Royal Challengers Bengaluru : ఐపీఎల్ 17వ సీజన్‌లో కాస్త ఆలస్యంగా పుంజుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. వరుసగా మూడు మ్యాచుల్లోనూ విజయం సాధించింది. శనివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో అట్టడుగు నుంచి ఏడో స్థానానికి ఎగబాకింది. లీగ్ దశలో ఆర్‌సీబీ ఇంకా మూడు మ్యాచులు ఆడాల్సి ఉంది. ఈ మూడింటిలో విజయం సాధించినప్పటికీ డుప్లెసిస్ సేన ప్లే ఆఫ్స్ చేరుకునేందుకు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.
ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే.?
షరతు 1 : ఎట్టి పరిస్థితుల్లో ఆర్‌సీబీ లీగ్ దశలో మిగిలిన మూడు మ్యాచుల్లోనూ విజయం సాధించాలి. అప్పుడు ఆ జట్టు 7 విజయాలతో 14 పాయింట్లను కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఆర్‌సీబీ నెట్‌రన్‌రేటు -0.049గా ఉంది. మిగిలిన మ్యాచుల్లో భారీ విజయాలు సాధించి వీలైనంత మేర నెట్‌రన్‌రేటును మెరుగుపరచుకోవాలి.
షరతు 2 : బెంగళూరు మిగిలిన మూడు మ్యాచుల్లో గెలిచినట్లయితే.. సన్‌రైజర్స్ హైదరాబాద్ లేదా లక్నో సూపర్ జెయింట్స్‌లు తమ మిగిలిన లీగ్ మ్యాచుల్లో ఒకటి కంటే ఎక్కువ విజయాలు సాధించకూడదు. ఎందుకంటే రెండు జట్లు కూడా 10 మ్యాచులు ఆడి 12 పాయింట్లతో ఉన్నాయి.
షరతు 3 : అదే సమయంలో ప్రస్తుతం 10 పాయింట్లతో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు రెండు కంటే ఎక్కువ విజయాలు సాధించకూడదు.
షరతు 4 : టాప్-4 నిలిచేందుకు పంజాబ్ కింగ్స్ సైతం పోటీపడుతోంది. 10 మ్యాచులు ఆడిన ఆ జట్టు ఖాతాలో 8 పాయింట్లు ఉన్నాయి. ఆ జట్టు సైతం రెండు కంటే ఎక్కువ మ్యాచులు గెలవకూడదు.
పై నాలుగు జరిగితేనే ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఒకవేళ లీగ్ దశలో ఆర్‌సీబీ ఆడాల్సిన మూడు మ్యాచుల్లో ఒక్కటి ఓడిపోయినా కూడా ఆ జట్టు ప్లే ఆఫ్స్ దారులు మూసుకుపోయినట్లే.