Land Titling Act: ‘నేను ప్రత్యక్ష బాధితుడినే’.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌‌పై మాజీ ఐఏఎస్ ట్వీట్

www.mannamweb.com


ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ (Land Titling Act) ఎంతటి దుమారాన్ని రేపుతుందో అందరికీ తెలిసిందే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌తో ప్రజల ఆస్తులకు ముప్పు అంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌లో భూవివాదాలు కూడా వరుసగా బయటపడుతున్నాయి. తాజాగా ఈ యాక్ట్‌పై మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ (Former IAS PV Ramesh) సంచలన ట్విట్ చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌‌లో తాను బాధితుడినే అని పేర్కొన్నారు. తన తల్లిదండ్రుల భూములపై హక్కు లేకుండా చేస్తున్నారంటూ మాజీ ఐఏఎస్ మండిపడ్డారు.

మాజీ ఐఏఎస్ ట్వీట్ ఇదే..

‘‘నేను #AndhraPradesh #LandTitlingAct ప్రత్యక్ష బాధితుడిని. కృష్ణా జిల్లా విన్నకోట గ్రామంలో చనిపోయిన నా తల్లిదండ్రుల పట్టా భూములను మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారు. తహశీల్దార్ నా దరఖాస్తును తిరస్కరించారు. ఆర్డీవో పోస్ట్ ద్వారా పంపిన పత్రాలను తెరవకుండానే తిరిగి ఇచ్చేశారు. నా తల్లిదండ్రుల భూములపై నాకు హక్కు లేకుండా చేస్తున్నారు. ఐఏఎస్‌ అధికారిగా 36 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్‌కు సేవలందించిన ఓ అధికారి పరిస్థితి ఇలా ఉంటే, సామాన్య రైతుల దుస్థితిని ఊహించలేం’’ అంటూ పీవీ రమేష్ ఆవేదనతో ట్వీట్ చేశారు.