100 రకాల ఫుడ్ ఐటమ్స్.. తులం బంగారం.. లక్కంటే ఆ అల్లుడుదే

సరా నవరాత్రి ఉత్సవాలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించారు. అయితే ఈసారి పండుగ మాత్రం తెలంగాణలోని ఓ కొత్త అల్లుడుకి బాగా కలిసొచ్చింది. పండుగ సందర్భంగా ఇంటికి వచ్చిన అల్లుడి కోసం ప్రత్యేకంగా 101 రకాల వంటకాలు సిద్ధం చేశారు అత్తామామలు.


అయితే ఊహించని రీతిలో వారి మధ్య వచ్చిన ఓ ఛాలెంజ్ అల్లుడికి ఫుడ్ పార్టీతో పాటు తులం బంగారం సైతం దక్కేలా చేసింది. ఆలస్యంగా వెలుగు లోకి వచ్చిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది.

ఏం జరిగిందంటే..

వనపర్తి జిల్లా కొత్తకోట పురపాలికకు చెందిన గుంట సురేశ్, సహనల దంపతుల కుమార్తె సింధు రెండు నెలల క్రితం తిరుపతిలో నిఖిత్‌తో వివాహం జరిగింది. వివాహానంతరం వచ్చిన తొలి పెద్ద పండుగ కావడంతో దసరా సందర్భంగా అల్లుడు ఇంటికొస్తున్నాడని తెలిసి అత్తామామలు సంబరాల్లో మునిగిపోయారు. అల్లుడి కోసం ప్రత్యేకంగా అత్తామామలు ఫుడ్ పార్టీ ఏర్పాట్లు చేశారు. తెలంగాణ సాంప్రదాయ రుచులను గుర్తు చేసేలా 60 రకాల స్వీట్లు, 30 రకాల పిండి వంటలు, అలాగే 10 రకాల అన్నపదార్థాలు వడ్డించేందుకు సన్నాహాలు చేశారు.

101 రకాల వంటకాలు.. ఒకటి తక్కువ!

అయితే దసరా రోజు అల్లుడు నిఖిత్ ఇంటికి రాగానే విందు ఘనంగా సాగింది. పిండివంటలు, స్వీట్లు, రుచికరమైన పప్పులు, అన్నపదార్థాలు – అన్నీ చూసి అల్లుడు ఆశ్చర్యపోయాడు. అల్లుడు – అత్తామామల సరదా మాటలతో వారి మధ్య హాస్యవాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే 101 రకాల భోజనం అంటే ఒక్కటి తక్కువైతే ఏం చేస్తారు?” అని నవ్వుతూ అడిగాడు నిఖిత్‌. దానికి అత్తామామలు కూడా వెంటనే స్పందిస్తూ.. “ఒక్కటి తగ్గినా తులం బంగారం ఇస్తాం!” అని సవాల్ విసిరారు.

ఇక ఆ మాట విన్న అల్లుడు తక్షణమే ఒక్కొక్క వంటకాన్ని లెక్కపెట్టడం ప్రారంభించాడు. రెండుసార్లు లెక్కపెట్టాక అసలు విషయం బయటపడింది. విందులో 101 రకాల వంటకాలు కాకుండా మొత్తం 100 మాత్రమే ఉన్నాయి. వెంటనే అల్లుడు నవ్వుతూ.. బహుమతి దక్కించుకున్నానని, అందులో 100 రకాల ఐటమ్స్ మాత్రమే ఉన్నాయని తెలిపాడు. దాంతో ఇచ్చిన మాట మేరకు అత్తామామలు అల్లుడికి తులం బంగారం అందజేశారు.

సోషల్ మీడియాలో వైరల్

ఈ వినోదభరిత సంఘటనను కుటుంబ సభ్యులు వీడియో తీయగా, అది సోషల్ మీడియాలో షేర్ చేయగానే విపరీతంగా వైరల్ అయింది. అల్లుడు తెలివి, అత్తామామల మాట నిలబెట్టుకోవడం రెండూ బాగున్నాయి” అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మొత్తానికి అటు ఫుడ్.. ఇటు తులం బంగారం దక్కించుకొని లక్కున్నోడు అనిపించుకుంటున్నారు ఈ కొత్త అల్లుడు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.