ఏడాదిలో 54 వేల ఉద్యోగాల భర్తీ.. త్వరలో 16 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్

www.mannamweb.com


తొలి ఏడాదిలోనే సుమారు 54 వేల ఉద్యోగాలను భర్తీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో మరిన్ని నోటిఫికేషన్లను జారీ చేసేందుకు కసరత్తు చేస్తున్నది.

ఎస్సీ వర్గీకరణ పూర్తయిన వెంటనే ఉద్యోగాల నియామక ప్రక్రియ ప్రారంభించేందుకు సిద్ధం అవుతున్నది. ఇప్పటికే వర్గీకరణపై ఏర్పాటైన జ్యుడీషియల్ కమిషన్ అన్ని కోణాల్లో ఆధ్యయనం చేస్తున్నది. ఆ కమిషన్ రిపోర్టు ఇవ్వగానే వర్గీకరణపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుని, గుర్తించిన ఖాళీలను భర్తీ చేసేందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు పంపిస్తామని ప్రభుత్వవర్గాలు పేర్కొన్నాయి.

ఇప్పటికే 16 వేల ఉద్యోగాల గుర్తింపు

వచ్చే ఏడాది డిసెంబరు నాటికి 16 వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సర్కారు నిర్ణయించినట్టు తెలుస్తున్నది. అందులో ప్రధానంగా టీచర్ పోస్టులు, గ్రూప్-3 ఉద్యోగాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఎస్సీ వర్గీకరణపై ఫైనల్ డెసిషన్ తీసుకున్న తర్వాత కొత్తగా నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నది. అందులో భాగంగా వర్గీకరణపై ఏర్పాటైన వన్ మ్యాన్ జ్యుడీషియల్ కమిషన్ సిఫారసుల కోసం సర్కారు ఎదురుచూస్తున్నది. కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎస్సీ కులాల వాటాను ఆరా తీసినట్టు తెలిసింది. అలాగే మంత్రివర్గ ఉపసంఘానికి దళిత సంఘాల నుంచి అందిన వినతులను సైతం పరిశీలించినట్టు సమాచారం. ‘త్వరలో వర్గీకరణపై జ్యుడీషియల్ కమిషన్ సిఫారసులు ప్రభుత్వానికి అందవచ్చు. వెంటనే ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుని, చట్ట సవరణ చేస్తది. వెంటనే కొత్తగా నోటిఫికేషన్ల జారీకి టీజీపీఎస్సీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తది’ అని ఓ సీనియర్ బ్యూరోక్రట్ వెల్లడించారు.

మళ్లీ టీచర్ పోస్టుల భర్తీ?

టీచర్ పోస్టుల భర్తీపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. కేవలం పది నెలల కాలంలో 11,062 మంది టీచర్లను నియమించింది. నోటిఫికేషన్ జారీ నుంచి, నియామక పత్రాలు అందించేవరకు ఎక్కడ కూడా న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నది. ఇప్పుడు మరో నాలుగైదు వేల టీచర్ల పోస్టులను భర్తీ చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తున్నది. వచ్చే ఏడాది డిసెంబర్ చివరి నాటికి ఏర్పాడే ఖాళీల వివరాలను సేకరిస్తున్నట్టు సమాచారం.