అయ్యా..యస్‌ ప్రవీణ్‌ ప్రకాశ్‌..ముగిసిన సర్వీస్‌

www.mannamweb.com


ఐఏఎస్‌ అధికారులకు రోల్‌ మోడల్‌… ఎస్‌ఆర్‌ శంకరన్‌!

ఒక ఐఏఎస్‌ ఎలా ఉండకూడదో చెప్పాలంటే ఇప్పుడు వినిపిస్తున్న పేరు ప్రవీణ్‌ ప్రకాశ్‌!

జగన్‌ హయాంలో వివాదాస్పద అధికారిగా ముద్రపడిన ప్రవీణ్‌ ప్రకాశ్‌ కెరీర్‌ అర్ధాంతరంగా ముగిసింది. ప్రభుత్వం మారగానే నామినేటెడ్‌ పోస్టుల్లో ఉన్న వాళ్లు రాజీనామాలు చేయడం సహజం. కానీ… అఖిల భారత సర్వీసులో ఉన్న ప్రవీణ్‌ ప్రకాశ్‌ చిత్రమైన రాజకీయ లక్షణం ప్రదర్శించారు. కూటమి సర్కారులో పనిచేయలేనంటూ వీఆర్‌ఎ్‌సకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం దీనిని ఆమోదించడంతో సోమవారం ఆయన సర్వీసు ముగిసింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రవీణ్‌ప్రకాశ్‌ 1994 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. ఆయన కెరీర్‌ కర్నూలు అసిస్టెంట్‌ కలెక్టర్‌గా మొదలైంది. ఆ తర్వాత గుంటూరు, విజయవాడ మున్సిపల్‌ కమిషనర్‌గా పనిచేశారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు విశాఖ కలెక్టర్‌ గా పనిచేస్తూ ఎన్నికల కమిషన్‌ ఆగ్రహానికి గురయ్యారు. అయినా వైఎస్‌ చలవతో ఆయన తూర్పుగోదావరి, రంగారెడ్డి కలెక్టర్‌గా పోస్టింగ్‌ దక్కించుకున్నారు.

జగన్‌తో ఉన్న సాన్నిహిత్యం హైదరాబాద్‌ మహానగర పాలనవైపు నడిపించింది. వైఎస్‌ మరణం తర్వాత కొన్నేళ్లపాటు అప్రాధాన్య పోస్టుల్లో పనిచేశారు. కేంద్రంలో 2013-2017 వరకు కేంద్రమంత్రి పీఎ్‌సగా పనిచేశారు. ఆ తర్వాత ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా 2019, సెప్టెంబరు దాకా పనిచేశారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఢిల్లీ నుంచి ఏపీకి వచ్చారు. రాగానే 2019 సెప్టెంబరులో ముఖ్యమంత్రికి ముఖ్యకార్యదర్శిగా నియమితులయ్యారు. దీంతోపాటు కీలకమైన జీఏడీకి ముఖ్యకార్యదర్శిగా ఉన్నారు. ఐఏఎస్‌ల పోస్టింగ్‌, శాఖాధిపతుల నియామకాలు, సీఎం వ్యవహారాలు…. ఇలా అన్నీ తానే చూసుకున్నారు.

ముఖ్యమంత్రి జగన్‌ కంటే మరింత పవర్‌పుల్‌ వ్యక్తిగా ఎదిగారు. బ్యూరోక్రాట్లు కూడా ఆయన చుట్టూ తిరిగేవారు. సర్వేరాళ్లపై జగన్‌ బొమ్మలు, పాసుపుస్తకాలపై ఫొటోలు, ప్రభుత్వ ఆఫీసులు, భవనాలకు వైసీపీ రంగులు ఇలా అనేకానేక వివాదస్పద నిర్ణయాల వెనక ఈయన ప్రమేయమే ఉందని చెబుతుంటారు. కరోనా కాలంలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో జగన్‌ పట్టుదలకు పోవడానికి, ఎన్నికల కమిషన్‌తో గొడవకు దిగడం, హైకోర్టుకెళ్లి చీవాట్లు తినడం వెనక ఈయన సలహాలే ఉన్నాయని సహచర అధికారవర్గాలు చెప్పాయి. ఒక దశలో సీఎం తన మాట కాదనరన్న ధీమాతో అనేకానేక రాజకీయ అంశాల్లో కూడా జోక్యం చేసుకున్నారని వైసీపీ నేతలే చెబుతుంటారు.

అర్ధరాత్రి జాగారాలు..

