేక్.. వైసీపీలో నిరాశ!

www.mannamweb.com


జగన్ జిల్లాల పర్యటన ఎప్పుడు? సంక్రాంతి మూడో వారంలోనా? తరువాత చేస్తారా? ఇప్పుడు ఇదే ఆసక్తికర చర్చ. సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి వస్తానని జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. జనవరి మూడో వారం నుంచి జిల్లాల పర్యటన చేయనున్నట్లు జగన్ ప్రకటించారు. 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో.. వారానికి రెండు రోజులపాటు బస చేస్తానని చెప్పుకొచ్చారు. దీంతో పార్టీ శ్రేణులు ఒక రకమైన ఉత్సాహం కనిపించింది. అయితే ఇప్పుడు రెండోవారం సమీపిస్తున్న ఎటువంటి సన్నాహాలు లేకుండా పోయాయి. పైగా తాజా పరిణామాలతో జగన్ జిల్లాల పర్యటన ఇప్పుడే కాదని తేలిపోయింది. దీంతో వైసీపీ శ్రేణుల్లో ఒకరకమైన అసంతృప్తి వ్యక్తం అవుతోంది.

* జనవరి మూడో వారం అంటూ ప్రచారం
ఈ ఎన్నికల్లో వైసిపి దారుణంగా ఓడిపోయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఆ పార్టీకి దక్కలేదు. దీంతో చాలామంది నేతలు బయటకు వెళ్లిపోయారు. ఇంకొందరు సిద్ధంగా ఉన్నారు. ఇంకోవైపు కూటమి దూకుడుకు పార్టీ శ్రేణులు తట్టుకోలేకపోతున్నాయి. కేసులతోపాటు దాడులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో పార్టీ క్యాడర్ కు భరోసా కల్పించేలా జిల్లాల పర్యటన చేయాలని జగన్ భావించారు. వారంలో రెండు రోజులపాటు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో గడపాలని డిసైడ్ అయ్యారు. ఇదే విషయం జగన్ స్వయంగా ప్రకటించడంతో పార్టీ శ్రేణులు కొంత ఆనందించాయి. తమకు అండగా నిలబడేందుకు అధినేత ముందుకు రావడాన్ని ఆహ్వానించాయి.

* విదేశీ పర్యటనకు..
అయితే ఇప్పుడు జగన్ జిల్లాల పర్యటన జనవరిలో లేనట్టేనని తేలిపోయింది. ఈనెల 11 నుంచి 2 వారాలపాటు జగన్ విదేశీ పర్యటనకు వెళ్ళనున్నారు. ఈ మేరకు ఆయన సిబిఐ కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. తన విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఈనెల 8న కోర్టులో విచారణ జరగనుంది. అందుకు అనుగుణంగా జగన్ విదేశీ పర్యటన కొనసాగే అవకాశం ఉంది. కోర్టు అనుమతిస్తే ఈ నెలాఖరు వరకు ఆయన విదేశాల్లో గడుపుతారు. నెల చివర్లోనే రాష్ట్రానికి చేరుకుంటారు. అప్పటికప్పుడు జిల్లాల పర్యటన అంటే వీలు పడే పరిస్థితి లేదు. జగన్ జిల్లాల పర్యటన ఫిబ్రవరిలో కానీ.. మార్చిలో కానీ ఉంటుందని పార్టీ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. అయితే ఈ విషయంలో పార్టీ వర్గాల్లో మాత్రం ఒక రకమైన అసంతృప్తి వ్యక్తం అవుతోంది