భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ప్రజల కోసం రెండు కొత్త స్కీమ్స్ ప్రవేశపెట్టింది. అవి ప్రొటెక్షన్ ప్లస్ & బీమా కవచ్.
ఈ ప్లాన్లు జీవిత బీమా రక్షణతో పాటు సేవింగ్స్ చేసుకునే అవకాశాన్ని కూడా ఇస్తాయి. ప్రొటెక్షన్ ప్లస్ ప్లాన్ ద్వారా డబ్బు పెట్టుబడి పెడితే, ఎక్కువ కాలంలో అధిక సంపద పెరుగుతుంది. అలాగే బీమా కవచ్ ప్లాన్ ద్వారా మీ కుటుంబానికి ఆర్థిక భద్రత లభిస్తుంది. ఈ రెండు LIC పథకాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే… ప్రజలకు సులువైన, లాభదాయకమైన, నమ్మదగిన దీర్ఘకాలిక పాలసీని ఇవ్వడం. దీనివల్ల కష్టకాలంలో పాలసీదారునికి ఇంకా వారి కుటుంబానికి డబ్బు పరంగా భరోసా ఉంటుంది. ఈ రెండు ప్లాన్ల గురించి చుస్తే..
LIC ప్రొటెక్షన్ ప్లస్ గురించి:
సేవింగ్స్ తో పాటు బీమా రక్షణ కూడా కావాలనుకునే వారికి, లేదా పెట్టుబడుల ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు కూడబెట్టుకోవాలని అనుకునే వారికి ఈ పథకం బాగా ఉపయోగపడుతుంది. ఇది మరణించిన తరువాత బీమా కవర్‌ను మాత్రమే కాకుండా, పెట్టుబడుల ఆధారంగా (యూనిట్ ఫండ్) డబ్బు విలువను కూడా అందిస్తుంది. ఈ పథకం మీ డబ్బును మార్కెట్‌తో అనుసంధానం చేస్తుంది. అందుకే, మామూలు LIC పాలసీల కంటే ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది.
LIC ప్రొటెక్షన్ ప్లస్ ప్రత్యేకత :
*మీకు వీలైతే మీరు అదనంగా డబ్బు (ప్రీమియం) కట్టవచ్చు. దీనివల్ల మీ ఫండ్ పెట్టుబడి మరింత పెరుగుతుంది.
*మీరు కట్టే ప్రీమియం డబ్బును ఏ రకమైన పెట్టుబడి నిధి (ఫండ్) లోకి మళ్లించాలో మీరే నిర్ణయించుకోవచ్చు.
* పాలసీ మొదలుపెట్టిన తేదీ నుండి ఐదు సంవత్సరాలు అయిన తర్వాత, మీరు మీ ఫండ్‌లోంచి కొంత మొత్తాన్ని తీసుకోవచ్చు.
*పాలసీ గడువు పూర్తయినప్పుడు, పాలసీదారుడు జీవించి ఉంటే, అప్పటికి మీ యూనిట్-ఫండ్ వాల్యూ ఎంత ఉంటే అంతా మీకు అందుతుంది.
*ఒకవేళ పాలసీదారుడు మరణిస్తే, నామినీకి బీమా హామీ ఇచ్చిన మొత్తం అలాగే అప్పటికి ఉన్న ఫండ్ విలువ రెండూ కలిపి ఇవ్వబడతాయి.
LIC బీమా కవచ్ గురించి:
ఈ ప్లాన్ అనేది పూర్తిగా రిస్క్ రక్షణ (Risk Protection) కోసం ఉద్దేశించిన ఒక సాధారణ టర్మ్ ప్లాన్ లాంటిది. ఇందులో మీరు పెట్టిన డబ్బు పెరగడం లాంటి పెట్టుబడులు లేదా సేవింగ్స్ ఉండవు. పాలసీదారుడు చనిపోయినప్పుడు, అతని కుటుంబానికి లేదా నామినీకి నిర్ణీత మొత్తం (Fixed Death Benefit) అందుతుంది.ఇది నాన్-లింక్డ్ (మార్కెట్‌తో సంబంధం లేని), నాన్-పార్టిసిపేటింగ్ (లాభాల్లో భాగస్వామ్యం లేని), సాధారణ వ్యక్తిగత జీవిత బీమా పథకం.
ఈ స్కీమ్ ప్రత్యేకతలు:
* 18 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఏ వ్యక్తి అయినా ఈ స్కీమ్ లో చేరవచ్చు.
* పాలసీ గడువు (మెచ్యూరిటీ) అనేది 100 సంవత్సరాల వరకు ఉండవచ్చు.
* ఈ పాలసీ కింద, మీరు కవరేజీని (బీమా మొత్తాన్ని) రెండు విధాలుగా ఎంచుకోవచ్చు. ఈ పాలసీ కింద, లెవల్ సమ్ అష్యూర్డ్ అండ్ పెరుగుతున్న మొత్తాన్ని కాలక్రమేణా ఎంచుకోవడానికి ఒక ఎంపిక ఉంటుంది
*మీరు ప్రీమియం చెల్లించడానికి మూడు పద్ధతులను ఎంచుకోవచ్చు: సింగిల్ ప్రీమియం, లిమిటెడ్ ప్రీమియం, రెగ్యులర్ ప్రీమియం.
కనీస కాలవ్యవధి (Minimum Term):
*సింగిల్-ప్రీమియం అయితే కనీసం 10 సంవత్సరాలు.
*లిమిటెడ్-ప్రీమియం అయితే 10, 15, లేదా 20 సంవత్సరాలు.
*రెగ్యులర్-ప్రీమియం అయితే కనీసం 10 సంవత్సరాలు.
కనీస బీమా మొత్తం: కనీసం రూ.2 కోట్ల బీమా మొత్తాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.


































