ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు అంతా 8వ వేతన సంఘం కోసం నిరీక్షిస్తున్నారు. ఎందుకంటే కొత్త వేతన సంఘం అమల్లోకి వస్తే ఉద్యోగులు, పెన్షనర్లకు భారీగా ప్రయోజనం కలగనుంది.
జీతభత్యాలు పెద్దఎత్తున పెరగనున్నాయి. పెన్షనర్లకు పెన్షన్ కూడా రెట్టింపు కావచ్చు. ఇంకా ఇతర లాభాలు చాలా ఉంటాయి.
అయితే ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలో ఓ ప్రశ్న వేధిస్తోంది. 2026 కంటే ముందు రిటైర్ అయిన ఉద్యోగులకు 8వ వేతన సంఘం ప్రయోజనాలు వర్తించవనే ప్రశ్న విన్పిస్తోంది. వాస్తవానికి 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు కూడా ప్రయోజనం ఉంటుంది. ఇప్పటి వరకు ప్రతిసారీ ఇదే జరిగింది. అయితే 2026 కంటే ముందు పదవ విరమణ చేసి ఉద్యోగులకు కొత్త వేతన సంఘం ప్రయోజనాలు అందవనే వార్త ఆందోళన కల్గిస్తోంది. అదే జరిగితే లక్షలాది మంది ఉద్యోగులకు ప్రయోజనాలు అందవు. 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు ముఖ్యంగా 2026 జనవరి 1 కంటే ముందు రిటైర్ అయి ఉంటే వారికి కొత్త వేతన సంఘం ద్వారా అందే ప్రయోజనాలు అందకపోవచ్చు. కేంద్ర ఆర్ధిక బిల్లు 2025 ద్వారా కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లను రెండు గ్రూపులుగా విభజించనుందని తెలుస్తోంది. 2026 జనవరి తరువాత రిటైర్ అయిన ఉద్యోగులు ఓ గ్రూప్‌లో ఉంటే అంతకంటే ముందు రిటైర్ అయిన వ్యక్తులు మరో గ్రూపులో ఉంటారు.
పెన్షన్ నిబంధనలకు సంబంధించి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఇదే విషయమై పలు ప్రశ్నలు లేవనెత్తుతోంది. పెన్షన్ నిబంధనల్లో ఇటీవల చేసిన మార్పులు చేర్పుల వెనుక కేంద్ర ప్రభుత్వానికి రహస్య ఎజెండా ఉందని ఆరోపిస్తోంది. తాజాగా కేంద్ర ఆర్ధిక బిల్లు 2025లో చేసిన సవరణల సందర్భంగా ఈ ప్రశ్న తలెత్తింది. కేంద్ర ప్రభుత్వం లక్షలాది మంది రిటైర్డ్ ఉద్యోగుల ప్రయోజనాలు అందకుండా చేస్తోందని కాంగ్రెస్ నేత ఎంపీ కేసి వేణుగోపాల్ ఆరోపిస్తున్నారు.
అయితే కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం ఈ పుకార్లను కొట్టిపారేస్తున్నారు. పెన్షన్ నిబంధనల్లో చేసిన మార్పులు కేవలం ప్రస్తుతం ఉన్న పాలసీలకు వేలిడేషన్ మాత్రమేనని ఎవరి వ్యక్తిగత ప్రయజనాల్లో మార్పు ఉండదని స్పష్టం చేశారు. కొత్తగా ఏర్పడుతున్న 8వ వేతన సంఘం సిఫార్సులు 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన జీతభత్యాలు, పెన్షన్ అందించడమే కొత్త వేతన సంఘం ప్రధాన ఉద్దేశ్యం.