YS Family Politics : వైఎస్ విజయమ్మ రెండు కళ్ల సిద్ధాంతం – జగన్, షర్మిల ఇద్దరికీ సపోర్ట్ సాధ్యమేనా ?

YS Vijayamma supports Jagan Or Sharmila : వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల ప్రచారం ప్రారంభించే ముందు ఇడుపుల పాయలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆ కార్యక్రమానికి జగన్ తల్లి విజయలక్ష్మి వచ్చారు. కుమారుడ్ని ఆశీర్వదించారు. ఈ పరిణామం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. తల్లి విజయలక్ష్మి మద్దతు జగన్‌కు ఉన్నట్లేనా అని చర్చించుకున్నారు. అయితే కొద్ది రోజుల తర్వాత వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటనకు ఇడుపుల పాయకు వచ్చారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆమెతో పాటు ప్రత్యేక విమానంలో విజయలక్ష్మి వచ్చారు. కుమార్తె షర్మిలను కూడా ఆశీర్వదించారు. అంటే.. అటు కుమారుడికి.. ఇటు కుమార్తెకు కూడా ఆమె మద్దతుగా ఉంటున్నారు. అయితే ఇప్పుడు ఒకరిపై ఒకరు రాజకీయం చేసుకుంటున్నారు. జగన్ విమర్శలు చేస్తున్నారు. షర్మిల జగన్ పై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఇలాంటి సమయంలో ఇద్దరి వైపు ఉండటం సాధ్యం కాదు. మరి విజయలక్ష్మి మద్దతు ఎవరికి ఉంటుంది ?


పిల్లలిద్దరూ చెరో రాష్ట్రంలో రాజకీయాలు చేస్తారనుకున్న విజయలక్ష్మి

షర్మిల నేరుగా తన అన్నతో ఢీకొనడానికి ఇష్టం లేకే తెలంగాణలో పార్టీ పెట్టారని గతంలో ప్రచారం జరిగింది. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు విజయమ్మ పూర్తి మద్దతుగా నిలిచారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేసి.. తన కుమార్తె కు అండగా ఉండాలి కాబట్టి.. వెళ్తున్నానని చెప్పుకున్నారు. పిల్లలిద్దరూ చెరో రాష్ట్రంలో రాజకీయం చేయాలని దేవుడు రాసి పెట్టారని చెప్పుకున్నారు. తెలంగాణలో వైఎస్ఆర్‌సీపీ పోటీ చేయడం లేదు కాబట్టి అన్నా చెల్లెళ్ల మధ్య సవాల్ జరిగే అవకాశం కనిపించ లేదు.అందుకే విజయమ్మకు కూడా ఇద్దరి మధ్య ఎవరో తేల్చుకోవాల్సిన అవసరం రాలేదు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. జగన్ ఓటమే లక్ష్యంగా షర్మిల పని చేస్తున్నారు. కాంగ్రెస్ చీఫ్ బాధ్యతలు తీసుకుని అవినాష్ రెడ్డి హత్య కేసును మెయిన్ లీడ్ గా తీసుకుని జగన్ ను కార్నర్ చేస్తున్నారు. ఐదేళ్ల కిందట వివేకా హత్య జరిగినప్పుడు ఈ కుటుంబం అంతా ఐక్యంగా ఉంది. అందరూ వివేకానందరెడ్డి హత్య విషయంలో అప్పటి సీఎం చంద్రబాబునే కార్నర్ చేశారు. కానీ ఐదేళ్లు అయ్యే సరికి సీన్ మరిపోయింది. ఆ కుటుబంంలోనే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.

