YS Jagan: వైసీపీ ఎమ్మెల్సీలతో వైఎస్‌ జగన్‌ కీలక భేటీ.. పలు అంశాలపై దిశానిర్దేశం

www.mannamweb.com


YS Jagan: వైసీపీ ఎమ్మెల్సీలతో వైఎస్‌ జగన్‌ కీలక భేటీ.. పలు అంశాలపై దిశానిర్దేశం

YS Jagan: ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ క్రమంలోనే త్వరలో శాసనసభ, శాసనమండలి సమావేశాలు జరిగే అవకాశం ఉంది. వైసీపీ ఎమ్మెల్సీలతో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి భేటీ అయ్యారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సమావేశం జరిగింది. త్వరలోనే జరిగే శాసనమండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. పలు అంశాలపై ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. త్వరలోనే పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం జరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. పార్టీలో జోష్ నింపేందుకు జగన్‌ వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. గత మూడు నాలుగు రోజులుగా వైసీపీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు, గెలిచిన అభ్యర్థులు, కీలక నేతలతో ఎన్నికల ఫలితాలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు.

సమావేశంలో వైసీపీ ఎమ్మెల్సీలకు వైఎస్‌ జగన్ దిశానిర్దేశం చేశారు. 40 శాతం మంది ప్రజలు మన వైపు ఉన్నారని మర్చిపోవద్దన్నారు. మనం చేసిన మంచి ఇప్పటికీ ప్రజలకు గుర్తుందని వ్యాఖ్యానించారు. ఎన్నికల ఫలితాలు శకుని పాచికల మాదిరిగా ఉన్నాయన్నారు. ఈవీఎంల వ్యవహారంపై దేశవ్యాప్త చర్చ జరగాలన్నారు. మనకు కష్టాలు కొత్త కాదని.. ప్రలోభాలకు లొంగకుండా ప్రజల తరఫున పోరాడదామన్నారు. నాలుగైదు కేసులు పెట్టినంత మాత్రం భయపడవద్దని సూచించారు. మళ్ళీ వైసీపీ ఉవ్వెత్తున ఎగసి పడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.

శిశుపాలుని మాదిరిగా చంద్ర బాబు తప్పులు లెక్క పెట్టాలన్నారు. ఇప్పటికే ప్రజలకు అందాల్సిన స్కీమ్స్ డబ్బులు ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం టీడీపీ , జనసేన, బీజేపీ హనీమూన్ నడుస్తుందని ఎద్దేవా చేశారు. మరి కొంత సమయం కూటమికి ఇద్దామని.. ఆ తర్వాత ప్రజల తరపున పోరాటాలు చేద్దామని జగన్‌ వైసీపీ ఎమ్మెల్సీలకు సూచించారు. అసెంబ్లీలో వైసీపీ నోరు మెదపకుండా కట్టడి చేసే అవకాశం ఉందని.. కాబట్టి శాసన మండలిలో గట్టిగా పోరాటం చేద్దామని ఆయన పేర్కొన్నారు.