రైల్వే జాబ్ లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న వారికి అదిరిపోయే న్యూస్. రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్ నుంచి భారీ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఏకంగా వేల సంఖ్యలో ఉద్యోగాలు భర్తీకానున్నాయి. తాజాగా ఆర్ఆర్బీ 11,558 పోస్టులను భర్తీకి సంబంధించిన షార్ట్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. గ్రాడ్యుయేట్ పోస్టులు (లెవల్ 5, 6 పోస్టులు), అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల (లెవల్ 2, 3) కోసం ఆర్ఆర్ బీ ఎన్టీపీసీ 2024 దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భారతీయ రైల్వేలలో వివిధ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు 8113 ఉన్నాయి. అలాగే.. అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు 3445 ఉన్నాయి.
గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టుల కోసం దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 14వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు అక్టోబర్ 13 వరకు అప్లై చేసుకోవచ్చు. అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల కోసం దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 21వ తేదీ నుంచి అక్టోబర్ 20, 2024 వరకు ఉంటుంది. అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు అభ్యర్థులు ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. గ్రాడ్యుయేట్ పోస్టులకు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఈ ఉద్యోగాలకు సీబీటీ టెస్ట్, టైపింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ తదితరాల ఆదారంగా ఎంపిక చేస్తారు.
అభ్యర్థుల వయసు గ్రాడ్యుయేట్ పోస్టులకు 18 నుంచి 36 ఏళ్లు, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు 18 నుంచి 33 ఏళ్లు ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ. 500, ఎస్సీ, ఎస్టీ, మహిళలకు రూ. 250గా నిర్ణయించారు. గ్రాడ్యుయేట్ పోస్టుల్లో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉండే అవకాశం ఉంది. అండర్ గ్రాడ్యుయేట్ కేటగిరీలో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్ క్లర్క్, ట్రైన్స్ క్లర్క్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు ఉద్యోగాలు ఉండే ఛాన్స్ ఉంది.