ఒకరిపై ఒకరి విమర్శలతో విజయలక్ష్మికి ఇరకాటం

ఇప్పుు ఏపీలో రాజకీయాలు పూర్తిగా మరిపోయాయి. తాను స్థాపించిన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేసి ఏపీలో అధికారంమ చేపట్టాలన్న లక్ష్యంతో షర్మిల పని చేస్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చాక బలమున్న చోటే వెదుక్కోవాలి. లేకపోతే కష్టం. తెలంగాణలో ఆమె ప్రభావం దాదాపుగా లేదని ఇక ఏటూ తేల్చుకోవాలనుకుంటున్నారు కాబట్టి మొహమాటాలు వదిలేయాలని అనుకున్నారు. ఇలాంటి సమయంలో పిల్లల్లో విజయమ్మ సపోర్ట్ ఎవరికి అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు విజయమ్మ కూతురు వైపే మొగ్గు చూపారు. కూతురుకు అండగా నిలవడమే ప్రాధాన్యతాంశంగా తీసుకున్నారు. వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా రాజీనామా చేసినప్పుడు అదే చెప్పారు. ఇద్దరు బిడ్డలు రెండు రాష్ట్రాల్లో రాజకీయం చేస్తారని చెప్పారు. కానీ ఇప్పుడు ఒకరిపైకి ఒకరు రాజకీయం చేసే పరిస్థితులు వచ్చాయి. షర్మిల ఏపీకి వచ్చేయాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత షర్మిలను కట్టడి చేయాలని విజయమ్మపై జగన్‌ ఒత్తిడి తెచ్చారన్న ప్రచారం జరిగింది. అయితే ఏవీ వర్కవుట్ కాలేదు. ఇప్పుడు రాజకీయం తెరమీదకు వచ్చేసింది

రెండు కళ్లల్లో ఏదో ఒకదానికే మద్దతు ఇవ్వాల్సిన సందర్భం !

తన ఇద్దరు పిల్లలు తనకు రెండు కళ్లని విజయమ్మ చెబుతూ వస్తున్నారు. అప్పుడు ఆమె రెండు కళ్లల్లో ఏదోక కంటికే ప్రాధాన్యం ఇవ్వక తప్పదన్న వాదన వినిపిస్తోంది. షర్మిళ వైపే విజయమ్మ నిలబడితే జగనుకు నైతికంగా భారీ దెబ్బ తగిలినట్టే భావిస్తారు. అందుకే జగన్మోహన్ రెడ్డి తల్లి మద్దతు కోసం ప్రయత్నించారు. విజయమ్మ కూడా .. జగన్ కు వ్యతిరేకంగా లేరు. ఆయన అధికారం పోవాలని విజయమ్మ కోరుకోలేరు. అలాగని.. కుమార్తెను కాదని ఆయనకు మద్దతుగా ఉండలేని పరిస్థితి. అయినా జగన్ మోహన్ రెడ్డి అడిగినందున.. తాను ప్రచారం ప్రారంభించే ముందు ఇడుపుల పాయ ప్రార్థనలకు హాజరయ్యారు. కానీ ఒక్క మాట కూడా జగన్ కు మద్దతుగా మాట్లాడలేదు. అలాగే షర్మిల చేపట్టిన అభ్యర్థుల ప్రకటన రాజకీయ కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. అయితే కుమార్తెకు మద్దతుగా వచ్చారు తప్ప.. ఆమె రాజకీయ ప్రకటన.. వ్యాఖ్యలు చేయలేదు.

ఇద్దరికీ మద్దతు అంతర్గతంగానే.. రాజకీయ ప్రచారమేమీ ఉండకపోవచ్చు !

ఎవరికీ మద్దతు ఇవ్వకుండా విజయమ్మ తటస్థంగా ఉంటారని వైసీపీ వర్గాలు నమ్ముతున్నాయి. కానీ ప్రస్తుతం విజయమ్మ షర్మిల వద్దే ఉంటున్నారు. రెండు, మూడు సార్లు షర్మిలతో కనిపిస్తే.. కుమార్తెకే ఆమె మద్దతు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇది సీఎం జగన్‌కు ఇబ్బందే. అందుకే మధ్యేమార్గంగా.. ఇడుపుల పాయలో ప్రార్థనలు చేసే సందర్భాల్లో జగన్ వెంట ఉండేలా ఒప్పించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితి ప్రకారం చూస్తే.. విజయమ్మ గతంలోలా ఎన్నికల ప్రచారంలో పాల్గొనే పరిస్థితి లేదని భావిస్తున్నారు. తన బిడ్డను మరోసారి గెలిపించాలని ఆమె నోరారా కోరలేరు. ఎందుకంటే ఇద్దరు బిడ్డలు అధికారం కోసం పోరాడుతున్నారు. ఏ బిడ్డ కోసం అన్నది ఆమె తేల్చుకోలేకపోతున్నారు. ఈ పరిస్థితి వైఎస్ విజయమ్మను ఒత్తిడికి గురి చేసేదే.