ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటుకు రంగం సిద్దమైంది. అదే విధంగా కొత్తగా రెవిన్యూ డివిజన్లు.. మండలాలు ఏర్పాటు కానున్నాయి. నియోజకవర్గాలను పాత జిల్లాల్లోకి మార్పు దిశగా కసరత్తు తుది దశకు చేరింది.
జిల్లాల పునర్విభజన ప్రక్రియ కోసం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం కీలక ప్రతిపాదనలు సిద్దం చేసింది. ఈ నెల 7న జరిగే కేబినెట్ భేటీలో చర్చించి.. డిసెంబర్ చివరి నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి.
ఏపీలో కొత్త జిల్లాలు దాదాపు ఖరారయ్యాయి. ప్రస్తుతం ఉన్నవాటిల్లోనూ మార్పులు ఖాయం అయ్యాయి. నాలుగు జిల్లాలు అదనంగా ఏర్పాటు కానున్నాయి. మార్కాపురం, అమరావతి, ఏజెన్సీ సహా మదనపల్లె కొత్త జిల్లాలు కానున్నాయి. 10 కొత్త రెవిన్యూ డివిజన్లు ఏర్పాటు దిశగా కసరత్తు జరుగుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు మండలాలు.. జిల్లాల్లో మార్పులు చేసేందుకు ప్రతిపాదనలు సిద్దం అయ్యాయి. వీటికి తుది రూపు ఇచ్చేందుకు ముఖ్యమంత్రితో జరిగే సమావేశం లో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఆ తరువాత నవంబరు 7న జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది.
ఆ తర్వాత ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరిస్తారు. అనంతరం గెజిట్ విడుదల చేస్తారు. జనగణన నేపథ్యంలో డిసెంబరు 31వ తేదీలోగానే మొత్తం ప్రక్రియ పూర్తిచేయాల్సి ఉంది. మార్కాపురం కేంద్రంగా కనిగిరి, గిద్దలూరు, యర్రగొండపాలెం, దర్శి, మార్కాపురం నియోజకవర్గాలతో జిల్లా ఏర్పాటుకు రంగం సిద్దమైంది. కనిగిరి నియోజకవర్గాన్ని తిరిగి ప్రకాశం లో చేర్చే అవకాశం కనిపిస్తోంది. రంపచోడవరం, చింతూరు డివిజన్లతో పాటు 4 విలీన మండలాలతో జిల్లా ఏర్పాటుకు ప్రతిపాదించినట్లు తెలిసింది. అమరావతి కేంద్రంగా పల్నాడు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలోని నియోజకవర్గాలతో కొత్త జిల్లా ఏర్పాటు ప్రతిపాదన ఉంది. మదనపల్లె కేంద్రంగా జిల్లా ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలపై నివేదికలో వివరించనున్నారు. ఇక.. అద్దంకి, మడకశిర సహా 10 కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనలు తయారు చేశారు.
ఒక నియోజకవర్గం రెండు, మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఉంటే పరిపాలనా సౌలభ్యం మేరకు ఒకే నియోజకవర్గ పరిధిలోకి తేవాలని యోచిస్తున్నారు. మండపేట, కొత్తపేట, ఎస్.కోట సహా కొన్ని నియోజకవర్గాల్ని ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు మార్చాలనే ప్రతిపాదనలు అందాయి. వీటి పైన సీఎంతో భేటీలో చర్చించి.. కేబినెట్ సమావేశం నాటికి తుది రూపు ఇవ్వనున్నారు.



































