కేంద్ర ప్రభుత్వం ఇటీవలే మహిళల కోసం అద్భుతమైన పధకం ప్రారంభించింది. ఈ పధకంలో చాలా ప్రయోజనాలున్నాయి. మహిళలకు ఆర్ధికంగా చేయూత అందించేందుకు, స్వావలంబనకు ఈ పధకం దోహదపడుతుంది.
అంటే ప్రతి మహిళ తన కాళ్లపై తాను నిలబడేందుకు చేయూతనిస్తుంది.
సాధారణంగా ఏదైనా వ్యాపారం ప్రారంభించేందుకు రుణాలు తీసుకుంటారు. కానీ అధిక వడ్డీలు భారంగా మారుతుంటాయి. ఈ క్రమంలో మహిళల కోసం ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం ఈ పధకం ప్రారంభించింది. ఇదే లక్‌పతి దీదీ యోజన. అంటే మహిళల్ని లక్షాధికారులుగా చేసే పథకం. ఈ పధకంలో మహిళలకు 5 లక్షల వరకు రుణం ఎలాంటి వడ్డీ లేకుండా లభిస్తుంది. అర్హులైన మహిళలకు ఈ పధకంలో రుణం లభిస్తే ఒక్క రూపాయి కూడా వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు. నిర్ణీత వ్యవధిలో అసలు చెల్లించుకుంటూ ఉంటే చాలు. ఈ పధకంతో చాలా లాభాలున్నందున ప్రాచుర్యం పొందింది. మహిళలు సొంతంగా వ్యాపారం చేసుకునేందుకు ఈ పధకం ఆర్ధికంగా సహకారం అందిస్తుంది. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంలో భాగంగా శిక్షణ కూడా ఉంటుంది. ఆసక్తి కలిగిన వివిధ రంగాల్లో మహిళలకు శిక్షణ అందిస్తారు. ఈ శిక్షణ మహిళా స్వయం సహాయక గ్రూపుల ద్వారా లభిస్తుంది.
2023 ఆగస్టులో ప్రారంభమైన ఈ పధకం ద్వారా ఇప్పటికే కోటి మంది మహిళలు లబ్ది పొందారు. మొదట్లో 2 కోట్లమంది లక్ష్యంగా పెట్టుకున్నా ఈ పధకం ప్రాచుర్యం పొందడంతో 3 కోట్లకు పెంచారు. మహిళలకు అవసరమైన శిక్షణ ఇచ్చి వ్యాపారంలో నిలదొక్కుకునేలా చేయడమే ఈ పధకం ప్రధాన ఉద్దేశ్యం. అందుకే 1-5 లక్షల వరకు రుణాలపై ఎలాంటి వడ్డీ అవసరం చెల్లించాల్సిన అవసరం లేకుండా ఈ పధకం రూపొందింది. వ్యాపారంలో శిక్షణ, వ్యాపారం నెలకొల్పడం, మార్కెటింగ్ విభాగాల్లో పూర్తి సహకారం అందుతుంది. వ్యాపారం ప్రారంభించేందుకు అవసరమైన రుణం పొందేందుకు అవసరమైన డాక్యుమెంట్లను స్థానికంగా ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూపు ఆఫీసులో సమర్పించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇన్‌కం ప్రూఫ్, బ్యాంక్ పాస్‌బుక్ తప్పనిసరిగా కలిగి ఉండాలి.
