ప్రభుత్వ ఉద్యోగులకు సమయపాలన ఉంటుంది. ప్రవీణ్‌ప్రకాశ్‌ ఉదయం అంతా జగన్‌ క్యాంపు ఆఫీసులో ఉండేవారు. సాయంత్రం తర్వాత సచివాలయానికి వెళ్లేవారు. ఇక అక్కడి నుంచి ఏ అర్ధరాత్రి వరకో ఆఫీసులో పనిచేసేవారు. ఆ సమయంలో తన ఆఫీసు సిబ్బంది, అవసరం లేని సిబ్బంది కూడా సచివాలయంలోనే ఉండాలని ఒత్తిడిచేసేవారని ఉద్యోగ సంఘాలు పలుమార్లు సీఎంకు ఫిర్యాదు చేశాయి. జగన్‌ వీరభక్తుడిని అని చెప్పుకోవడానికి పలు సమావేశాలు, ప్రభుత్వ ఫంక్షన్‌లలో జగన్‌ ముందు మోకాళ్లమీద కూర్చొని తన స్వామిభక్తిని చాటుకునేవారని, దీనివల్ల ఐఏఎ్‌సల గౌరవం దెబ్బతీశారని విమర్శలున్నాయి. తన చర్యలతో సీఎంవోలో ఒక్క క్షణం కూడా ఆయనను భరించలేని పరిస్థితిని తెచ్చుకున్నారు.

దీంతో 2022 ఫిబ్రవరిలో ఆయన్ను సీఎంవో నుంచి తప్పించి తిరిగి ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా జగన్‌ పంపించారని అధికారవ ర్గాలు చెబుతున్నాయి. సరిగ్గా ఎనిమిది నెలల తర్వాత అంటే, 2022 నవంబరులో తిరిగి ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఏపీకి వచ్చారు. కీలకమైన ఆర్‌అండ్‌బీ ముఖ్యకార్యదర్శి పోస్టు దక్కించుకున్నారు. అక్కడ ఇమడలేక తిరిగి సీఎంఓకు వెళ్లేందుకు విఫల ప్రయత్నాలు చేశారు. నెల తిరిగాక పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శిగా పోస్టు తెచ్చుకున్నారు.

కూటమి ప్రభుత్వం వచ్చేవరకు ఆయన అదే పోస్టులో పనిచేశారు. ఉపాధ్యాయలోకం జగన్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు చేయడంలో ప్రవీణ్‌ప్రకాశ్‌ తీసుకున్న అనేకానేక నిర్ణయాలే ప్రధాన కారణమని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఉపాధ్యాయులకు పాఠశాలల్లోని మరుగుదొడ్ల ఫొటోలు తీయడం వంటివి అప్పగించారు. ఇలాంటి చర్యలు జగన్‌ ప్రభుత్వ ప్రతిష్ఠను పాతాళంలో పడేశాయి. ఇంగ్లీషు మీడియం మోజులో సిలబ్‌సను మార్చడం, విద్యార్థులకు బైజూస్‌ ట్యాబ్‌లు ఇప్పించడం సంచలన చర్యలుగా మిగిలాయి. ఏటా 670 కోట్ల వ్యయంతో బైజూస్‌ కంటెంట్‌ ఉన్న ట్యాబ్‌లను ప్రభుత్వంతో కొనిపించడంలో ప్రవీణ్‌ ప్రకాశ్‌ సూచనలు, సలహాలే ప్రధానంగా ఉన్నాయని చెబుతున్నారు.

ఎక్కడకెళ్లినా గొడవలు, వివాదాలే..

ఎన్నికల్లో గెలిచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో ప్రవీణ్‌ప్రకాశ్‌కు భవిష్యత్‌ దర్శనం కనిపించి ఉంటుంది. జగన్‌తో అంటకాగి ప్రతిపక్షాలను, ఇతర అధికారులను వేధించిన ఫలితం తనను వెంటాడుతుందని ఆందోళనకు గురయి ఉంటారు. అంతే.. ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే స్వచ్ఛంద పదవీ విరమణకు డిజిటల్‌ సైన్‌తో కూడిన పత్రంపై దరఖాస్తు చేశారు. అది చెల్లదని దానిని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. ఆయన అప్పుడైనా పునరాలోచన చేయకుండా జూన్‌ 26న పూర్తిస్తాయి ఫార్మాట్‌లో వీఆర్‌ఎ్‌సకు దరఖాస్తు ఇచ్చారు. ప్రభుత్వం ఆయన వినతిని ఆమోదించి సెప్టెంబరు 30 నుంచి వీఆర్‌ఎస్‌ అమల్లోకి వస్తుందని నోటిఫికేషన్‌ (జీఓ-1207) ఇచ్చింది. ప్రవీణ్‌ప్రకాశ్‌ 30 ఏళ్ల సర్వీసులో చేసిన గొప్పపనులు, నిర్వహించిన ఘనకార్యాలు అంటూ ఏమీలేవు. విశాఖ, ఖమ్మం, తూర్పుగోదావరి, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్‌గా ఉన్న సమయంలో తోటి ఉద్యోగులతో గొడవలు, విబేధాలే సాగించారు. కలెక్టర్‌ హోదాలో ప్రజల సంక్షేమం కోసం, పాలనలో గొప్ప మార్పులు తీసుకొచ్చేందుకు ఆయన చేసిన ఒక్క మేలూ లేదని ఉద్యోగులే చెబుతున్నారు.