ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన కుప్పం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. పారిశ్రామిక ప్రగతికి పెద్దపీట వేస్తూ, ఒకే రోజు ఏకంగా ఏడు భారీ పరిశ్రమలకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. రూ.2,203 కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చే ఈ పరిశ్రమల కోసం 241 ఎకరాల స్థలం కేటాయించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 22,330 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఒకప్పుడు అత్యంత వెనుకబడిన ప్రాంతంగా ఉన్న కుప్పాన్ని పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు.
కుప్పం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు కానున్న ఈ ఏడు సంస్థల్లో దేశంలోని దిగ్గజ కంపెనీలు ఉన్నాయి. ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన హిందాల్కో సంస్థ రూ.586 కోట్లతో మొబైల్, ల్యాప్‌టాప్ వంటి టెక్ పరికరాల విడిభాగాల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది.
శ్రీజా డైరీ రూ.290 కోట్లతో సమీకృత డెయిరీ, పశువుల మేత ప్లాంటును, ఏస్ ఇంటర్నేషనల్ సంస్థ రూ.525 కోట్లతో గ్రీన్ ఫీల్డ్ డెయిరీ ఉత్పత్తుల కాంప్లెక్స్‌ను, ఎస్వీఎఫ్ సోయా రూ.373 కోట్లతో వంట నూనెల తయారీ యూనిట్‌ను స్థాపించనున్నాయి. వీటితో పాటు మదర్ డైరీ రూ.260 కోట్లతో పండ్ల రసాల యూనిట్‌ను, ఇ-రాయిస్ ఈవీ రూ.200 కోట్లతో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కేంద్రాన్ని, అలీప్ సంస్థ రూ.27 కోట్లతో మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక పార్కును అభివృద్ధి చేయనుంది.
కుప్పం దశ మార్చే ప్రణాళిక
ఈ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు పూర్తి సహకారం అందిస్తున్నామని తెలిపారు. సింగిల్ విండో విధానం ద్వారా పరిశ్రమలకు త్వరితగతిన అనుమతులు ఇస్తున్నామని, భవిష్యత్తులో స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఏరో స్పేస్ సిటీలను ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు కూడలిగా ఉన్న కుప్పం భౌగోళిక ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకొని మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించారు.
రైతులకు, మహిళలకు పెద్దపీట
ఈ పరిశ్రమల రాకతో కేవలం యువతకు ఉద్యోగాలే కాకుండా, స్థానిక రైతులు, మహిళలకు కూడా ఎంతో ప్రయోజనం చేకూరనుంది. శ్రీజా డెయిరీ రోజుకు నాలుగు లక్షల లీటర్ల పాలను, మదర్ డైరీ పండ్లను, ఎస్వీఎఫ్ సోయా స్థానిక పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తాయని, దీనివల్ల పాడి, వ్యవసాయ రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందని సీఎం తెలిపారు.
ప్రత్యేకంగా మహిళల కోసం అలీప్ సంస్థ నిర్మిస్తున్న ‘మహిళా శక్తి భవన్’ ద్వారా 4,000 మందికి ఉపాధి, శిక్షణ లభిస్తాయని చెప్పారు. ఈ ఏడాదిలో డ్వాక్రా, మెప్మా సంఘాల నుంచి లక్ష మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. “వన్ ఫ్యామ్లీ-వన్ ఎంటర్‌ప్రెన్యూర్, వన్ ఫ్యామ్లీ-వన్ ఏఐ నిపుణుడు అనే పాలసీలతో చరిత్రను తిరగరాస్తాం” అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
త్వరలో మరో 8 కంపెనీలు
ఈ ఏడు కంపెనీలే కాకుండా త్వరలోనే రూ.6,339 కోట్ల పెట్టుబడితో మరో 8 సంస్థలు కుప్పానికి రానున్నాయని, వాటి ద్వారా అదనంగా 43 వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని చంద్రబాబు శుభవార్త చెప్పారు. దీంతో బ్యాటరీ టెక్నాలజీ, మెడికల్ డివైసెస్, ఫుడ్ లాజిస్టిక్స్ వంటి రంగాల్లో కుప్పం కీలక కేంద్రంగా మారనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
కరవును దూరం చేసేందుకు 700 కిలోమీటర్ల దూరం నుంచి హంద్రీ-నీవా జలాలను కుప్పానికి తీసుకొచ్చామని, దీంతో తాగు, సాగు, పారిశ్రామిక అవసరాలకు నీటి కొరత ఉండదని హామీ ఇచ్చారు. సంక్షేమం, అభివృద్ధిని సమన్వయం చేస్తూ, సూపర్ సిక్స్ హామీలను సూపర్ హిట్ చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని ఆయన పునరుద్ఘాటించారు.
































