వైసీపీ అధినేత జగన్ ఎటువంటివాడో రాష్ట్ర ప్రజలందరూ కళ్ళారా చూశారు. ఆయన విచిత్ర ధోరణి గురించి సొంత చెల్లి షర్మిల ప్రతీరోజూ వివరిస్తూనే ఉన్నారు.
వైసీపీని వీడుతున్నవారందరూ కూడా జగన్ అహంభావం, మూర్ఖత్వం, నిరంకుశత్వం గురించి చెపుతూనే ఉన్నారు. ఈవిదంగా ఓ పార్టీ నాయకుడు గురించి ఇంతమంది నెగిటివ్ గా చెప్పడం చాలా అరుదు. అటువంటి వ్యక్తులు రాజకీయాలలో చాలా తక్కువ మందే ఉంటారు. వారిలో జగన్ అగ్రస్థానంలో నిలుస్తున్నారు.
తాజాగా జగన్ గురించి ఆ పార్టీ సీనియర్ నేత, రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద రావు చాలా విషయాలు చెప్పారు. త్వరలో ఆయన పార్టీ వీడబోతున్నారు. కారణం ఏమిటని అడిగితే జగన్ అందరినీ వాడుకుంటారు తప్ప ఎవరికీ గౌరవం ఇవ్వరని తన విషయంలో కూడా జగన్ అలాగే వ్యవహరించారని రాపాక చెప్పారు.
వైసీపీ చేపట్టిన కార్యక్రమాలన్నిటిలోకి ‘గడప గడపకి’ చాలా ఇబ్బందికరమైనదని అయినా తాను దానిలో కూడా పాల్గొన్నానని రాపాక చెప్పారు. పార్టీలో అందరూ నేతల్లాగే సొంత డబ్బుతో అనేక సభలు, సమావేశాలు, పార్టీ కార్యక్రమాలు నిర్వహించానని, కానీ ఎన్నికలు వచ్చినప్పుడు నా సర్వే రిపోర్ట్ బాగోలేదని జగన్ తేల్చి పడేశారని రాపాక ఆవేదన వ్యక్తం చేశారు.
తన రిపోర్ట్ బాగోలేదని చెప్పిన జగనే తనను లోక్ సభకు పోటీ చేయమని బలవంతం పెట్టారని, తాను ఓడిపోతానని ముందే తెలిసినా జగన్ మాట కాదనలేక అయిష్టంగా పోటీ చేసి ఓడిపోయానని చెప్పారు.
జగన్ని కలవాలంటే రోజులు, వారాలు కాదు.. కొన్ని నెలలు పడుతుందని, ఆ భాగ్యం కూడా లభించనివారు పార్టీలో చాలామందే ఉన్నారని రాపాక చెప్పారు. ఒకవేళ జగన్ని కలిసేందుకు అపాయింట్మెంట్ లభించినా ఆయన చెప్పేదే వినాలి తప్ప ఆయనకు ఎదుటవాడు చెప్పే మాటలను వినే అలవాటు లేదని రాపాక చెప్పారు.
తాను బటన్ నొక్కి సంక్షేమ పధకాలు ఇస్తున్నాను గనుక ప్రజలు తమకి గాక వేరేవరికి ఓట్లు వేస్తారు? అని జగన్ ప్రశ్నిస్తుండేవారని రాపాక చెప్పారు. ఈ అహంభావంతోనే ప్రజలు తన ఫోటో చూసే మాకు ఓట్లు వేస్తారు తప్ప మమ్మల్ని, మా పనితీరుని చూసి కాదని జగన్ మా మొహం మీదనే చెపుతుండేవారని రాపాక చెప్పారు. అందుకే జగన్ పార్టీలో ఎవరినీ పట్టించుకునే వారు కాదన్నారు.
ఈ అహంభావం, అతిశయంతో నే ఎన్నికలలో వైసీపీకి 175 కి 175 సీట్లు వస్తాయని జగన్ చెప్పుకునేవారని రాపాక చెప్పారు. కనుక ఎన్నికలలో వైసీపీ ఓటమికి జగన్ మాత్రమే కారకుడు తప్ప కోటరీ లేదా మరొకరు కాదన్నారు రాపాక.
జగన్ అన్నీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ, ప్రజలు తన మొహం చూసే ఓట్లు వేస్తారని చెపుతూనే ఎన్నికలు దగ్గర పడగానే తమ సర్వే రిపోర్టులు బాగోలేవని చెపుతూ 83 మందిని మార్చేశారని, పలువురికి టికెట్స్ ఇవ్వకుండా, నియోజక వర్గాలు మార్చేసి చాలా అవమానకరంగా వ్యవహరించారని రాపాక చెప్పారు.
ఇన్ని అవమానాలు దిగమింగుకుంటూ జగన్ భజన చేసేవారిమని లేకుంటే పార్టీలో ఒక్క క్షణం కూడా ఉండలేమని రాపాక చెప్పారు. కాస్త అటూఇటూగా వైసీపీలో అందరి పరిస్థితి ఇదేనని రాపాక చెప్పారు.
ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత కూడా జగన్ ధోరణిలో ఏమాత్రం మార్పు రాలేదని, ఇటువంటి నాయకుడిని, పార్టీని నమ్ముకుని అందరం నట్టేట మునిగామని, ఇంకా వైసీపీలోనే ఉంటే ఆ ఊబిలో కూరుకుపోయి ఎన్నటికీ దానిలో నుంచి బయటపడలేమని అందుకే పార్టీని వీడాలని నిర్ణయించుకున్నానని రాపాక వర ప్రసాద రావు చెప్పారు.