Heat Waves: సూర్యుడు చంపేస్తున్నాడు.. ఒకేరోజు 19 మంది మృతి

www.mannamweb.com


Heat Waves: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణంగా మే నెల చివరివారంలో ఉండే గరిష్ట ఉష్ణోగ్రతలు.. మే తొలివారంలో దంచికొడుతున్నాయి. శనివారం రాష్ట్రంలో అత్యధికంగా జగిత్యాల జిల్లా అల్లీపూర్, కరీంనగర్ జిల్లా వీణవంకలో గరిష్టంగా 46.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా 45 డిగ్రీల సెల్సియస్‌కుపైగా నమోదైంది. దాదాపు అన్ని ప్రాంతాల్లో సాధారణం కన్నా ఎక్కువగా నమోదయ్యాయి.

వడగాలుల తీవ్రత పెరిగే ఛాన్స్‌..
శనివారం రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో వడగాలులు వీచాయి. ఆది, సోమవారాల్లో వడగాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈమేరకు పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా, ములుగు, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల, కరీంనగర్, ఖమ్మం జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. రాష్ట్రంలోని మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, తక్షణ సహాయక చర్యలు తీసుకునేలా ఏర్పాటు చేసుకోవాలని సూచించింది.

వడదెబ్బకు 19 మంది మృతి..
రాష్ట్రంలో తీవ్రంగా ఉన్న ఎండల కారణంగా వడదెబ్బ తగిలి శనివారం వివిధ ప్రాంతాల్లో 19 మంది మృతిచెందారు. జగిత్యాల జిల్లాలో ఎంఈవో బత్తుల భూమయ్య, భీర్‌పూర్‌ మండలం మగేళ శివారు గోండగూడెంకు చెందిన కొమురం సోము సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌మండలం భల్లునాయక్‌ తండాకు చెందిన ఉపాధ్యాయుడు లకావత్‌ రామన్న అస్వస్థతకు గురై మృతిచెందారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌లో మండలం ముక్కిడిగుండం గ్రామానికి చెందిన శక్రునాయక్‌ మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామానికి చెందిన దేవయ్య, సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేట కు చెందిన యాదయ్య వర్గల్‌కు చెందిన నాగయ్య మృతిచెందారు.

వరంగల్‌ జిల్లాలో ఆరుగురు..
వడదెబ్బతోఒక్క వరంగల్‌ జిల్లాలోనే ఆరుగురు మృతిచెందారు. చెన్నారావుపేట మండలానికి చెందిన భాస్కర్, హరియా తండాకు చెందిన నర్సింహ, ఇప్పల్‌తండాకు చెందిన అజ్మీర మంగ్యా, రంగాపూర్‌ గ్రామానికి చెందిన లక్ష్మి, గాంధీనగర్‌కు చెందిన ఆవుల కనకయ్య, కాటారం మండలం రేగులగూడేనికి చెందిన మేలక లస్మయ్య వడదెబ్బతో ప్రాణాలు విడిచారు.

ఇద్దరు ఉపాధి కూలీలు..
కామారెడి డజిల్లా నాగిరెడ్డిపేట మండలం జప్తిజాన్కంపల్లి గ్రామానికి చెందిన రాములు, కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం కందుగులకు చెందిన వనమాల ఉపాధి పనిస్థంలోనే కుప్పకూలారు.