‘ఇంకా ఏంటన్నా బిల్లులంటావు?’.. వైఎస్‌ జగన్‌ అసహనం

పులివెందుల ప్రజాదర్బార్‌లో తోపులాట.. ఇద్దరికి గాయాలు


జగన్‌కు సమస్య వివరిస్తున్న ఓ దివ్యాంగుడు

ఈనాడు- కడప, న్యూస్‌టుడే- పులివెందుల: ‘ఇంకా ఏంటన్నా..

పెండింగ్‌ బిల్లుల గురించి అడుగుతావు? ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే ఎలా అన్నా!..’ అని బిల్లుల బకాయిల గురించి ప్రస్తావించిన పార్టీ నేతలతో వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తన సొంత నియోజకవర్గం, వైఎస్సార్‌ జిల్లా పులివెందుల పర్యటనలో భాగంగా గురువారం ఆయన క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్‌ నిర్వహించారు. ఉదయం 8.30కు కార్యక్రమం ప్రారంభించగా, అప్పటికే జగన్‌ను కలిసేందుకు పార్టీ కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. పలువురు నేతలు, గుత్తేదారులు వైకాపా హయాంలో చేపట్టిన పనుల తాలూకు బిల్లుల గురించి అడిగారు. దీంతో జగన్‌ అసహనం వ్యక్తంచేస్తూ, ఇప్పుడు కూడా బిల్లులు అడుగుతారేంటని చికాకు పడ్డారు. 11 గంటల సమయంలో కొందరు జగన్‌ను కలవడానికి లోనికి దూసుకుపోయే ప్రయత్నం చేశారు. కార్యాలయ ద్వారం వద్ద తోపులాట జరిగింది. ఇంతలో తలుపు పక్కనున్న అద్దం కిందపడి, పగిలింది. అద్దం ముక్కలు గుచ్చుకొని ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన మస్తానమ్మను జగన్‌ లోపలికి పిలిచి, పరామర్శించారు. తోపులాటను అదుపు చేయడానికి పోలీసులు లాఠీఛార్జి చేయగా, కార్యకర్తలు అసహనం చెందారు.

క్యాంపు కార్యాలయం అద్దాలు పగిలి, కింద రాలిన గాజుముక్కలు

చేతికి గాయమై ఆసుపత్రిలో కుట్లు వేయించుకొని వచ్చిన ముదిగుబ్బకు చెందిన వార్డు సభ్యురాలు మస్తానమ్మ