రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి (ఐఆర్) ఇచ్చే పద్ధతికి జగన్ సర్కార్ మంగళం పాడింది. ఈ ప్రభుత్వ అయిదేళ్ల కాలం మే నెలతో ముగుస్తుంది. కానీ, జులైలో ఒకేసారి పీఆర్సీ ఇస్తామంటూ ఉద్యోగులకు హామీ ఇచ్చింది.
అధికారం మే నెల వరకు ఉంటే.. జులైలో పీఆర్సీ ఇస్తామంటూ జగన్ సర్కారు కల్లబొల్లి హామీ
ఐఆర్ తక్కువ ఇస్తే ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తుందని దాటవేత
పెండింగ్ బకాయిలపై పాతపాటే
స్పష్టమైన హామీలు లేకుండానే ఉద్యోగ సంఘాలతో ముగిసిన మంత్రివర్గ ఉపసంఘం చర్చలు
‘చలో విజయవాడ’ యథాతథం: ఏపీ ఐకాస ప్రకటన
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి (ఐఆర్) ఇచ్చే పద్ధతికి జగన్ సర్కార్ మంగళం పాడింది. ఈ ప్రభుత్వ అయిదేళ్ల కాలం మే నెలతో ముగుస్తుంది. కానీ, జులైలో ఒకేసారి పీఆర్సీ ఇస్తామంటూ ఉద్యోగులకు హామీ ఇచ్చింది. సాధారణ ఎన్నికల ముందు ఐఆర్ తక్కువగా ఇస్తే ఉద్యోగుల నుంచి వ్యతిరేకత మరింత పెరుగుతుందని ఐఆర్ ఇవ్వకుండా దాటవేసింది. దీన్ని సమర్థించుకునేందుకు జులైలో ఏకంగా పీఆర్సీనే ఇచ్చేస్తామనే హామీని తెరపైకి తెచ్చిందని విమర్శలు వినిపిస్తున్నాయి. 12వ పీఆర్సీ కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసినా ఇంతవరకు ఎలాంటి కార్యకలాపాలు ప్రారంభించలేదు. ఎక్కడైనా నాలుగు నెలల్లో పీఆర్సీ ప్రక్రియ పూర్తయి, ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరుగుతుందా? ఇప్పుడు ఐఆర్ రాకపోతే దాదాపు ఏడాదికిపైగా ఐఆర్ నష్టపోయే ప్రమాదం ఉందని ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఉద్యోగుల సమస్యలపై శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రివర్గ ఉపసంఘం చర్చలు నిర్వహించింది. మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, చంద్రశేఖరరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, సాధారణ పరిపాలన శాఖ (సర్వీసెస్) కార్యదర్శి పోలా భాస్కర్ హాజరయ్యారు. 11వ పీఆర్సీ సమయం గతేడాది జూన్‌తో ముగిసింది. జులై నుంచి కొత్త పీఆర్సీ అమలు కావాల్సి ఉంది. గురుకులాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీల ఉద్యోగులకు ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్ల వర్తింపుపై వారు కోర్టు కేసు ఉపసంహరించుకున్నాక ఆలోచిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. బకాయిల చెల్లింపులపై గత చర్చల్లో ఇచ్చిన హామీలనే మళ్లీ వల్లెవేసింది.
బకాయిలపై అస్పష్టత
ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా హామీలేమీ లభించలేదు. ఏపీ ఐకాస ఈ నెల 27న నిర్వహించనున్న ‘చలో విజయవాడ’ను వాయిదా వేసుకోవాలని ప్రభుత్వం కోరింది. హామీలేమీ ఇవ్వనందున ఈ కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహిస్తామని ఏపీ ఐకాస ప్రకటించింది. 2004 సెప్టెంబరుకు ముందు ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగంలో చేరిన వారికి పాత పెన్షన్ విధానం అమలు తక్షణమే ప్రకటించాలని ఉద్యోగ సంఘాల నాయకులు కోరినా ప్రభుత్వం దాటవేత వైఖరినే అవలంబించింది. పెన్షనర్లకు అదనపు క్వాంటం పెన్షన్ 70, 75 ఏళ్లలో ప్రస్తుతం ఇస్తున్న 7%, 12%ను 10%, 15%కు పెంచడంపై ఏదో ఒకటి మాత్రమే చేస్తామని మంత్రివర్గ ఉపసంఘం చెప్పింది. పదవీవిరమణ చేసిన వారి బకాయిలపై సీఎస్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చర్చల్లో వెల్లడించారు. కారుణ్య నియామకాల వివరాలను జిల్లాల వారీగా తెప్పించుకుని త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారే తప్ప, ఎప్పటిలోపు అనే గడువు పెట్టలేదు. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించి కొంతమంది జాబితాను ఈ నెల చివరిలో విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. టీఏ, డీఏ బకాయిలు రూ.70 కోట్లు, సీపీఎస్ బకాయిలు రూ.100 కోట్లు, మెడికల్ రీయంబర్స్‌మెంట్ రూ.80 కోట్లు చెల్లించినట్లు తెలిపింది. చర్చల్లో ఇచ్చిన హామీలకు జీఓలు ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరారు.
