Everest Masala: ‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశించిన ఎస్‌ఎఫ్‌ఏ..!

www.mannamweb.com


Everest Masala : ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలా.. భారతదేశం నుండి విదేశాలకు ఎక్కువగా ఎగుమతి చేసుకుంటున్న ప్రముఖ మసాలా మిశ్రమం. దీని తయారీపై ఇప్పుడు విదేశాల్లో సంచలనాత్మక ఆరోపణలు వచ్చాయి. భారతదేశం నుంచి దిగుమతి చేసుకున్న ‘ఎవరెస్ట్‌ చేపల కూర మసాలా’లో పరిమితికి మించి పురుగుమందు అవశేషాలు ఉన్నట్టు సింగపూర్‌ ఫుడ్‌ ఏజెన్సీ (ఎస్‌ఎఫ్‌ఏ) ఆరోపించింది. దీంతో ఫిష్‌ మసాలా ప్యాకెట్లను రీకాల్‌ చేయాలని ఎస్‌ఎఫ్‌ఏ ఆదేశించింది. హాంకాంగ్‌లోని సెంటర్‌ ఫర్‌ ఫుడ్‌ సేఫ్టీ జారీ చేసిన నోటిఫికేషన్‌కు ప్రతిస్పందనగా ఈ చర్య తీసుకున్నట్టు సింగపూర్‌ తెలిపింది.

ఎవరెస్ట్‌ ఫిష్‌ కర్రీ మసాలాలో ఇథిలీన్ ఆక్సైడ్ స్థాయిలు పరిమితికి మించి ఎక్కువగా ఉన్నాయని సూచిస్తూ హాంకాంగ్ ఫుడ్ సేఫ్టీ సెంటర్ నుండి నోటీసు వచ్చింది. ఉత్పత్తులను వెనక్కి తీసుకునే ప్రక్రియ ప్రారంభించాలని ఎస్పీ ముత్తయ్య అండ్‌ సన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు సూచించింది. అయితే ఈ ఆరోపణపై ఎవరెస్ట్‌ కంపెనీ ఇంకా స్పందించలేదని సమాచారం.

SFA ప్రకారం, ఇథిలీన్ ఆక్సైడ్ ఆహారంలో ఉపయోగించడానికి అనుమతి లేదు. సూక్ష్మజీవుల కలుషితాన్ని నిరోధించడానికి సాధారణంగా వ్యవసాయ పనుల్లో దీన్ని ఉపయోగిస్తారని చెప్పింది. తక్కువ స్థాయి ఇథిలీన్ ఆక్సైడ్‌తో కలుషితమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల తక్షణ ప్రమాదం లేనప్పటికీ, దీర్ఘకాలికంగా బహిర్గతం కావడం వల్ల ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. అందువల్ల, పదార్ధం వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించాన్నారు.