రేపటి కోసం తిరుమలలో 5 లక్షల శ్రీవారి లడ్డూలు స్టాక్

ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. గురువారం నాడు 64,571 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 23,634 మంది తలనీలాలు సమర్పించారు.


తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.84 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 నుంచి 14 గంటల సమయం పట్టింది.

మినీ బ్రహ్మోత్సవం

25వ తేదీన రథ సప్తమిని పురస్కరించుకుని మినీ బ్రహ్మోత్సవం జరుగనుంది తిరుమలలో. ఒకే రోజున శ్రీవారు సప్త వాహనాలపై ఊరేగనున్నాడు. బ్రహ్మోత్సవ సమయంలో నిర్వహించే వాహనసేవలన్నీ కూడా ఒకేరోజున భక్తుల ముందు సాక్షాత్కారం కానున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై టీటీడీ నిరంతరం సమీక్షిస్తోంది. రథ సప్తమి నాడు భక్తులు భారీ సంఖ్యలో తిరుమలకు వచ్చే అవకాశాలు ఉన్నందున దీనికి అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేస్తోంది.

ఏర్పాట్లను పరిశీలించిన ఏఈఓ

భక్తుల సంతృప్తే లక్ష్యంగా ఈ వేడుకలను నిర్వహించనున్నట్లు టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, సీవీఎస్వో మురళీకృష్ణలతో కలిసి శ్రీవారి ఆలయ మాడ వీధుల్లో రథ సప్తమికి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాడ వీధుల్లోని గ్యాలరీలు, అన్న ప్రసాదాల పంపిణీకి తీసుకుంటున్న చర్యలు పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు.

అదనంగా అయిదు లక్షల లడ్డూలను బఫర్ స్టాక్

భక్తుల భద్రత, వివిధ విభాగాల సమన్వయం, ప్రవేశ, నిష్క్రమణ మార్గాల వద్ద అధికారుల తీసుకోవాల్సి చర్యలు వంటి అంశాలపై క్షేత్రస్థాయిలో సమీక్షించారు. రథసప్తమి నాడు అదనంగా అయిదు లక్షల లడ్డూలను బఫర్ స్టాక్ గా నిల్వ ఉంచుకోవాలని ఇదివరకే ఈఓ సూచించిన విషయాన్ని గురక్తు చేశారు. పార్కింగ్ కు ఇబ్బంది లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని, ట్రాఫిక్ అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

ఆర్జిత సేవలు రద్దు..

రథ సప్తమి, సప్త వాహనోత్సవాల నేపథ్యంలో 25వ తేదీ నాడు తిరుమలలో వివిధ రకాల ఆర్జిత సేవలు రద్దయ్యాయి. కొన్ని ప్రివిలేజ్ దర్శనాలను కూడా టీటీడీ రద్దు చేసింది. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు రద్దు చేసింది టీటీడీ.

వీఐపీ, ప్రివిలేజ్ దర్శనాలు రద్దు

ఎన్నారైలు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాల రద్దుయ్యాయి. తిరుపతిలో 24, 25, 26వ తేదీల్లో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు జారీని నిలిపివేశారు. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు, బ్రేక్ దర్శనాలకు సంబంధించి నేడు ఎలాంటి సిఫార్సు లేఖలను టీటీడీ స్వీకరించదు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.