ఉద్యమం కొనసాగుతుంది
– బండి శ్రీనివాసరావు, ఛైర్మన్, ఏపీ ఐకాస
డిమాండ్ల విషయంలో పురోగతి కనిపిస్తేనే ఉద్యమంపై పునరాలోచన చేస్తాం. అప్పటి వరకు ఉద్యమం కొనసాగుతుంది. ‘చలో విజయవాడ’ నిర్వహణలో ఎటువంటి మార్పు లేదు. డీఏలపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. 49 సమస్యల పరిష్కారం కోరాం. జీపీఎఫ్, సరెండర్ సెలవులపై గత చర్చల్లో చెప్పిన వాటినే మళ్లీ చెప్పారు. పీఆర్సీ బకాయిలపై ఏమీ చెప్పలేదు. పీఆర్సీ కమిషన్‌ను నియమించి ఆరునెలలు గడిచినా సిబ్బందిని, కార్యాలయాన్ని కేటాయించలేదు. ఏపీ ఐకాస ఉద్యమం ఫలితంగా తొమ్మిది మంది సిబ్బందిని నియమించారు.
ఐఆర్ సంప్రదాయానికి తిలోదకాలిచ్చారు
– బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఛైర్మన్, ఏపీ ఐకాస అమరావతి
కొత్త పీఆర్సీ కమిషన్‌ను నియమించినప్పుడు మధ్యంతర భృతి చెల్లించాలన్న సంప్రదాయానికి తిలోదకాలిచ్చారు. గతంలో ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రితో చర్చించే అవకాశం ఉండేది. సీఎంతో చర్చించే.. ఐఆర్ లేదనే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రభుత్వాలు మారినప్పుడు ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వడం ఆలస్యమవుతుంది. మధ్యంతర భృతి చెల్లించాలని, తగ్గించిన అదనపు క్వాంటం పింఛన్ పునరుద్ధరించాలని, 2004 ముందు చేరిన ఉద్యోగులకు పాత పింఛన్ విధానం అమలు చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కోరాం. గత చర్చల్లో హామీ ఇచ్చినట్లుగా మార్చి నాటికి రూ.4,800 కోట్లు, జూన్‌కు రూ.14,102 కోట్లు చెల్లిస్తామన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల పెంపుపై ఎటువంటి పురోగతి లేదు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణలో వైద్య, ఆరోగ్య శాఖలోనే 5 వేల మంది ఉంటే 1,300 మంది దరఖాస్తులే సచివాలయానికి చేరాయి. చిన్న చిన్న కారణాలతో దరఖాస్తులు తిరస్కరిస్తున్నారు. మహిళలకు శిశుసంరక్షణ సెలవులను వాడుకునే 18 సంవత్సరాల నిర్ణీత సమయాన్ని ఎత్తివేయాలని కోరాం.
ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు: ఎస్టీయూ
ఈనాడు డిజిటల్, అమరావతి: ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సాయిశ్రీనివాస్, రఘునాథరెడ్డిలు విమర్శించారు. 12 సార్లు మంత్రివర్గ ఉపసంఘంతో చర్చలు జరిగినా.. ఎటువంటి పురోగతి లేదని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి ఇచ్చిన హామీలు అలాగే మిగిలి ఉన్నాయన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం దాటవేత ధోరణితో ముందుకు వెళ్తోందని ఆరోపించారు. డిమాండ్లను పరిష్కరించకపోతే ఐకాస ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
పీఆర్సీయే ఇస్తాం.. ఐఆర్ ఎందుకు?
– మంత్రి బొత్స
పీఆర్సీనే అమలు చేస్తామని చెప్పినప్పుడు మధ్యంతర భృతి ఎందుకు? చెప్పిన సమయం ప్రకారం పూర్తి స్థాయిలో పీఆర్సీనే అమలు చేస్తాం. ‘చలో విజయవాడ’ను విరమించుకోవాలని ఏపీ ఐకాసను కోరాం. వారు సానుకూలంగానే స్పందిస్తారని అనుకుంటున్నాను. కాంట్రాక్టు ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం అనుకుంటోంది. కానీ, కొందరు ఉద్యోగుల అంశాలు కోర్టులో పెండింగులో ఉన్నాయి. వాటిపై మేం ఎటువంటి నిర్ణయం తీసుకోలేం. మరికొందరివి తప్పులు ఉన్నాయి. ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నవారిని క్రమబద్ధీకరిస్తాం. ఆ తరువాత మిగిలినవారిని రెగ్యులరైజ్ చేయాలనుకుంటున్నాం.